తెలుగు యువతకు బంపరాఫర్ : రూ.50,000 సాలరీతో పవన్, లోకేష్ వద్ద పనిచేసే అవకాశం
మీ అభిమాన రాజకీయ నాయకుల దగ్గర పనిచేస్తూ నెలనెెలా రూ.50,000 సాలరీని పొందే అద్భుత అవకాశం. ఇలాంటి ఉద్యోగాల భర్తీకి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సిద్దమైంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొండి... అర్హతలున్నవారు వెంటనే అప్లై చేయండి.
Andhra Pradesh Jobs
Andhra Pradesh Jobs : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు అద్భుత అవకాశం ఇచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ వంటి పెద్దపెద్ద నాయకుల వద్ద మంచి సాలరీతో కూడిన జాబ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలను, వివిధ మంత్రిత్వ శాఖల పనితీరును ప్రజల్లోకి తీసుకువెళ్ళే ఉద్యోగాలివి. ఇప్పటికే ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమయ్యింది.
ఆంధ్ర ప్రదేశ్ డిజిటల్ కార్పోరేషన్ లిమిటెడ్ (APDC) మంత్రుల పేషీల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తం 15 పోస్టుల భర్తీకి సిద్దమైంది చంద్రబాబు సర్కార్. అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభించారు.
పోస్టుల వివరాలు :
సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ - 9 పోస్టులు
సోషల్ మీడియా అసిస్టెంట్ - 6 పోస్టులు
దరఖాస్తు ప్రక్రియ :
అర్హత కలిగిన అభ్యర్థులు ఆంధ్ర ప్రదేశ్ డిజిటల్ కార్పోరేషన్ లిమిటెడ్ అధికారిక మెయిల్ ఐడి info.apdcl@gmail.com కు పూర్తి వివరాలతో కూడిన రెస్యూమ్ (సివి) ని మెయిల్ చేయాలి.
ఈ ఉద్యోగాలకు ఎలాంటి రికమండేషన్లు పనిచేయవని... ఎవరయినా అభ్యర్థులు దరఖాస్తుతో పాటు రికమెండేషన్ లెటర్లు పంపితే ఆ అప్లికేషన్ తిరస్కరించబడుతుంది నోటిఫికేషన్ లో స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి అభ్యర్థులు అలాంటి ప్రయత్నాలు చేయవద్దు.
దరఖాస్తుకు చివరి తేదీ :
డిసెంబర్ 27, 2014 న నోటిఫికేషన్ వెలువడింది. అప్పటినుండే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జనవరి 03, 2025 సాయంత్రం 5 గంటలలోపు వచ్చిన దరఖాస్తులనే పరిగణలోకి తీసుకోనున్నారు. కాబట్టి అన్ని అర్హతలు, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోడానికి కేవలం రెండ్రోజుల సమయం మాత్రమే వుంది... కాబట్టి వెంటనే మీ రెస్యూమ్ ను APDC కి మెయిల్ చేయండి.
దరఖాస్తు ఫీజు : సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. కాబట్టి అన్ని అర్హత కలిగిన ఎవరైనా ఉచితంగానే దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హతలు :
సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ పోస్టుకు సాంకేతిక పరిజ్ఞానం వున్నవారినే ఎంపిక చేయనున్నారు.అందుకోసమే బిఈ, బిటెక్ చేసినవారిని అర్హులుగా నిర్ణయించారు.
ఇక సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టులకు మాత్రం కేవలం ఏదయినా డిగ్రీ పూర్తిచేసి వుంటే చాలు. ఏదయినా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థల ఈ డిగ్రీలు చదివివుండాలి.
వయో పరిమితి :
18 ఏళ్ల నుండి 42 ఏళ్లలోపు వారు ఈ పోస్టులకు అర్హులు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వయో పరిమితి నిబంధనలే వర్తిస్తాయి... వయోపరిమితి సడలింపు కూడా దాన్నిబట్టే వుంటుంది.
ఎంపిక ప్రక్రియ :
దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు రెండు నెలలపాటు ట్రైనింగ్ వుంటుంది. ఇందులో పర్ఫామెన్స్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు సరిపోతారో లేదో నిర్ణయిస్తారు. ఇలా ఉద్యోగాలకు సరిపోయే అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. కేవలం వారికి మాత్రమే ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా మరోసారి సోషల్ మీడియా స్కిల్స్ ను పరీక్షిస్తారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికే ఈ ఉద్యోగాలకు ఎంపికచేస్తారు.
ఎంపికైన అభ్యర్థులు ఏడాదిపాటు డిజిటల్ కార్పోరేషన్ లిమిటెడ్ లో ఔట్ సోర్సింగ్ అంటే కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేయాలి. ఈ సెలక్షన్ ప్రాసెస్ లో స్కిల్ టెస్ట్ కీలకం... కాబట్టి సోషల్ మీడియాపై మంచి అవగాహన వున్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
సాలరీ :
సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ పోస్టుకు ఎంపికైన వారికి ప్రతి నెలా రూ.50 వేల జీతం అందుకుంటారు. అలాగే సోషల్ మీడియా అసిస్టెంట్ ఉద్యోగానికి నెలకు రూ.30 వేల జీతం వస్తుంది.
సోషల్ మీడియా ఉద్యోగాలకు ఈ అర్హతలు కూడా వుండాలి :
1. డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేసి దాన్ని ప్రమోట్ చేసిన అనుభవం వుండాలి.
2. ప్రభుత్వ శాఖలు, డిపార్ట్ మెంట్స్ పనితీరుపై అవగాహన వుండాలి.
3. ప్రజలను మెప్పించేలా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కంటెంట్ రూపొందించగలగాలి.
4.ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, డిజైనర్లు, కంటెంట్ రైటర్లను సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ పనులను బాగా ప్రచారం చేయగలగాలి.
5. పరిస్థితులను అంచనా వేసుకుని అందుకు తగినట్లుగా సోషల్ మీడియాను నడిపించాలి.
6.సమాచారం నిజమైనదా కాదా అన్నది దృవీకరించగలగాలి. ఫ్యాక్ట్ చెక్ చేయగలగాలి. జర్నలిస్టులు, సోర్సెస్ నుండి సమాచారాన్ని రాబట్టుకోగలగాలి.
7. ఫేస్ బుక్ ఇన్సైట్స్,గూగుల్ అనలిటిక్స్, హూట్ సూట్ వంటివాటిపై అనుభవం వుండాలి.
8. ప్రభుత్వ వాయిస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా కంటెంట్ తో పాటు వీడియోలు, ఫోటోలు సేకరించగలగాలి. కంటెంట్ పై ప్రజలకు ఆసక్తిని పెంచాలి.
9. సోషల్ మీడియా అకౌంట్స్ ను నిర్వహించాలి. కామెంట్స్, మెసేజ్ లను పరిశీలించాలి.
10. ప్రతిరోజు సోషల్ మీడియా ట్రెండ్స్ ను గుర్తించాలి. వాటికి అనుగుణంగా ప్రభుత్వ విధానాలను ఎలా ప్రజల్లోకి తీసుకెళ్ళాలో తెలుసుకుంటూ వుండాలి.
మొత్తంగా ఆల్ రౌండర్ గా పనిచేసే అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ వున్నవారు ఈ ఉద్యోగాలకు సరైనవారు. అలాంటి వారినే ఎంపిక చేసుకునేందుకు ఆంధ్ర ప్రదేశ్ డిజిటల్ కార్పోరేషన్ ఈ నోటిపికేషన్ విడుదల చేసింది.