అమిత్ షాతో వైఎస్ జగన్ భేటీ ఎఫెక్ట్: సోము వీర్రాజు దూకుడికి కళ్లెం
ఇటీవలి కాలంలో సోము వీర్రాజు దూకుడు తగ్గించారు. హిందూ దేవాలయాలపై దాడుల కోణం కూడా వెనక్కి వెళ్లింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసిన తర్వాతనే ఆ పరిణామం చోటు చేసుకుందని భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు దూకుడు తగ్గినట్లు కనిపిస్తోంది. ఏపీ బిజెపి అధ్యక్షుడిగా నియమితులు కాగానే సోము వీర్రాజు ప్రభుత్వంపై దూకుడు ప్రదర్శించారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని వెనక్కి నట్టి ఆయన ముందుకు వచ్చే పరిస్థితిని తెచ్చుకున్నారు.
అంతర్వేది ఘటనపై, దేవాలయాలపై వరుస దాడులపై ఆయన పెద్ద యెత్తునే ఆందోళనకు శ్రీకారం చుట్టారు. వైఎస్ జగన్ డిక్లరేషన్ మీద సంతకం చేసిన తర్వాతనే తిరుమల శ్రీవారిని దర్శించాలనే డిమాండుపై కూడా పార్టీ కార్యకర్తలను కదిలించారు. ఆయన దూకుడుకు ఇతర సీనియర్ నాయకులు కూడా ముందుకు వచ్చారు. దగ్గుబాటి పురంధేశ్వరి వంటి నేతలు కూడా హిందూ ఎజెండాతో జగన్ మీద విమర్శనాస్త్రాలు సంధించారు.
అయితే, ఇటీవలి కాలంలో సోము వీర్రాజు దూకుడు తగ్గించారు. హిందూ దేవాలయాలపై దాడుల కోణం కూడా వెనక్కి వెళ్లింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసిన తర్వాతనే ఆ పరిణామం చోటు చేసుకుందని భావిస్తున్నారు. సోము వీర్రాజు దూకుడుకు కేంద్ర నాయకత్వం కళ్లెం వేసినట్లు భావిస్తున్నారు. అయితే, ఇది నిర్ధారణ కావడం లేదు.
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వైఎస్ జగన్ మద్దతు అవసరం కావడం వల్లనే ఆ పరిణామం చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలోనూ, వ్యవసాయ బిల్లుల విషయంలో జగన్ ప్రధాని మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. అకాలీదళ్ మద్దతు కోల్పోయిన నేపథ్యంలో వైఎస్ జగన్ తో సత్సంబంధాలు అవసరమని భావించినట్లు తెలుస్తోంది.