వారసులొస్తున్నారు : వైసీపీలో వారసులకు టికెట్ కోసం, సిట్టింగుల పాట్లు..
ఆంధ్రప్రదేశ్ లో వారసత్వ పోరు నెలకొంది. తమ వారసులకే టికెట్లు ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారు నేతలు..

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లోనూ ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీలో వారసత్వ యుద్ధం మొదలైంది. ఆంధ్రప్రదేశ్ లోని పలు నియోజకవర్గాల్లో వైసిపి నాయకులు వచ్చే ఎన్నికల్లో తమ వారసులకే టికెట్లు ఇవ్వాలంటూ నేరుగా ముఖ్యమంత్రి కే విజ్ఞప్తి చేసుకుంటున్నారు. మరికొందరు వైసీపీ అధినాయకత్వంతో చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే వారసులకు టికెట్ల కోసం అనేక నియోజకవర్గాల్లో నేతల మధ్య యుద్ధం నడుస్తుంది.
మరోవైపు కొన్నిచోట్ల ఇప్పటికే అధిష్టానం కొంతమంది తమ వారికి లైన్ క్లియర్ చేస్తోందని సమాచారం. వారసులకు టికెట్ల కోసం ప్రయత్నిస్తున్న వారు ఎవరెవరో ఒకసారి చూస్తే…
వైసీపీ ఎంపీ సుభాష్ చంద్రబోస్ ఇప్పటికే ఈ విషయంలో చాలా ముందున్నాడు. తమ వారసులకే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నాడు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు టికెట్ ఇస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని.. రామచంద్రపురం స్థానం నుంచి స్వతంత్రంగా బరిలోకి దిగుతామని అల్టిమేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు మంత్రి చెల్లుబోయిన గోపాలకృష్ణ మాత్రం రామచంద్రపురంలో ఇంకో మూడుసార్లు కూడా తానే పోటీ చేస్తానంటూ చెబుతున్నారు. స్వయంగా సీఎం జగన్మోహన్రెడ్డి తనకు భరోసా ఇచ్చారని స్పష్టం చేశారు.
ఇక తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కూడా వారసుల కోసం టికెట్ల పరుగులో ఉన్నారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని, తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని ఆయన అడుగుతున్నారు. ఈ విషయాన్ని ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి అనేక సందర్భాల్లో జగన్ ను కోరారు. ఇప్పటికే భూమన కోరినట్టుగానే టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చిన జగన్.. ఆయన కుమారుడు అభినయ్ రెడ్డికి తిరుపతి టికెట్ ఇచ్చినట్టేనా? అని చర్చ కూడా జరుగుతుంది.
ఇక చంద్రగిరి టికెట్ ను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన కొడుకు మోహిత్ రెడ్డికి ఇచ్చేలా ఇప్పటికే ముఖ్యమంత్రితో ఓకే చేయించుకున్నారు. .ఇక వైసీపీ అధిష్టాన ప్రతినిధి, ఓ ముఖ్య నేత ఇటీవల సూత్రప్రాయంగా ఎమ్మిగనూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించారు. దీంతో ఇప్పటికీ ఈ ముగ్గురి విషయంలో కొంత స్పష్టత వచ్చినట్టేనని అనుకుంటున్నారు. కాగా, వీరి ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం గమనాభం.
మరోవైపు..మరో నాయకుడు.. ఎమ్మెల్యే పేర్ని నాని కూడా పలు సందర్భాల్లో.. తాను రాజకీయాల నుంచి రిటైర్ అవుతానని మచిలీపట్నం టికెట్ తన కుమారుడు కృష్ణమూర్తికికి ఇవ్వాలని కోరారు. అలాగే మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ ప్రసాద్ కొడుకు పోలాకి జెడ్పిటిసి సభ్యుడు, డాక్టర్ కృష్ణ చైతన్యకు టికెట్ ఇవ్వాలంటూ ధర్మాన అనేకసార్లు సీఎంను అడిగారు. అయితే వీరిద్దరి తనయుల విషయంలో ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు.
<p>viswa</p>
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా తన కూతురు నూరి ఫాతిమాకు వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఇవ్వాలంటూ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ఒక ముస్లిం ప్రతినిధులతో వైసిపి కలిసిన సందర్భంలో.. మహిళలకు రాజకీయ ప్రాతినిథ్యం, ముస్తఫా కుమార్తెను అని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలతో…నూరి ఫాతిమాకు టికెట్ ఖాయమని అనుకుంటున్నారు.
కాకపోతే ఇది ఎన్నికల సమీపించిన కొద్ది ఎంతవరకు సాధ్యమవుతుందో అని స్థానిక నేతల మధ్య చర్చ జరుగుతోంది. ఇక్కడ టెక్కలి పార్టీ సమన్వయకర్తగా ఉన్న దువ్వాడ శ్రీనివాస స్థానంలో ఆయన భార్య వాణిని ఇప్పటికే పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారు. మరి వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారా? లేదా? అనేది తెలియదు. ఇక మంత్రి విశ్వరూప్ కూడా తన ఇద్దరు కొడుకులు కృష్ణారెడ్డి, డాక్టర్ శ్రీకాంత్ లలో ఎవరికైనా ఒకరికి పార్టీ టికెట్ ఇప్పించాలని ప్రయత్నిస్తున్నారు. మరి ఆయన కోరిక ఎంతవరకి తీరుతుంది అనేది తెలియదు.
ఇక శ్రీకాకుళంలో ఎంపీ ధర్మాన ప్రసాదరావు ఆయన కుమారుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఎన్నికైన శాసనసభాపతి తమ్మినేని సీతారాం తన కొడుకు చిరంజీవి వెంకటనాగ్ కు పార్టీ టికెట్ కావాలని ఆశిస్తున్నారు. వీరి వరుసలోనే నంద్యాలలో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి, తూర్పుగోదావరి జిల్లాలో మంత్రి విశ్వరూప్, తోట త్రిమూర్తులు, ప్రకాశం జిల్లాలో బాలిలేని శ్రీనివాసరెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తమ వారసులకు… ఎంపీ లేదా ఎమ్మెల్యే సీటు ఏదైనా సరే అని కోరుతున్నారు.
ఇక మరికొందరేమో తమ వారసులను రాజకీయాల్లోకి దింపడం కోసం తమ పార్టీ టికెట్ దక్కకపోతే.. వేరే పార్టీ టికెట్ కైనా సై అంటున్నారు. దీనికోసం టిడిపిలో చేరడానికి కూడా వెనకాడడం లేదు. అలాంటి వారిలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ముందు వరుసలో ఉన్నారు… ఆయన తన కొడుకు సూర్య ప్రకాష్ కు వైసిపి టికెట్ ఇవ్వాలని కోరారు. ఇక్కడ రామచంద్రపురం సీటు విషయంలో మంత్రి వేణు, సుభాష్ చంద్రబోస్ విషయంలో పోటీ నెలకొన్న నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరిద్దరూ కాకుండా రామచంద్రపురం నియోజకవర్గ నుంచి తోట త్రిమూర్తులు కూడా తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు.
ఎమ్మిగనూరు, పాణ్యం, శ్రీశైలంలలో కూడా ఇలాంటి పరిస్థితిలో నెలకొని ఉన్నాయి. ఇమ్మడి వరకు రేసులో ఉన్న మరికొందరి వివరాలలోకి వెళితే విజయనగరం నుంచి శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్ర స్వామి కూతురు, విజయనగరం డిప్యూటీ మేయర్ శ్రావణి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కొడుకు బాలినేని ప్రణీత్ రెడ్డి, ఎలమంచిలి ఎమ్మెల్యే రమణమూర్తి కొడుకు సుకుమార్ వర్మ, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కొడుకు కార్పొరేటర్ వంశీ, ఉపముఖ్యమంత్రి బూడిద ముత్యాల నాయుడు కుమార్తె కే కోటపాడు జడ్పిటిసి సభ్యురాలు అనురాధ, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొడుకు మాగుంట రాఘవరెడ్డి ఒంగోలు లోకసభ స్థానం నుంచి… పోటీల్లో ఉన్నారు.
వీరిలో ఎన్నికల సమయానికి ఎంతమందికి పార్టీ టికెట్లు వస్తాయో… ఎంతమంది టికెట్ కోసం పార్టీ ఫిరాయిస్తారో వేచి చూడాల్సిందే.