సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత లిమిట్ వరకు డబ్బు డిపాజిట్ చేయొచ్చో తెలుసా?
సేవింగ్స్ అకౌంట్లలో క్యాష్ డిపాజిట్లకు ఆదాయపు పన్ను శాఖ ప్రత్యేక లిమిటేషన్స్ పెట్టింది. ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ రూల్స్ ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు కూడా విధిస్తారు. ఆ నియమాల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకోండి.
ఈ రోజుల్లో సంపాదనతో పాటు పొదుపు కూడా చాలా ముఖ్యం. చాలా మంది డబ్బు దాచుకోవడానికి, అప్పుడప్పుడు పెద్ద మొత్తంలో తీసుకోవడానికి వీలుగా ఉంటుందని సేవింగ్స్ అకౌంట్లలో ఎక్కువ డబ్బు డిపాజిట్ చేస్తుంటారు. అలాంటి వారు ఈ నియమాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఆదాయపు పన్ను మార్గదర్శకాల ప్రకారం సేవింగ్స్ అకౌంట్లలో క్యాష్ డిపాజిట్లకు కొన్ని పరిమితులు ఉన్నాయి.
మీ సేవింగ్స్ అకౌంట్‌లో రోజువారీ క్యాష్ డిపాజిట్ పరిమితి రోజుకు రూ.1 లక్ష వరకు నగదుగా డిపాజిట్ చేయవచ్చు. అదేవిధంగా సంవత్సరానికి రూ.10 లక్షలకు పైగా డిపాజిట్లు చేస్తే ఆదాయపు పన్ను శాఖకు తప్పనిసరిగా తెలియజేయాలి. కరెంట్ అకౌంట్లకు, వార్షిక క్యాష్ డిపాజిట్ పరిమితి రూ.50 లక్షలుగా నిర్ణయించారు. ఈ లిమిట్స్ మించిన ట్రాన్సాక్షన్స్ గురించి బ్యాంకులు, ఇతర సంస్థలు ఐటీ శాఖకు నివేదించాలి. మనీ ఫ్లోను పర్యవేక్షించడానికి, మనీలాండరింగ్, పన్ను ఎగవేతను నిరోధించడానికి, ఇతర అక్రమ ఆర్థిక కార్యకలాపాలను అడ్డుకోవడానికి ఈ రూల్స్ ఉపయోగపడతాయి.
ఇక సేవింగ్స్ అకౌంట్ విషయానికొస్తే ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం క్యాష్ డిపాజిట్ పరిమితి రూ.10 లక్షలు ఉంటుంది. రూ.10 లక్షలకు మించి డిపాజిట్ చేస్తే బ్యాంక్ ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయాలి. రూ.50,000 లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్లకు, డిపాజిటర్ తమ పాన్ కార్డ్‌ను అందించాలి. అరుదుగా డబ్బు డిపాజిట్ చేసే వారికి, రెగ్యులర్ రిపోర్టింగ్ లేకుండా ఒకేసారి రూ.2.5 లక్షల వరకు డిపాజిట్ చేయడానికి అనుమతి ఉంది. కరెంట్ అకౌంట్ సంవత్సరానికి రూ.50 లక్షల వరకు క్యాష్ డిపాజిట్లను అనుమతిస్తుంది.
పెద్ద వ్యాపారాల కోసం ప్రత్యేక కరెంట్ అకౌంట్ల నెలవారీ క్యాష్ డిపాజిట్ పరిమితులు రూ.1-2 కోట్ల వరకు ఉండవచ్చు. TDS నియమాల విషయానికొస్తే, సెక్షన్ 194A ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ అకౌంట్ నుండి రూ.1 కోటి కంటే ఎక్కువ తీసుకుంటే 2% TDS కట్టాల్సి ఉంటుంది. గత మూడు సంవత్సరాలుగా ఐటీఆర్ దాఖలు చేయని వారికి ఇది వర్తిస్తుంది. రూ.20 లక్షలకు పైగా ఉపసంహరణలకు 2% TDS వర్తిస్తుంది. రూ.1 కోటి ఉపసంహరణకు TDS రేటు 5%కి పెరుగుతుంది.
సెక్షన్ 269ST ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకే అకౌంట్లో రూ.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే ఈ సెక్షన్ కింద జరిమానా విధించబడుతుంది. నిర్ణీత పరిమితులకు మించి డబ్బు తీసుకోవడం TDSకి లోబడి ఉంటుంది. కానీ ఈ జరిమానా డబ్బు విత్ డ్రా కు వర్తించదు. ఈ నియమాలను పాటించడం ద్వారా వ్యక్తులు, వ్యాపారాలు జరిమానాలను నివారించవచ్చు. నగదు లావాదేవీలలో ఎల్లప్పుడూ పారదర్శకతను కలిగి ఉండటం వల్ల కూడా ఫైన్ లు కట్టకుండా ఎలా ఉండాలో తెలుసుకోవచ్చు. ఏవైనా వివరణల కోసం ఆర్థిక సలహాదారులను సంప్రదించండి.