రేపటి నుంచి పేటీఎం ద్వారా డబ్బులు పంపలేమా? గూగుల్ ఎందుకు హెచ్చరిస్తోంది?
డిజిటల్ చెల్లింపు యాప్ అయిన పేటీఎంకు లక్షల సంఖ్యలో వినియోగదారులు ఉన్నారు అయితే వారికి గూగుల్ ప్లేస్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. అప్పటినుంచి వారిలో కంగారు మొదలైంది. ఆగస్టు 31 నుంచి పేటీఎం నుంచి డబ్బులు పంపలేమనే భయం పట్టుకుంది.

గూగుల్ ప్లే నుంచి మెసేజ్
పేటీఎంకు లక్షలాదిమంది వినియోగదారులు ఉన్నారు. అయితే శుక్రవారం నుంచి వారిలో ఒక గందరగోళం మొదలైంది. ఎందుకంటే వారి ఫోన్లకు గూగుల్ ప్లే నుండి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 31 తర్వాత పేటీఎం ద్వారా డబ్బులు పంపే సేవలు ఆగిపోతాయని వారు అర్థం చేసుకున్నారు. దీంతో వినియోగదారులు సోషల్ మీడియాలో తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేటీఎం నుండి డబ్బులు పంపడం, స్వీకరించడం నిజంగా రేపటి నుంచి ఆగిపోయే అవకాశం ఉందా? ఆగస్టు 31 తర్వాత పేటీఎం యూపీఐ పని చేయదా? దీనికి ఆ కంపెనీ అధికారికంగా వివరణ ఇచ్చింది.
అసలేం జరిగింది?
అసలేం జరిగిందంటే ఆగస్టు 31, 2025 తర్వాత పేటీఎం యూపీఐ హ్యాండిల్స్ ను ఆమోదించమని గూగుల్ ప్లే తన వినియోగదారులకు నోటిఫికేషన్ పంపింది. అంటే పేటీఎంతో ప్రారంభమయ్యే యూపీఐ ఐడిలు గూగుల్ ప్లే లో చెల్లింపు కోసం ఉపయోగించడం కుదరదు. దీంతోనే వినియోగదారుల్లో విపరీతంగా కంగారు మొదలైంది. అందుకే ఈ విషయంపై పేటీఎం వెంటనే స్పందించింది. ఈ మార్పు కేవలం పదేపదే చేసే చెల్లింపులకు మాత్రమే వర్తిస్తుందని ఆ కంపెనీ తెలిపింది. అంటే యూట్యూబ్ ప్రీమియం, గూగుల్ వన్ లేదా ఏదైనా ఇతర సబ్స్క్రిప్షన్ సర్వీసులకు ప్రతినెలా ఆటోమేటిక్ చెల్లింపులు చేస్తూ ఉంటే అవి ఇకపై చేయడం కుదరదని చెబుతోంది పేటియం. అంతేతప్ప ఏదైనా వస్తువులను కొనేటప్పుడు సాధారణ యూపీఐ చెల్లింపులపై ఎలాంటి ప్రభావం ఉండదని పేటియం స్పష్టం చేసింది. ఇకపై పేటీఎం యూపీఐ ఐడి నుండి ఆటో డెబిట్ లేదా సబ్ స్క్రిప్షన్ లో సెటప్ చేసిన వారు మాత్రం పాత హ్యాండిళ్లను కొత్త బ్యాంక్ లింక్డ్ హ్యాండిళ్లకు అప్డేట్ చేసుకోవాలి.
కొత్త యూపీఐ ఐడి ఇలా ఉంటుంది
ఇకపై పాత పేటీఎం యూపీఐ ఐడిలు పనిచేయకపోవచ్చు. గతంలో Ramesh@Paytm అని పేటీఎం ఐడి ఉంటే దానిని Ramesh@ptHdfc లేదా Ramesh@ptSbi ఇలా మార్చుకోవాల్సి ఉంటుంది. అంటే వినియోగదారులు తమ బ్యాంకుకు లింకు చేసిన కొత్త హ్యాండిళ్లను ఎంపిక చేసుకోవాలి. అంటే ఆటో సెటప్ చేసిన చెల్లింపులను ఇకపై పేటీఎం వినుయోగదారులు అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది. పాత పేటీఎం హ్యాండిల్ నుంచి కొత్త పేటీఎం హ్యాండిల్ కు వాటిని మార్చాలి. గూగుల్ ప్లే లేదా ఫోన్ పే వంటి మరొక యూపీఐ యాప్ తో ఆటో చెల్లింపులను సెటప్ చేసుకోవచ్చు లేదా డెబిట్ క్రెడిట్ కార్డును కూడా ఉపయోగించుకోవచ్చు.
సాధారణ చెల్లింపుకు నోప్రాబ్లెమ్
పేటీఎం చెబుతున్న ప్రకారం సాధారణ చెల్లింపులకు ఎలాంటి ప్రభావం పడదు. కాబట్టి సాధారణ లావాదేవీలను నిత్యం ఎలా చేసుకుంటారో... అలాగే వినియోగదారులు పేటియంను వాడుకోవచ్చు. సబ్స్క్రిప్షన్ చెల్లింపులకు మాత్రం అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది. లేకుంటే సెప్టెంబర్ ఒకటి నుండి ఈ సేవలు ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే అన్ని వన్ టైం యూపీఐ లావాదేవీలు మాత్రం మునుపటిలాగే కొనసాగుతాయి. ముందులాగే ఇతరులకు డబ్బులు పంపడం, బిల్లులు చెల్లించడం, క్యూఆర్ కోడ్ తో దుకాణంలో డబ్బులు చెల్లించడం వంటి సేవలు ఎలాంటి ప్రభావితం కావు.