Child safety : కారు ఉన్న ప్రతిఒక్కరు తెలుసుకోవాల్సిన విషయాలివే..!
Child safety : కారు ఉన్న ప్రతి పేరెంట్ తమ పిల్లల సెప్టీ కోసం కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. దీనివల్ల పిల్లలు ప్రమాదాల బారిన పడకుండా చూడవచ్చు.

ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన విషయాలు
Child safety : చిన్నారులను తల్లిదండ్రులు కారులోనే మర్చిపోవడం, పిల్లలు సరదాగా ఆడుకుంటూ వెళ్లి కారులో చిక్కుకోవడం వంటి ఘటనల గురించి తరచూ వింటుంటాం. ఇలాంటి సమయంలో ఊపిరాడక చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. అయితే ఏ పేరెంట్స్ కావాలని తమ పిల్లలను కారులో మర్చిపోవడం, పార్కింగ్ స్థలాల్లో లాక్ చేయకుండా వదిలేయడం చేయరు... అనుకోకుండా జరుగుతాయి. ఇలాంటి సమయంలో మీ పిల్లలు ప్రమాదాల బారినపడకుండా ఉండేందుకు వారికి ముందుగానే కొన్ని విషయాలపై అవగాహన కల్పించాలి. ఇలా కారు ఉన్న ప్రతిఒక్కరు పిల్లల సెప్టీ గురించి పాటించాల్సిన టాప్ 5 అంశాలగురించి తెలుసుకుందాం.
1. చైల్డ్ లాక్
చాలామంది పేరెంట్స్ పిల్లలతో కలిసి ప్రయాణించే సమయంలో వెనక డోర్లకు చైల్డ్ లాక్ ఆన్ చేస్తారు. ఇది ప్రయాణ సమయంలో సురక్షితమే... కారులో అనుకోకుండా చిక్కుకుంటే ఇదే ఎక్కువ ప్రమాదకరంగా మారుతుంది. కారు డోర్ ఎలా తెరవాలో చిన్నారులకు తెలిసినా ఈ చైల్డ్ లాక్ కారణంగా బయటకురాలేకపోతారు... దీనివల్ల పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. అందువల్ల ఈ చైల్డ్ లాక్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి... పిల్లలతో ప్రయాణ సమయాల్లో కాకుండా మిగతా సమయాలో ఇది ఎప్పుడూ ఆఫ్ లోనే ఉంచాలి.
2. డోర్ లాక్ తీయడం నేర్చించాలి
కారు ఉన్న ప్రతిఒక్కరు తమ పిల్లలకు దానిగురించి కనీస అవగాహన కల్పించాలి. అంటే డోర్ లాక్ ఎలా తియ్యాలి, విండోస్ ఎలా ఓపెన్ చెయ్యాలి వంటివి నేర్పించాలి. ఇలా కారులో ఏవి ముట్టుకోవాలి, ఏవి ముట్టుకుంటే ప్రమాదమో తెలియజేయాలి. దీనివల్ల వారు అనుకోకుండా కారులో చిక్కుకుంటే ఈజీగా బయటకు వస్తారు.
3. హారన్ కొట్టడం నేర్పించాలి
కారు ఆఫ్ లో ఉన్నా హారన్ పనిచేస్తుంది... కాబట్టి చిన్నారులకు దాన్ని ఎలా ఉపయోగించాలో నేర్పించాలి. తద్వారా ప్రమాద సమయంలో వారు హారన్ కొట్టడంవల్ల చుట్టుపక్కల ఉన్నవారు గమనించే అవకాశం ఉంటుంది. పార్కింగ్ ప్లేస్ లో చిన్నారులు కారులో చిక్కుకుంటే తల్లదండ్రులు గమనిస్తారు.
4. బ్లాక్ ఫిల్మ్ వాడకూడదు
ఇప్పటికే కార్ అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వాడకాన్ని ప్రభుత్వం నిషేధించింది. అయినాకూడా కొందరు కారులోనివారు బయటకు కనబడకుండా ఉండేందుకు చట్టవిరుద్దమైనా దీన్ని వాడుతున్నారు. ఇలాంటి కార్లలో చిన్నారులు చిక్కుకుంటే గుర్తించడం కష్టం. కాబట్టి కార్ల అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ అస్సలు వాడకూడదు.
5. పార్కింగ్ స్థలాల్లో జాగ్రత్తలు
ఇంటి ఆవరణలో, పిల్లలు ఆడుకునే ప్రాంతాల్లో కారు పార్క్ చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటికి రెండుసార్లు లాక్ వేసారో లేదో చూసుకోవాలి. పొరపాటున మరిచిపోతే పిల్లలు అందులో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది.
ఇలా కేవలం పిల్లలున్న పేరెంట్స్ మాత్రమే కాదు కారుఉన్న ప్రతిఒక్కరు చిన్నారుల కోసం ఈ జాగ్రత్తలు పాటించాలి. దీనివల్ల ప్రమాదాలను నివారించవచ్చు. ప్రమాదాలు జరిగాక బాధపడటం కాదు అవి జరక్కుండా ఇలాంటి ముందుజాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.