పంతానికి పోతే: నిమ్మగడ్డ ఇష్యూలో జగన్ కు వరుస ఎదురు దెబ్బలు ఇవీ...
రమేష్ కుమార్ వ్యవహారంలో హై కోర్టు తీరూపై మరోసారి ఏపీ ప్రభుత్వం సుప్రీమ్ తలుపు తట్టినప్పటికీ.... గవర్నర్ మాత్రం ఇందుకోసం నిరీక్షించకుండా నేరుగా తమ నిర్ణయాన్ని ప్రకటించారు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో జగన్ సర్కారుకు మరోసారి చుక్కెదురైంది. హై కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా ఆయనను నియమించాలని గవర్నర్ హరిచందన్ ప్రభుత్వానికి సూచించారు. తనను నియమించమని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా ఆయన సోమవారంనాడు గవర్నర్ ని కలిశారు. ఆయన విజ్ఞప్తిపై నేడు స్పందించారు గవర్నర్.
రమేష్ కుమార్ వ్యవహారంలో హై కోర్టు తీరూపై మరోసారి ఏపీ ప్రభుత్వం సుప్రీమ్ తలుపు తట్టినప్పటికీ.... గవర్నర్ మాత్రం ఇందుకోసం నిరీక్షించకుండా నేరుగా తమ నిర్ణయాన్ని ప్రకటించారు. సుప్రీమ్ లో ఐదవరికే అనేక పర్యాయాలు నిమ్మగడ్డ కేసులో జగన్ సర్కారుకు వ్యతిరేక తీర్పులొచ్చాయి. ఈసారి దాఖలు చేసిన పిటిషన్ కూడా అదే విషయం అవడంతో దానిపై తీర్పు ఎలా ఉండబోతుందో అని అంతా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ విషయం ప్రారంభమయినప్పటినుండి ఇప్పటివరకు కోర్టుల్లో అనేక సార్లు జగన్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఆరంభం నుండి ఇప్పటివరకు అనేకసార్లు ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ.. ప్రభుత్వం మాత్రం తన మొండి వైఖరిని మార్చుకోలేదు.
తొలుత ఎన్నికలను కరోనా కారణంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ రద్దు చేయగానే.... జగన్ బహిరంగంగానే ఆయనను విమర్శించారు. గవర్నర్ ని కలిసి ఆ తరువాత ప్రెస్ మీట్ లో చాలా తీవ్రంగా మాట్లాడారు. ఆయన అప్పుడు హుందాగా నడుచుకొని ఉంటె బాగుండేది. తమ అధినేతనే ఈ విధంగా మాట్లాడడంతో.... వైసీపీ పార్టీ క్యాడర్ మరింత రెచ్చిపోయారు.
బహుశా జగన్ గారు ఏరికోరి తెచ్చిపెట్టుకున్న సలహాదారుల సూచనల మేరకు ఈ విధంగా మాట్లాడి ఉంటారు. దీనితో నిమ్మగడ్డ తనకు రక్షణ కల్పించమని కేంద్రానికి లేఖ రాసారు. లేఖ రాయడంతో.... కేంద్ర బలగాలు ఆయన కార్యాలయం ముందు ప్రత్యక్షమయ్యాయి. ఆ సలహాల దెబ్బకు జగన్ తొలిసారి ఒక అపవాదును మూటగట్టుకోవాలిసి వచ్చింది
ఆ తరువాత సైతం మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా జగన్ బాటలోనే తిట్ల వర్షాన్ని కురిపించారు. ఇక ఒక అడుగు ముందుకేసి అమాత్యులు నిమ్మగడ్డ రాసిన లేఖపైన్నే విమర్శలను గుప్పించారు. ఆయన కులం ఆధారంగా చంద్రబాబును సైతం లాగి ఆయనను నానామాటలు అన్నారు.
ఆ లేఖ ఆయన తన కార్యాలయంలో రాసింది కాదు అని చేసిన రచ్చ అందరూ చూసిందే. ఆ తరువాత ఎన్నికల రద్దు వద్దంటూ కోర్టుకెక్కడం అక్కడ కూడా తీర్పు వ్యతిరేకంగా వచ్చిన విషయం తెలిసిందే. ఇక్కడ కూడా మరోమారు కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ కోర్టుకెళ్లకుండా ప్రభుత్వానికి సలహాదారులు సలహా ఇవ్వలేకపోయారా లేదా సలహాదారులే కోర్టుకెళ్లమని సలహా ఇచ్చారా అనేది తెలియాల్సి ఉంది.
ఇక లాక్ డౌన్ వల్ల అందరూ కరోనా వ్యాప్తి, ఆ కొత్త వైరస్ భయంలో కొట్టుమిట్టాడుతుంటే జగన్ సర్కార్ జస్టిస్ కనగరాజ్ ను తీసుకొచ్చింది. ఎన్నికల కమీషనర్ వంటి పదవుల్లో ఉన్నవారికి వ్యతిరేకంగా వారి నియమ నిబంధనలకు వ్యతిరేకంగా మార్చకూడదు అని తెలిసినప్పటికీ వారు మాత్రం ప్రభుత్వానికి ఆ సలహాలు ఇచ్చి ఉండాలి. లేదంటే వేరెవరో ఇచ్చిన సలహాలను ప్రభుత్వం అనుసరిస్తున్నప్పటికీ కూడా వారు ఆపలేదు. రెంటిలో ఏది జరిగినప్పటికీ... తప్పు మాత్రం సలహాదారులదే!
ఇక హై కోర్టు, సుప్రీమ్ కోర్టుల్లో కూడా ప్రభుత్వానికి ఎన్నిమార్లు చివాట్లు పడ్డాయో మనందరం చూసిందే. కోర్టులు కేవలం ఈ నిమ్మగడ్డ విషయంలోనే కాదు ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు, వాటిని మార్చమని చెప్పినప్పుడు మరో రంగు వేసి దానికి కొత్త అర్థాలను చెప్పినప్పుడు అన్ని విషయాల్లోనూ ప్రభుత్వానికి చిక్కులు ఎదురయ్యాయి.
ప్రభుత్వంలో ఎంతమంది సలహాదారులు ఉన్నారో మనకు తెలిసిందే. ప్రతిశాఖలో కూడా అధికారులకన్నా సలహాదారులు ఎక్కువయిపోయారని తరచుగా సోషల్ మీడియాలో జోకులు పేల్చేవారు చాలామందే ఉన్నారు.
ఇంతమంది ఉండి కూడా, వారిలో చాల మంది మాజీ ఐఏఎస్ లు, న్యాయకోవిదులు, పాలనానుభవం ఉన్నటువంటివారు. అయినప్పటికీ.. ప్రభుత్వానికి మాత్రం ఇబ్బందులు తప్పలేదు. వారి తప్పా, జగన్ మంకు పట్టా కానీ... వరుస ఎదురు దెబ్బలు మాత్రం ఎదురయ్యాయి.