- Home
- Andhra Pradesh
- Success Story : రెండు చేతులు, ఓ కాలు పనిచేయవు.. ఒక్క కాలితో లక్షలమందిని ఓడించి, జీవితాన్ని గెలిచిన తెలుగోడు
Success Story : రెండు చేతులు, ఓ కాలు పనిచేయవు.. ఒక్క కాలితో లక్షలమందిని ఓడించి, జీవితాన్ని గెలిచిన తెలుగోడు
Success Story : రెండు చేతులు పనిచేయవు… ఓ కాలు కూడా వైకల్యమే… ఉన్న ఒక్క కాలితోనే తన తలరాతను మార్చుకున్న ఓ తెలుగబ్బాయి సక్సెస్ స్టోరీని ఇక్కడ తెలుసుకుందాం.

ఇది కదా సక్సెస్ అంటే..
Success Story : కృషి ఉంటే మనుషులు రుషులవుతారు... మహాపురుషులవుతారు అనేదానికి నిలువెత్తు నిదర్శనం ఈ తెలుగు కుర్రాడు. పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీలేదని నిరూపించాడు... చివరకు ఆ విధిరాతను కూడా మార్చుకోవచ్చని నేటి యువతరానికి సందేశం ఇచ్చాడు. మంచి ఆరోగ్యం, తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల గైడెన్స్... ఇలా అన్నిసదుపాయాలు ఉన్నవారికి సాధ్యంకానిది రెండు చేతులు, ఓ కాలు సరిగ్గా పనిచేయని వికలాంగుడికి సాధ్యమయ్యింది. ఇలా రెండు చేతులు, రెండు కాళ్లు సక్రమంగా పనిచేసే లక్షలాదిమందిని కేవలం ఒకే ఒక్క కాలితో ఓడించి జీవితాన్ని గెలిచాడు.
ఎన్నో అవమానాలు, మరెన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఎట్టకేలకు ఈ దివ్యాంగుడు తన కలను నెరవేర్చుకున్నాడు... ఏకంగా గవర్నమెంట్ జాబ్ సాధించాడు. చదువు లేదంటే మరేదైనా తమవల్ల సాధ్యంకావడంలేదని బాధపడేవారు, ఆత్మహత్యలు చేసుకునే నేటితరం యువతకు ఈ యువకుడి సక్సెస్ ఓ గుణపాఠం కావాలి. తన కాలిరాతతో ఈ విధిరాతను మార్చుకుని డిఎస్సి ర్యాంకు సాధించిన తెలుగు యువకుడు జామి సింహాచలం సక్సెస్ స్టోరీని ఇక్కడ తెలుసుకుందాం.
అంగవైకల్యాన్ని జయించిన తెలుగోడి సక్సెస్ స్టోరీ
ఆంధ్ర ప్రదేశ్ లో వెనకబడిన ప్రాంతం ఉత్తరాంధ్ర... ఇక్కడి ప్రజలు ఇప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటారు. విజయనగరం జిల్లాలో ఇలా వెనకబడిన ప్రాంతాలు అనేకం ఉన్నాయి.. అలాంటివాటిలో కొత్తవలస మండలం గనిశెట్టిపాలెం గ్రామం కూడా ఉంది. సరైన మౌళిక సదుపాయాలు లేని ఈ గ్రామంలో పుట్టిన ఓ వికలాంగుడు జీవితంతో పోరాడి తన కలను సాకారం చేసుకున్నాడు. అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సిలో విజయనగరం జిల్లా స్థాయిలో ర్యాంకు సాధించి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా మారాడు జామి సింహాచలం నాయుడు.
ఈ డిఎస్సి ర్యాంకర్ ఇతరులకు స్పూర్తిధాయకం. ఆ దేవుడు తనను అందరిలా పుట్టించకున్నా... అందరికంటే మెరుగ్గా జీవితాన్ని మార్చుకున్నాడు సింహాచలం నాయుడు. గనిశెట్టి పాలెం గ్రామానికి చెందిన ఇతడు పుట్టుకతోనే వికలాంగుడు... రెండు చేతులు లేవు, ఓ కాలుకూడా సరిగ్గా పనిచేయదు. ఇంతటి అంగవైకల్యం కూడా అతడిని కుంగదీయలేదు కదా చిన్నప్పటినుండి మరింత పట్టుదలను పెంచింది. అనుకుంటే ఏదేమైనా సాధించాలనే ఆ పట్టుదలే ఇప్పుడు విజేతగా నిలబెట్టింది.
అంగవైకల్యంతో పుట్టిన సింహాచలం నాయుడు కుటుంబసభ్యుల సహకారంతో చదువుకున్నాడు. ఉపాధ్యాయ వృత్తిపై మక్కువ పెంచుకున్న అతడు తన వైకల్యం అందుకు అడ్డురాకుండా చూసుకున్నాడు. కాలితోనే రాయడం నేర్చుకుని బిఈడి పూర్తిచేసిన సింహాచలం ఇటీవల స్క్రైబ్ సాయంతో డిఎస్సి రాశాడు. పట్టుదలతో రాత్రనక పగలనక చదివిన అతడు విజయనగరం జిల్లాలో 325 ర్యాంకు సాధించి ఉపాధ్యాయ కలను నెరవేర్చుకున్నాడు.
సింహాచలం కుటుంబ నేపథ్యం
విజయనగరం జిల్లా గనిశెట్టిపలెం గ్రామానికి చెందిన సింహాచలం నాయుడిది సాధారణ వ్యవసాయ కుటుంబం. తల్లిదండ్రులిద్దరు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇలాంటి రైతుకుటుంబంలో రెండు చేతులు, ఓ కాలు వైకల్యంతో జన్మించాడు సింహాచలం నాయుడు. అయితే ఆ తల్లిదండ్రులు ఈ వైకల్యం తమ బిడ్డకు శాపంగా మారకూడదని భావించారు... అందుకే చిన్నప్పటినుండి కాలితో రాయడం నేర్పించారు.
తల్లిదండ్రులు చదువుకోకున్నా కుటుంబసభ్యుల సాయంతో కొడుకు సింహాచలంకు చదువు నేర్పించారు. బాబాయిలు జామి వెంకట్రామణ, జామి నర్సింగరావుల ప్రోత్సాహంతో సింహాచలం నాయుడి చదువు ముందుకు సాగింది. ఇలా ప్రాథమిక విద్యాబ్యాసం పూర్తిచేసుకుని ఉన్నత చదువులు చదివాడు. అంగవైకల్యం అతడి చదువుకు అడ్డురాలేదు... కానీ డిఎస్సి సమయంలో కొంత ఇబ్బంది పెట్టింది. దాన్ని కూడా అధిగమించి స్క్రైబ్ సాయంతో పరీక్ష రాసిన సింహాచలం నాయుడు ప్రభుత్వ టీచర్ ఉద్యోగాన్ని సాధించాడు.
కల నెరవేరిన క్షణం...
ఆత్మవిశ్వాసం, పట్టుదల ఆయుధంగా.. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో వైకల్యాన్న జయించి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాడు సింహాచలం నాయుడు. తన ఉద్యోగ సాధనకు కూటమి ప్రభుత్వ మెగా డిఎస్సి కూడా కారణమని అంటున్నాడు. ఉపాధ్యాయుడిని కావాలన్న తన కోరిక మెగా డిఎస్సితో తీరిందని... విజయనగరం జిల్లాలో మంచి ర్యాంకు సాధించినట్లు తెలిపాడు. ఇలా వేలాది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడంతో తనలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది... దీంతో కష్టపడి చదివి ఉద్యోగాన్ని సాధించినట్లు తెలిపాడు.
సీఎం చంద్రబాబుకు సింహాచలం కృతజ్ఞతలు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక దన్యవాదాలు తెలిపాడు సింహాచలం నాయుడు. కూటమి ప్రభుత్వం ముందుగానే టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం, తర్వాత డిఎస్సి నిర్వహించడం తనకు కలిసివచ్చిందన్నాడు. సింహాచలం నాయుడు ప్రభుత్వ ఉద్యోగం సాధించడంతో ఆ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులే కాదు గ్రామస్తులందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మెగా డిఎస్సి ర్యాంకర్ సింహాచలం నాయుడు సక్సెస్ స్టోరీ అతడి మాటల్లోనే
నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తి నమస్కరిస్తుంది
విజయనగరం జిల్లా కొత్తవలస మండలం గనిశెట్టిపాలెం గ్రామానికి చెందిన జామి సింహాచలం నాయుడు.. పుట్టుకతోనే రెండు చేతులు పని చేయవు. చదువుకోవాలనే సంకల్పం కాళ్లతో రాయటం నేర్చుకున్నాడు. ఆత్మవిశ్వాసం, పట్టుదల ఆయుధంగా.. కుటుంబ సభ్యుల… pic.twitter.com/9es8nrouei— Telugu Desam Party (@JaiTDP) October 3, 2025