- Home
- Andhra Pradesh
- అట్టపెట్టెలతో నిప్పంటించి.. భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు.. ఆ భార్య చెప్పిన విషయాలు వింటే...
అట్టపెట్టెలతో నిప్పంటించి.. భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు.. ఆ భార్య చెప్పిన విషయాలు వింటే...
ఓ భార్య చనిపోయిన తన భర్తకు ఇంట్లోనే దహనసంస్కారాలు చేసింది. అట్టపెట్టెలతో.. నిప్పంటించి.. మృతదేహాన్ని కాల్చేసింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
కర్నూలు : ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో హృదయ విదారకమైన ఘటన వెలుగు చూసింది. మృతి చెందిన భర్తకు ఓ భార్య తమ ఇంట్లోనే దహన సంస్కారాలు నిర్వహించింది. ఇలా చేయడం వెనక ఉన్న కథనం అందరినీ కదిలించింది.
ఈ ఘటన కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో సోమవారం ఉదయం వెలుగు చూసింది. దీనికి సంబంధించి పత్తికొండ పోలీసులు ఈ మేరకు వివరాలను తెలిపారు..పోతుగంటి హరికృష్ణ ప్రసాద్ (60), లలిత అనే ఇద్దరు దంపతులు కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో నివాసం ఉంటున్నారు.
వీరికి ఓ మెడికల్ షాప్ ఉంది. అది నడుపుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కొడుకు కర్నూలులో ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో పనిచేస్తున్నాడు. చిన్న కొడుకు కెనడాలో స్థిరపడ్డాడు. అయితే, వీరిద్దరూ తల్లిదండ్రులను సరిగా చూసుకోవడం లేదని తెలుస్తోంది.
పత్తికొండలోని ఇంట్లో భార్యాభర్తలిద్దరే ఉండేవారు. సోమవారం ఉదయం వారింట్లో నుంచి పొగలు రావడంతో ఇరుగుపొరుగు వారు కంగారు పడ్డారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. కాలనీవాసులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు హుటాహుటిన హరిప్రసాద్ ఇంటికి చేరుకున్నారు. సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్న ఎస్ఐ వెంకటేశ్వర్లు ఘటన స్థలాన్ని పరిశీలించగా.. ఓ వ్యక్తి మంటల్లో కాలిపోయినట్లుగా కనిపించింది.
అదే ఇంట్లో ఉన్న లలితను.. ఏం జరిగిందని ప్రశ్నించగా.. ఆమె చెప్పిన విషయం విని స్థానికులు, పోలీసులు షాక్ తిన్నారు. లలిత భర్త హరి కృష్ణప్రసాద్ సోమవారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందాడు. కాగా తమ కొడుకులిద్దరూ తమను సరిగా చూసుకోకపోవడంతో.. దహన సంస్కారాలు కూడా వారు చేయరని భావించిన లలిత.. తాముంటున్న ఇంట్లోనే.. అట్టపెట్టెలతో.. భర్త మృతదేహాన్ని కాల్చేసింది.
కొడుకులిద్దరూ కేవలం ఆస్తి కోసమే తమ దగ్గరికి వస్తారని.. తమను సరిగా చూసుకోరని ఆమె పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ఈ క్రమంలో తండ్రి చనిపోయిన విషయం తెలిస్తే కుమారులు ఇద్దరు వచ్చి ఆస్తి కోసం గొడవ చేస్తారని భయంతోనే.. భర్త మృతదేహానికి స్వయంగా దహన సంస్కారాలు పూర్తి చేసినట్లు ఆమె తెలిపింది. ఈ విషయం తెలిసిన వారంతా దిగ్భ్రాంతికి లోనయ్యారు.