తిరుమల లడ్డు వివాదంపై జగన్ మాస్టర్ ప్లాన్ : చంద్రబాబు, పవన్ ఇది అస్సలు ఊహించివుండరు
కేవలం ఆంధ్ర ప్రదేశ్ లోనే కాదు దేశవ్యాప్తంగా తిరుమల లడ్డు ప్రసాదంపై చర్చ సాగుతోంది. ఈ లడ్డు కల్తీ వ్యవహారాన్ని బైటపెట్టి వైఎస్ జగన్ ను ఇరకాటంలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నించగా ... అదే అస్త్రాన్ని చంద్రబాబు, పవన్ లపై రివర్స్ లో ప్రయోగించేలా మాస్టర్ ప్లాన్ వేసారు జగన్.
Tirumala Laddu
Tirumala Laddu : ప్రస్తుతం తిరుమల లడ్డు నాణ్యతపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దేశంలోనే అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటైన తిరుమలకు నిత్యం వేలాదిమంది భక్తులు వెళుతుంటారు... ఆ స్వామివారి దర్శనంతో పాటు ఎంతో ప్రత్యేకం, పవిత్రమైన లడ్డు ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఇలా ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డును గత వైసిపి పాలకులు అపవిత్రం చేసారని... జంతువుల కొవ్వుతో తయారుచేసిన కల్తీ నెయ్యిని ఉపయోగించారని స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దీంతో ఒక్కసారిగా దుమారం రేగింది.
Tirumala Laddu
తిరుమల లడ్డు వ్యవహారం ఏపీలో పొలిటికల్ హీట్ పెంచింది. ఇప్పటికే గత వైసిపి పాలనలో తిరుమల, విజయవాడ కనదుర్గమ్మ వంటి ఆలయాల్లో అపవిత్ర కార్యకలాపాలు జరిగాయంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 'ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. అలాగే దేవాలయాలను స్వయంగా శుద్ది చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు సర్కార్ తిరుమలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయిస్తోంది. ఇలా తిరుమల విషయంలో గత వైసిపి పాలకులు తప్పు చేసారని ప్రజల్లోకి బలంగా తీసుకెళుతూ ఆ పార్టీని ఇరకాటంలో పెడుతున్నారు. ఈ క్రమంలో తాము ఏ తప్పు చేయలేదంటూ ఎదురుదాడికి దిగిన వైసిపి కూడా దేవాలయాలనే అస్త్రంగా ఉపయోగించుకుంటోంది.
'ముళ్లును ముళ్లుతోనే తియ్యాలి' అన్నట్లుగా దైవభక్తినే కూటమి ప్రభుత్వంపై అస్త్రంగా వాడేందుకు వైసిపి సిద్దమవుతోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం తిరుమలలోనే కాదు విజయవాడ వంటి ప్రముఖ ఆలయాల శుద్ది, ప్రత్యేక పూజలు చేస్తోంది. ప్రతిపక్ష వైసిపి కూడా ఇలాగే దేవాలయాల్లో పూజలకు సిద్దమైంది. ఈ నెల (సెప్టెంబర్) 28న శనివారం రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని వైసిపి పిలుపునిచ్చింది.
Tirumala Laddu
ఆ పాపం చంద్రబాబుదేనట :
కేవలం తెలుగు ప్రజలే కాదు దేశవ్యాప్తంగా వున్న హిందువులంతా తిరుమల వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తారు. అలాంటి ఆలయాన్ని కూటమి ప్రభుత్వం రాజకీయాల కోసం వాడుకుంటోందని వైసిపి నాయకులు ఆరోపిస్తున్నారు. మరీముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేసారు.
తిరుమల పవిత్రతను, లడ్డు ప్రసాదం విశిష్టతను దెబ్బతీసేలా సీఎం చంద్రబాబు మాట్లాడారు... ఇది సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామినే అవమానించడమేనని వైసిపి అంటోంది. గత సీఎం వైఎస్ జగన్, టిటిడి మాజీ ఛైర్మన్లు ఎలాంటి అపవిత్రపు పనులు చేయలేరన్నారు. తన స్వార్థ రాజకీయాల కోసం తిరుమల ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడి చంద్రబాబు పాపం చేసారు... అందువల్లే ఆ పాప పక్షాళన కోసం దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలకు పిలుపు ఇచ్చినట్లు వైఎస్ జగన్ తెలిపారు.
''తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను, వెంకటేశ్వరస్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను, రాజకీయ దుర్బుద్ధితో, కావాలని అబద్ధాలాడి, జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుగారు తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు, చంద్రబాబుగారు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబరు 28, శనివారంరోజున పూజల్లో పాల్గొనాలని వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిస్తూ ట్వీట్ చేశారు.
తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను, వెంకటేశ్వరస్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను స్వయంగా సీఎం చంద్రబాబే దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. రాజకీయ దుర్బుద్ధితో కావాలనే చంద్రబాబు అబద్ధాలాడుతున్నారు... జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు.
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేసి పాపం చేసారు... కాబట్టి ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబరు 28న పూజలు చేయాలని వైయస్సార్‌సీపీ పిలుపునిస్తోందన్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో వైసిపి నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా పాల్గొనాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.
Tirumala Laddu
అసలు ఏమిటీ తిరుమల లడ్డు వివాదం :
గత వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో అపవిత్రపు పనులు, అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వున్నాయి. టిటిడి ఛైర్మన్ల నియామకం నుండి మంత్రి రోజా తరచూ తిరుమల పర్యటనల వరకు ప్రతిదీ వివాదాస్పదమే. దీంతో అధికారంలోకి వచ్చినవెంటనే తిరుమల ప్రక్షాళనతోనే పాలనను ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇందులో భాగంగానే టిటిడి ఈవోగా సీనియర్ ఐఎఎస్ అధికారి శ్యామలరావును నియమించి గత ప్రభుత్వ తప్పులను వెలికితీసే ప్రయత్నాలు ప్రారంభించారు.
ఈ క్రమంలోనే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యతపై వస్తున్న ఫిర్యాదులపై టిటిడి ఈవో దృష్టిపెట్టారు. దీంతో లడ్డు తయారీలో ఉపయోగిస్తున్న నెయ్యి కల్తీదని తేలింది... పవిత్రమైన ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి ఉపయోగిస్తున్నారని టెస్టుల్లో భయటపడింది. ఈ విషయాన్ని ఇటీవల ఓ కార్యక్రమంలో స్వయంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా తిరుమల లడ్డుపై దేశవ్యాప్తంగా చర్చ మొదలయ్యింది.
టిడిపి, జనసేన,బిజెపి కూటమి నాయకులేమో వైసిపి పాలకులే తిరుమల లడ్డును అపవిత్రం చేసారని అంటున్నారు. టిటిడి ఛైర్మన్లుగా వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి లను నియమించడమే తప్పని... వారు క్రిస్టియన్లను ఆరోపిస్తున్నారు. వారిద్వారా హిందువుల పవిత్ర ఆలయం తిరుమలను అపవిత్రం చేయడానికి ఆనాటి సీఎం వైఎస్ జగన్ కుట్రలు పన్నారని కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు.
తిరుమల లడ్డు వ్యవహారం వైసిపికి చెడ్డపేరు తీసుకువస్తుండటంతో ఆ పార్టీ కూడా ఎదురుదాడికి దిగింది. ఇప్పటికే వైసిపి అధినేత వైఎస్ జగన్ తో పాటు టిటిడి మాజీ ఛైర్మన్లు, మాజీ మంత్రులు, పార్టీ పెద్దలు లడ్డు వివాదంపై స్పందించారు. కూటమి ప్రభుత్వ వందరోజుల పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే తిరుమల శ్రీవారితో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని అంటున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ లో ఆరితేరిన చంద్రబాబు తిరుమల లడ్డు కల్తీ అంటూ కొత్త నాటకం ఆడుతున్నారని వైసిపి నాయకులు అంటున్నారు.
Tirumala Laddu
పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష :
ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు దైవభక్తి చాలా ఎక్కువనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన తరచూ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించడం, ఇటీవల వారాహి దీక్ష చేపట్టడాన్ని బట్టే ఈ విషయం అర్ధమవుతుంది. తిరుమల శ్రీవారిని కూడా ఆరాధ్య దైవంగా కొలుస్తారు. అలాంటిది తిరుమల ఆలయ పవిత్రతనే దెబ్బతీసేలా వైఎస్ జగన్ ప్రభుత్వం వ్యవహరించడంతో పవన్ కల్యాణ్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆయనలోనే కరుడుగట్టిన హిందువు భయటకు వచ్చాడు.
తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ హిందుత్వంపైనే జరిగిన దాడిగా పవన్ పేర్కొంటున్నారు. హిందువుల పక్షాన ఆయన గొంతెత్తారు... ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాతీయస్థాయిలో 'సనాతన ధర్మ రక్షణ బోర్డు' ను ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు గత ఐదేళ్లు ఏపీలోని ప్రముఖ దేవాలయాల్లో ఇలాంటి అపవిత్రపు కార్యకలాపాలు జరిగాయని ఆరోపిస్తూ ... ఈ తప్పులను మన్నించాలంటూ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నారు.
సెప్టెంబర్ 22న అంటే గత ఆదివారం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించారు పవన్ కల్యాణ్. ఈ దీక్షా సమయంలో ఆయక కాషాయ వస్త్రాలను మాత్రమే ధరిస్తారు. 11వ రోజు తిరుమల ఏడుకొండలపైకి కాలినడకన వెళ్లి స్వామివారి దర్శించుకుని దీక్ష విరమిస్తారు. ఈ దీక్షాకాలంలో ఆయన దేవాలయాల శుద్ది చేపడుతున్నారు.
తాజాగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని స్వయంగా శుద్ది చేసారు ఏపీ డిప్యూటీ సీఎం. అమ్మవారిని దర్శించుకుని... ఆలయ మెట్లను నీటితో శుభ్రం చేసి పసుపు, కుంకుమ పెట్టారు. ఈ సందర్భంగా హిందుత్వ వాదాన్ని గట్టిగా వినిపించిన పవన్ కల్యాణ్ ... తమ ధర్మాన్ని కించపరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పాలకులు, రాజకీయ నాయకులే కాదు సినిమా, వ్యాపార ప్రముఖులు కూడా హిందుత్వాన్ని అవమానించేలా, దేవుళ్ళను కించపర్చేలా , మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించవద్దని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.