- Home
- Business
- క్యాబ్‌డ్రైవర్లు, ఫ్రీలాన్సర్లు, డెలివరీ బాయ్స్‌కి పండగలాంటి వార్త.. ఐడీ కార్డులతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్
క్యాబ్‌డ్రైవర్లు, ఫ్రీలాన్సర్లు, డెలివరీ బాయ్స్‌కి పండగలాంటి వార్త.. ఐడీ కార్డులతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పలు వర్గాల వారికి లబ్ధిచేకూరేలా నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగానే అసంఘటిత రంగంలో పనిచేస్తున్న గిగా వర్కర్లకు కేంద్రం శుభవార్త తెలిపింది..

దేశంలో ప్రస్తుతం ఆన్‌లైన్ డెలివరీ సేవలు భారీగా పెరిగాయి. అలాగే ఫ్రీలాన్సర్ ఉద్యోగులు కూడా ఎక్కువవుతున్నారు. వీరికి నెలనెలా జీతం వచ్చినా ఉద్యోగం గ్యారెంటీ ఉండదు. అలాగే పనిచేసే కంపెనీలు ఎలాంటి భద్రత, ప్రయోజనాలు కల్పించవు. దీనిని దృష్టిలో పెట్టుకొని కేంద్రం కీల నిర్ణయం తీసుకుంది. ఇలాంటి ఉద్యోగులకు మేలు చేసేలో తాజా బడ్జెట్‌లో కీలక ప్రకటన చేసింది.
ఇలా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారి నమోదు కోసం ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని తీసుకురానుంది. వారికి సామాజిక భద్రతా ప్రయోజనాలను కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. గిగ్ వర్కర్లకు ఐడీ కార్డు, ఇ-శ్రమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయాన్ని కల్పించనున్నారు. అలాగే వీరికి పీఎం ఆరోగ్య యోజన పథకం ద్వారా ఆరోగ్య బీమా కూడా అందిస్తారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో కోటి మందికిపైగా ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.
ఎవరెవరు వస్తారు.?
దేశంలో ఉన్న గిగ్ వర్కర్లకు ఒక గుర్తింపును కల్పించేందుకు, ప్రభుత్వ పథకాలను అందజేసేందుకు వీలుగా ప్రభుత్వం ఇ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేయనుంది. సాధారణంగా సంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు అందుబాటులో ఉన్న ఈ పోర్టల్ గిగ్ వర్కర్లకు కూడా అందుబాటులోకి రానుంది. ఇక గిగ్ వర్కర్ల జాబితాలోకి ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్స్, క్యాబ్ డ్రైవర్లు, ఫ్రీలాన్స్ డిజైనర్లు, కంటెంట్ క్రియేటర్లు, లాజిస్టిక్స్ సిబ్బంది వంటి వారు వస్తారు. సహజంగా వీరు 'పే ఫర్ వర్క్' బేస్డ్‌గా పనిచేస్తుంటారు.
దేశ ఆర్థిక వ్యవస్థకు గిగ్ వర్కర్ల సహకారం ఎంతో ఉందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో తెలిపారు. 'గిగ్ వర్కర్లు ఆర్థిక వ్యవస్థకు గొప్ప సాయాన్ని అందిస్తారు. మా ప్రభుత్వం వారికి ఇ-శ్రమ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌తో ఐడీ కార్డులను ఏర్పాటు చేస్తుంది. వారికి ఆరోగ్య రక్షణను అందిస్తుంది' అని ఆమె చెప్పుకొచ్చారు. దీంతో దేశంలో ఇలా పనిచేస్తున్న కోట్లాది మందికి లబ్ధి చేకూరనుంది.