TDP: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక విషయంలో టీడీపీ సంచలన నిర్ణయం.. తెర వెనక ఏం జరిగింది.?
TDP: ప్రచారానికి తెరపడింది. జూబ్లీహిల్స్ బైపోల్ పోటీకి టీడీపీ దూరంగా ఉండబోతోంది. మంగళవారం తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమైన చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పార్టీని బలోపేతం చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో టీడీపీ.?
అందరూ ఉత్కంఠభరితంగా ఎదురుచూసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్ రానే వచ్చింది. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 14న ఫలితాలు వెల్లడించనున్నారు. ఇక ఎలక్షన్ కమీషన్ నుంచి ఈ ప్రకటన వెలువడగానే.. తెలంగాణలోని రాజకీయ పార్టీలు గెలుపునకు తమ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసేశాయి. ఈ క్రమంలోనే మంగళవారం టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం కావడంతో ఆసక్తి నెలకొంది.
మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో..
మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణం కారణంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. 2009లో ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఆయన మూడుసార్లు గెలిచారు. మొదటిగా టీడీపీ టికెట్‌పైనే గెలిచారాయన. ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరి 2018, 2023లో గెలిచారు.
పార్టీ బలోపేతంపై కసరత్తు..
ఏపీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తెలంగాణలో పార్టీని మళ్లీ గాడిలో పెట్టాలని ఆలోచిస్తున్నారు. ఇక త్వరలోనే జరగబోయే స్థానిక ఎన్నికల్లో పోటీకి రంగం సిద్దం చేయాలని ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం. దీంతో మంగళవారం ఒక్కసారిగా తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం కావడంతో జూబ్లీహిల్స్ బైపోల్‌లో పోటీకి దిగుతారని అందరూ భావించారు. అయితే పార్టీ ఇంకా బలోపేతం కాకపోవడం, అలాగే నేతలు సిద్దంగా లేకపోవడంతో నిన్న జరిగిన మీటింగ్‌లో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. జుబ్లీ హిల్స్ ఉపఎన్నిక పోటీకి దూరంగా ఉంటున్నట్టు ప్రకటించారు. ఏపీలో బీజేపీతో పొత్తు ఉండటం, పార్టీ శ్రేణులు ఇంకా సిద్దంగా లేకపోవడమే ఇందుకు కారణాలని తెలుస్తోంది.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు మద్దతు నో..
జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు మద్దతు ఇవ్వకూడదని పార్టీ శ్రేణులకు చంద్రబాబు తెలిపారు. ఏపీలో బీజేపీతో పొత్తు ఉండటం వల్ల.. ఈ రాష్ట్రంలో ఆ పార్టీకి వ్యతిరేకంగా వెళ్లలేమని నేతలకు చంద్రబాబు స్పష్టం చేశారు. తమను బీజేపీ అడిగితే.. మద్దతు ఇవ్వాలని.. లేదంటే తటస్థంగా ఉండాలని సూచించారు. అలాగే తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేలా అడుగులు ముందుకు వేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు.
బీజేపీకి ఇక లైన్ క్లియర్..!
ఈ నిర్ణయంతో జూబ్లీహిల్స్ బైపోల్‌లో టీడీపీ పోటీ చేస్తుందన్న ప్రచారానికి తెరపడింది. అలాగే బీజేపీకి కూడా మార్గం సుగుమం అయినట్టే. ఇప్పటికే ఆ పార్టీలో జూబ్లీహిల్స్ బైపోల్ టికెట్ ఎవరికి కేటాయిస్తారన్న దానిపై చర్చ కొనసాగుతోంది. దీపక్ రెడ్డి, వీరపనేని పద్మ, కీర్తిరెడ్డి, మాధవీలత, ఆకుల విజయ, అట్లూరి రామకృష్ణ లాంటివారు ఈ టికెట్ ఆసక్తి కనబరుస్తారని సమాచారం. ఇక ఇప్పటికే వీరిలో ముగ్గురు పేర్లను జాతీయ నాయకత్వానికి రాష్ట్ర కమిటీ సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. కాగా, ఈ నెల 10వ తేదీన మళ్లీ పార్టీ నేతలతో సమావేశమై.. అభ్యర్ధిని ఖరారు చేసే అవకాశం ఉంది. అలాగే టీడీపీని మద్దతు అడిగే అవకాశం కూడా లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.