నానికి బాబు ఫోన్, బుద్దా తో భేటీ: బెజవాడ టీడీపీలో సమసిన వివాదం
విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల్లో గెలుపు దిశగా ముందుకు వెళ్లాలని టీడీపీ నాయకత్వం విజయవాడ నేతలకు సూచించింది.
విజయవాడలో టీడీపీ నేతల మధ్య నెలకొన్న విబేధాలు సమసిపోయాయి. ఎంపీ కేశినేనికి ఇతర నేతలకు మధ్య ఉన్న అభిప్రాయబేధాలను టీడీపీ నాయకత్వం పరిష్కరించింది.
. ఈ విషయంలో చంద్రబాబునాయుడు స్వయంగా రంగంలోకి దిగాడు.పార్టీ నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగడంతో పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందని భావించి నాయకత్వం ముందు జాగ్రత్తలు తీసుకొంది.
విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఎంపీ కేశినేని నానికి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, పార్టీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా, పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా మహేశ్వరరావు వర్గాలకు మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకొన్నాయి.
ఈ విషయాన్ని టీడీపీ నాయకత్వం సీరియస్ గా తీసుకొంది. నేతల మధ్య అభిప్రాయబేధాలను పరిష్కరించాలని చంద్రబాబునాయుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడును ఆదేశించారు.అచ్చెన్నాయుడు ఈ నెల 21వ తేదీన నాగుల్ మీరా, బుద్దా వెంకన్నలతో సమావేశమయ్యారు.
టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు సోమవారం నాడు కేశినేని నానితో ఫోన్ లో మాట్లాడారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ పొలిటికల్ సెక్రటరీ, ఎమ్మెల్సీ టీడీ జనార్థన్ తదితర నాయకులతో సమావేశమైన చంద్రబాబు బెజవాడ పంచాయితీ గురించి మరో దఫా చర్చించారు.
ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్‌మీరాను పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించుకుని వారిరువురితో దాదాపు అరగంటకు పైగా చర్చించారు.
పశ్చిమ నియోజకవర్గంలోని 39వ డివిజన్ నుంచి పార్టీ అభ్యర్థిగా గుండారపు పూజిత పేరును గతంలోనే ఖరారు చేశామని, ఆమెకు బీఫాం కూడా ఇచ్చామని, తాజాగా ఎంపీ కేశినేని నాని అదే డివిజన్‌కు టీడీపీ అభ్యర్థిగా శివశర్మను ప్రకటించడంతో తాము అభ్యంతరం వ్యక్తం చేశామని వెంకన్న, నాగుల్‌మీరా అధినేత చంద్రబాబుకు వివరించినట్లు తెలిసింది.
బీసీ వర్గానికి చెందిన పూజిత తండ్రి గుండారపు హరిబాబు గతంలో నగరపాలక సంస్థలో టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా కూడా పని చేశారని, ఇప్పుడు ఆయన కుమార్తెకు ఇచ్చిన టికెట్టును వెనక్కి తీసుకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని వారు తమ అఽధినేతకు వివరించారు.
అన్ని విషయాలను తాను చూసుకుంటానని, పార్టీ అధికారంలో లేనప్పుడు ఇలాంటి కీచులాటలు మంచిది కాదని చంద్రబాబు వారికి నచ్చజెప్పారు
విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ గెలిచి తీరాలని, కాబట్టి గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇద్దామని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. వీఎంసీ ఎన్నికల్లో పార్టీ నాయకులంతా కలిసికట్టుగా పని చేయాలని, ఇక మీదట ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవద్దని సూచించారు.
అదే సమయంలో ఎంపీ కేశినేని నానితో కూడా చంద్రబాబు మరోసారి ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం ఈ వివాదానికి ముగింపు పలికే బాధ్యతలను అచ్చెన్నాయుడు, టి.డి.జనార్దన్‌లకు అప్పగించారు.
మరోవైపు అచ్చెన్నాయుడు, జనార్దన్‌లు ఎంపీ కేశినేని నానితో మాట్లాడారు. తాను పార్టీ విజయం కోసమే కృషి చేస్తున్నానని, తన కుమార్తెకు మేయర్ పదవి కావాలని కోరుకోవడం లేదని కేశినేని నాని పార్టీ నేతలకు చెప్పినట్టుగా సమాచారం.
.39వ డివిజన్‌లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన శివశర్మను అభ్యర్థిగా నిలబెట్టడానికి గల కారణాలను పార్టీ అధిష్ఠానానికి నాని వివరించినట్లు సమాచారం.
చంద్రబాబుతో భేటీ అనంతరం ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ, పార్టీలో నెలకొన్న అంశాలను అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లామని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చెప్పారు.