జావా మోటార్‌సైకిల్స్ తో ఐకానిక్ బ్రాండ్ యెజ్డి బై-బై - ఇండియాలోకి త్వరలో రి-ఎంట్రీ
ఐకానిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్ యెజ్డీ(Yezdi) ఇకపై జావా మోటార్‌సైకిల్స్‌లో భాగం కాదు అని తెలిపింది. అంటే ఇప్పుడు యెజ్డీ(Yezdi) స్వంతంగా పని చేస్తుంది. ఈ విషయాన్ని జావా మోటార్‌సైకిల్స్ సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా వెల్లడించింది. భారతీయ మోటార్‌సైకిల్ మార్కెట్‌లో యెజ్డీ తిరిగి రావాలని చాలా కాలంగా ఎదురుచూస్తోంది.
దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (mahindra & mahindra) గ్రూప్ క్లాసిక్ లెజెండ్స్‌లో పెట్టుబడి పెట్టినప్పటి నుండి జావా మోటార్‌సైకిల్స్, బిఎస్‌ఎ అండ్ యెజ్డీ వంటి దిగ్గజ బ్రాండ్‌లు భారత మార్కెట్లోకి తిరిగి రావడంపై ఊహాగానాలు వ్యాపించాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో క్లాసిక్ లెజెండ్స్ భారతదేశంలో యెజ్డీ రోడ్‌కింగ్ కోసం ట్రేడ్‌మార్క్ దరఖాస్తు చేసింది. ఇది యెజ్డీ మోటార్‌సైకిళ్లను తిరిగి తీసుకురావడంపై ఊహాగానాలకు ఆజ్యం పోసింది.
2022 నాటికి లాంచ్ అంచనా
జావా ఇప్పటికే రెట్రో-థీమ్ బైకులను భారతదేశంలో డెడికేటెడ్ సేల్స్ ఛానెల్ ద్వారా విడుదల చేసింది. ఇప్పుడు యెజ్డీ కూడా తన ఉత్పత్తులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే దాని వివరాలు ఇంకా వెల్లడికాలేదు. యెజ్డీ భారతీయ మార్కెట్లో రెట్రో-థీమ్ బైకులను విడుదల చేయనుంది. కాబట్టి ఈ బ్రాండ్ నుండి కొత్త అడ్వెంచర్ బైక్స్ వచ్చే ఏడాది 2022 నాటికి వస్తుందని ఆశించవచ్చు.
ఆనంద్ మహీంద్రా ప్రత్యేక ట్వీట్
ఇదిలా ఉండగా మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా బుధవారం ఒక సీక్రెట్ పోస్ట్‌ను ట్వీట్ చేశారు. పై నుంచి వై లాగా ఉన్న ఫ్లైఓవర్ ఫోటోని పోస్ట్ చేశాడు. లెజెండ్ ఈజ్ బ్యాక్ అని కూడా వ్రాశాడు. మహీంద్రా చేసిన ట్వీట్ లో "నా మనసులో #Y ఉందని నేను అనుకుంటున్నాను. చివరగా, లెజెండ్ ఈజ్ బ్యాక్! #YezdiForever" అంటూ ట్వీట్ చేశారు.
జావా మోటార్‌సైకిల్స్ యెజ్డీ భాగస్వామ్యాన్ని వేరు చేస్తున్నట్లు ప్రకటించగా యెజ్డీ తన స్వంత కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ను కూడా పరిచయం చేసింది. అలాగే దాని మొదటి పోస్ట్ నుండి బ్రాండ్ పునరాగమనం గురించి కూడా సూచించింది. జావా మోటార్‌సైకిల్స్ లాగానే లాంచ్ తర్వాత రెట్రో-థీమ్ 250 సిసి సెగ్మెంట్‌లో యెజ్డీ రాయల్ ఎన్‌ఫీల్డ్‌తో పోటీపడుతుంది.