- Home
- Business
- Budget 2025: ఇది కదా గుడ్ న్యూస్ అంటే.. వేతన జీవులకు భారీ ఊరట, రూ. 12 లక్షల జీతమున్నా నో ట్యాక్స్
Budget 2025: ఇది కదా గుడ్ న్యూస్ అంటే.. వేతన జీవులకు భారీ ఊరట, రూ. 12 లక్షల జీతమున్నా నో ట్యాక్స్
Budget 2025: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ సాక్షిగా వరుసగా 8వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం వేతన జీవులకు అదిరిపోయే శుభవార్తను తెలిపింది. పన్ను మినహాయింపును ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏంటి.? దీనివల్ల ప్రజలకు ఎలాంటి మేలు జరగనుంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Budget 2025: మధ్యతరగతి ప్రభుత్వం ఉద్యోగులకు భారీ ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో రూ. 12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపునిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు. అలాగే ఐటీఆర్, టీడీఎస్ పరిమితిని కూడా పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. టీడీఎస్ పరిమితిని కూడా రూ.10 లక్షలకు పెంచారు. సవరించిన శ్లాబ్ కింద రూ.8 నుంచి రూ.12 లక్షల మధ్య ఆదాయంపై పన్ను 10 శాతం ఉంటుంది. పన్ను స్లాబ్‌లకు సవరణలను ప్రకటించగా, కొత్త పన్నువిధానానికి మాత్రమే ఇది వర్తిస్తుందన్నారు.
కొత్త ఆదాయపు పన్ను విధానంలో ట్యాక్స్ స్లాబ్స్ ఇవే:
* రూ. 0 నుంచి రూ.4 లక్షల వరకు. ఎలాంటి పన్ను లేదు..
* రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు - 5 శాతం.
* రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 10 శాతం.
* రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు 15 శాతం
* రూ.16 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు 20 శాతం
* రూ.20 లక్షల నుంచి రూ.24 లక్షల వరకు 25 శాతం
* రూ.24 లక్షల పైన 30 శాతం
గతంలో రూ. 15 లక్షల ఆదాయం దాటిన వారంతా నేరుగా 30 శాతం శ్లాబ్‌లోకి వెళ్లేవారు. అయితే ప్రస్తుతం మరో రెండు శ్లాబ్‌లను తీసుకొచ్చారు. దీంతో రూ. 16 లక్షల నుంచి రూ. 24 లక్షల లోపు ఆదాయం తీసుకుంటున్న వారికి 15 శాతం పన్ను చెల్లింపులు మిగులుతుంది. వీరికి సుమారు ప్రతీ ఏటా రూ. లక్షా పదివేల వరకు పన్ను మినహాయింపు లభించనుంది.
12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఎలా సాధ్యమవుతుంది.?
రూ. 12 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పనిలేదంటారు. మరి 15 శాతం ఏంటనే సందేహం వస్తోంది కదూ. అయితే రూ. 12 లక్షల వరకు ఆదాయంపై 15 శాతం పన్ను విధించినప్పటికీ ట్యాక్స్ రిబేట్ లిమిట్‌ను రూ. 12 లక్షలకు పెంచడంతో రూ. 12 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించే అవసరం ఉండదు. ఉదాహరణకు మీకు రూ. 12 లక్షల జీతం వస్తే.. రూ. 4 లక్షల వరకు ఎలాంటి పన్ను ఉండదు. రూ. 4 నుంచి 8 లక్షల వరకు 5 శాతం పన్ను ఉంటుంది. అంటే రూ. 20 వేలు, రూ. 8 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు 10 శాతం అంటే రూ. 40 వేలు పన్ను విధిస్తారు. ఇలా మొత్తం రూ. 60 వేల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే కేంద్రం రిబేట్‌ను పెంచడంతో ఆదా అవుతోంది.
రూ. 12 లక్షలపైన ఆదాయం ఉంటే మాత్రమే ఆపై టాక్స్ శ్లాబుల్ని బట్టి టాక్స్ చెల్లించాల్సి వస్తుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయం మధ్యతరగతిపై పన్ను భారాన్ని గణనీయంగా తగ్గిస్తాయని నిర్మల సీతారామన్ తెలిపారు. దీంతో ఉద్యోగుల చేతుల్లో ఎక్కువ డబ్బు మిగులుతాయని, ఇది గృహ వినియోగం, పొదుపు, పెట్టుబడిని పెంచుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఏ ఆదాయం ఉన్న వారికి ఎంత మిగులుతుంది.?
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ కొత్త పన్ను విధానంతో రూ. 12 లక్షల వరకు జీతం పొందుతోన్న వారికి ఎంతో ప్రయోజనం జరగనుంది. వీరికి సుమారు రూ. 80,000 వరకు మిగిలే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా ఇతర శ్లాబ్‌లను కూడా మార్చడంతో రూ. 18 లక్షల ఆదాయం ఉన్న వారికి రూ. 70,000 వరకు మిగిలే అవకాశం ఉంటుంది. గతేడాదితో పోల్చితే 30 శాతం ఆదా అవుతుంది. అదే విధంగా రూ. 25 లక్షల ఆదాయం ఉన్న వారికి మారిన ట్యాక్స్ శ్లాబ్‌తో రూ. 1.10 లక్ష వరకు మిగిలే అవకాశం ఉంటుంది.
త్వరలోనే ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం..
త్వరలోనే కేంద్ర ప్రభుత్వం కొత్త పన్ను చట్టాన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వారం రోజుల్లో నూతన ఆదాయపు పన్ను చట్టం బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. పన్నుల చెల్లింపుల్లో ఉన్న క్లిష్టతరమైన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్, టీడీఎస్, టీసీఎస్ వంటి సంక్లిష్టమైన ప్రక్రియలను ఈజీగా చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అమలులో ఉన్న విషయం తెలిసిందే. ఈ చట్టాలకు లోబడి పన్ను వసూలు, మినహాయింపులు జరుగుతున్నాయి.
గతంలో ఎలా ఉండేదంటే..
2005లో రూ. 1 లక్ష ఆదాయం ఉన్న వారికి పన్ను మినహాయింపు ఉండేది. అయితే 2012లో దీన్ని రూ. 2 లక్షలకు పెంచుతూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా 2014లో దీనిని రూ. 2.5 లక్షలకు పెంచారు. ఇక 2019లో ఎన్టీఏ ప్రభుత్వం ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ. 7 లక్షలకు పెంచింది. ఆ తర్వాత 2013లో రూ. 7 లక్షలకు పరిమితిని పెంచగా తాజాగా ఈ పరిమితిని ఏకంగా రూ. 12 లక్షలకు పెంచారు.
సీనియర్ సిటిజన్లకు కొత్త విధానంలో ఎంత మిగులుతుంది.?
మరోవైపు 2025-26 బడ్జెట్‌లో సీనియర్ సిటీజన్లపై కూడా కేంద్రం వరాల జల్లు కురిపించింది. వీరికి టీడీఎస్ డిడక్షన్‌ను రూ. 50,000 నుంచి రూ. 1,00,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే సీనియర్ సిటిజన్లకు టీడీఎస్ అద్దెపై వార్షిక పరిమితిని రూ. 6 లక్షలకు పెంచినట్లు నిర్మల సీతారామన్ ప్రకటించారు. ఇక అప్‌డేటెడ్ ఇన్‌కమ్ ట్యాక్స్ నమోదుకు సమయాన్ని 4 ఏళ్లకు పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. టీడీఎస్ డిడక్షన్ పెంపు నిర్ణయం ద్వారా టీడీఎస్‌కు లోబడి జరిగే లావాదేవీల సంఖ్యను తగ్గిస్తుందని, దీంతో చిన్న పన్ను చెల్లింపుల దారులకు ఉపశమనం లభిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు.