సెమీకండక్టర్ చిప్ సంక్షోభం.. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ మరింత ఆలస్యం..
సెమీకండక్టర్ చిప్(semiconductor chip) కొరత సంక్షోభం ఆటోమొబైల్ పరిశ్రమపై ప్రభావాన్ని చూపుతోంది. చిప్ కొరత కారణంగా చాలా మంది ఆటోమొబైల్(automobile) సంస్థలు వాహనాల ఉత్పత్తిని తగ్గించుకోవలసి వస్తోంది. మీడియా నివేదికల ప్రకారం, ఇప్పుడు ఓలా (Ola) ఎలక్ట్రిక్ సెమీకండక్టర్ చిప్‌ల ప్రపంచ కొరత కారణంగా ఓలా ఎస్1, ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల (electric scooter)డెలివరీలను రెండు వారాల నుండి ఒక నెల వరకు వాయిదా వేసింది.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఇంతకుముందు ఈ నెలలో కస్టమర్లకు డెలివరీలను ప్రారంభించాలని యోచించింది. కానీ ఇప్పుడు డెలివరీలు డిసెంబర్ మధ్య లేదా చివరి వరకు పొడిగించారు.
ఓలా ఎస్1, ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల మొదటి బ్యాచ్ డెలివరీలు అక్టోబర్ 25 నుండి నవంబర్ 25 మధ్య జరుగుతాయని ముందుగా ఊహించినప్పటికి ఇప్పుడు డిసెంబర్ 15 నుండి డిసెంబర్ 30 మధ్య జరిగే అవకాశం ఉంది.
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుక్ చేసుకున్న వినియోగదారులకు కంపెనీ ఇ-మెయిల్ పంపినట్లు సమాచారం. డెలివరీలో ఆలస్యం ఏర్పడినట్లు ఇ-మెయిల్ లో పేర్కొంది. అలాగే వినియోగదారులకు మెయిల్‌లో క్షమాపణలు కూడా చెప్పింది. స్కూటర్‌లను కస్టమర్‌లకు వీలైనంత త్వరగా డెలివరీ చేయడానికి ఉత్పత్తిని కూడా పెంచుతున్నట్లు హామీ ఇచ్చింది.
ఓలా ఎలక్ట్రిక్ నవంబర్ 10న ఎస్1, ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం చెల్లింపు విండోను ప్రారంభించింది. ఇంకా వినియోగదారులకు సకాలంలో వాహనాలను అందజేస్తామని హామీ ఇచ్చింది. అదే తేదీన కంపెనీ బెంగళూరు, ఢిల్లీ, అహ్మదాబాద్, కోల్‌కతాలో వినియోగదారుల కోసం టెస్ట్ రైడ్‌లను కూడా ప్రారంభించింది. దీని తర్వాత కంపెనీ ముంబై, చెన్నై, హైదరాబాద్, కొచ్చి, పూణే మరో ఐదు నగరాల్లో నవంబర్ 19న టెస్ట్ రైడ్‌లను ప్రారంభించింది.
డిసెంబర్ మధ్య నాటికి 1,000 నగరాలు, పట్టణాలను కవర్ చేయాలనే లక్ష్యంతో కంపెనీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎస్1, ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం టెస్ట్ రైడ్ ప్రోగ్రామ్‌లను విడుదల చేస్తోంది. దీనిని దేశంలోనే అతిపెద్ద ఈవి టెస్ట్ డ్రైవ్ ప్రోగ్రామ్ అని పిలుస్తోంది. టెస్ట్ రైడ్ ఈవెంట్‌కు సంబంధించి కస్టమర్ ఫీడ్‌బ్యాక్ చాలా సానుకూలంగా ఉందని కంపెనీ పేర్కొంది.
నవంబర్ 27 నుండి ఓలా ఎలక్ట్రిక్ టెస్ట్ రైడ్‌లను ప్రారంభించనున్న నగరాల్లో సూరత్, తిరువనంతపుర, కోజికోడ్, విశాఖపట్నం, విజయవాడ, కోయంబత్తూరు, వడోదర, భువనేశ్వర్, తిరుప్పూర్, జైపూర్, నాగ్‌పూర్ ఉన్నాయి.
ధర
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1, ఎస్1 ప్రో ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని ఎస్1 వేరియంట్ ధర రూ. 1 లక్ష కాగా, ఎస్1 ప్రో వేరియంట్ ధర రూ. 1.30 లక్షలు. ఈ ధర ఎక్స్-షోరూమ్ ఇంకా రాష్ట్ర సబ్సిడీ కాకుండా. ఎలక్ట్రిక్ వాహనాల కోసం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఇచ్చే సబ్సిడీని బట్టి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర కూడా మారుతుంది.
డ్రైవింగ్ రేంజ్ అండ్ స్పీడ్
ఓలా ఎస్1 వేరియంట్ ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్‌తో 121 కి.మీల దూరం ప్రయాణించగలదు. అయితే ఎస్1 ప్రో వేరియంట్ ఒకసారి పూర్తి ఛార్జింగ్ తర్వాత 181 కి.మీల దూరం వరకు ప్రయాణించగలదు. ఎస్1 వేరియంట్ 3.6 సెకన్లలో 0 నుండి 40 kmph వేగాన్ని అందుకుంటుంది. అయితే ఎస్1 ప్రో వేరియంట్ 3 సెకన్లలో గంటకు 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 115 కి.మీ.
ఫీచర్లు
ఎస్1, ఎస్1 ప్రో మోడల్స్ రెండూ చాలా ఫీచర్లతో వస్తాయి. స్కూటర్ కీలెస్ అండ్ మొబైల్ ఫోన్ యాప్‌ని ఉపయోగించి ప్రారంభించవచ్చు. ఇంకా మల్టీ డ్రైవర్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో, యాప్ అప్‌డేట్‌ల ద్వారా పేరెంట్ కంట్రోల్ , జియోఫెన్సింగ్ వంటి ఎన్నో ఫీచర్‌లను కంపెనీ మెరుగుపరచవచ్చు. ఈ స్కూటర్‌లో ప్రాక్సిమిటీ సెన్సార్లు అందుబాటులో ఉన్నాయి, అంటే మీరు చేరుకోగానే స్కూటర్ అన్‌లాక్ చేయబడుతుంది. ఓలా స్కూటర్ జిపిఎస్, కనెక్టివిటీ ఆప్షన్‌లతో బూట్‌ని ఓపెన్ అండ్ క్లోజ్ చేసే ఆప్షన్‌తో వస్తుంది.
18 నిమిషాల్లో 50% ఛార్జింగ్
ఓలా ఎలక్ట్రిక్ హైపర్‌చార్జర్ కేవలం 18 నిమిషాల్లోనే ఇ-స్కూటర్ బ్యాటరీని 0 నుండి 50 శాతం వరకు ఛార్జ్ చేస్తుంది. ఈ స్కూటర్ బ్యాటరీని 75 కిమీల హాఫ్ సైకిల్ పరిధిని కవర్ చేయడానికి సరిపడా ఛార్జ్ చేస్తుంది. కంపెనీ వెబ్‌సైట్ ఛార్జర్ ఇన్‌స్టాల్ చేసే నగరాల పూర్తి జాబితాను అందిస్తుంది. టైర్ I, టైర్ II నగరాలు ఛార్జింగ్ నెట్‌వర్క్ కింద కవర్ చేయబడతాయి. హైపర్‌చార్జర్ స్టేషన్‌లు మల్టీ-లేయర్డ్ లేఅవుట్‌ను పొందుతాయి, తద్వారా కస్టమర్‌ల స్కూటర్‌లు ఏకకాలంలో ఛార్జ్ చేయబడతాయి.