కాళ్లు కట్టేసి పాదాలపై కొట్టారు: పార్లమెంటరీ కమిటీ చైర్మన్, సభ్యులకు రఘురామ లేఖ
సీఎం జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయడానికి ఎంత ధైర్యమంటూ తనను ఐదుగురు తీవ్రంగా హింసించారని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్లమెంటరీ కమిటీ సభ్యులకు లేఖ రాశారు.
సీఎం జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయడానికి ఎంత ధైర్యమంటూ తనను ఐదుగురు తీవ్రంగా హింసించారని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్లమెంటరీ కమిటీ సభ్యులకు లేఖ రాశారు.
గత నెల 14 వ తేదీన ఏపీ ప్రభుత్వానికి అప్రతిష్టంగా మాట్లాడినందుకు గాను ఆయనను ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాలను ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు.
తనను అరెస్ట్ చేసిన రోజున ఐదుగురు వ్యక్తులు మాస్కులు ధరించి ఉన్నట్లుండి లోపలికి వచ్చారు. వారు పోలీసులేనని నా భావన. వారు నా కాళ్లు కట్టేసి నా పాదాలపై లాఠీలతో, రబ్బరు బెల్టులతో కొట్టారన్నారు. నా నోట్లో గుడ్డలు కుక్కారు. నా ఛాతీపై కూర్చున్నారు. దాదాపు ఐదు రౌండ్ల పాటు ఇలా సాగింది. నన్ను హత్యచేసే ప్రయత్నంలో భాగంగా గంటకు పైగా దాడి చేశారని ఆయన ఆరోపించారు
కస్టడీలో తనను హింసిస్తూనే ముసుగు వ్యక్తులు తనను అత్యంత హేయమైన బూతు పదజాలంతో హెచ్చరించారన్నారు. సీబీఐ కోర్టులో సీఎం జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేయడానికి నీకెంత ధైర్యమని ప్రశ్నిస్తూ హింసించారన్నారు.
జగన్‌కు బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేసినందుకే కాకుండా ఆయన దుష్పరిపాలన గురించి ప్రజలకు వివరంగా తెలిపినందుకు తనపై సెక్షన్ 124-ఏ కింద రాజద్రోహ నేరం మోపారని కమిటీ చైర్మన్ భూపేంద్ర సింగ్ యాదవ్, ఇతర సభ్యులకు ఈ మేరకు లేఖ రాశారు.
ఈ కమిటీలో రఘురామరాజు కూడా సభ్యుడు. తనపై జరిగిన దారుణమైన దాడిని ముక్తకంఠంతో ఖండించాలని ఆయన ఎంపీలందరినీ కోరారు.
భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా ఈ దారుణమైన సెక్షన్ (124-ఏ)ను రద్దు చేయాలని పార్లమెంటరీ కమిటీని కోరారు. ఈ విషయంలో తనకు సంఘీభావం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు, తన కాళ్ల గాయాల ఫొటోలు, ఎయిమ్స్‌లో వైద్య చికిత్స జరిగిన తర్వాతి ఫొటోలను ఆయన తన లేఖకు జతచేశారు.
ఈ లేఖ అందిన వెంటనే కమిటీలో మరో సభ్యుడైన కాంగ్రెస్ నేత మాణికం ఠాకూర్ ట్విటర్‌లో తీవ్రంగా స్పందించారు. లోక్ సభలో నా సహచరుడు రఘురాజు నుంచి వచ్చిన లేఖ చూసి దిగ్బ్రాంతి చెందినట్టుగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయన పట్ల క్రూరంగా, పచ్చి ఉన్మాదంతో వ్యవహరించారని ఆయన విమర్శించారు.
సైద్ధాంతికంగా తాను రఘురామతో విభేదిస్తాను. కానీ ఒక పార్లమెంటేరియన్ పట్లే ఈ విధంగా జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో సామాన్య రాజకీయ కార్యకర్తల మాటేమిటి? అదేమన్నా హిట్లర్ రాజ్యమా అని ప్రశ్నించారు.
రాష్ట్రప్రభుత్వం ప్రారంభించిన అనేక పథకాలు, ఇతర కార్యక్రమాలను తాను విమర్శించడాన్ని దురుద్దేశంతో అర్థం చేసుకుని.. తన పట్ల వ్యక్తిగతంగా కక్ష పెంచుకున్నారని రఘురామరాజు పార్లమెంటరీ కమిటీ సభ్యులకు రాసిన లేఖలో వివరించారు.
ఏపీ ప్రభుత్వ దుష్పరిపాలనపై నా వైఖరిని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన 150 తీర్పులు ధ్రువీకరించాయన్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు.
గత 18 నెలలుగా ఆయన కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కాలేదన్నారు. ఇది బెయిల్ షరతులకు విరుద్ధం. కోర్టుకు హాజరు కాకుండా ముఖ్యమంత్రి మినహాయింపు కోరినప్పుడు సీబీఐ కూడా వ్యతిరేకించిందని ఆయన గుర్తు చేశారు.
కానీ కోర్టు తిరస్కరించింది. గత 18 నెలలుగా ఆయన ప్రతి వారం హాజరు కాకుండా ఉండేందుకు సీబీఐ కోర్టు 317 పిటిషన్లను ఆమోదించింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి బెయిల్ రద్దుకు నేను పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చింది. 2019లో ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన సాక్షులను ప్రభావితం చేయడం ప్రారంభించారు.
కస్టడీలో నన్ను హింసించారని మేజిస్ట్రేట్ కు ఫిర్యాదుచేశానని ఆయన చెప్పారు. ఆమె నా పాదాలను పరిశీలించి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రితో పాటు రమేశ్ ఆస్పత్రికి కూడా పంపాలని ఆదేశాలు జారీచేశారన్నారు.
హైకోర్టు కూడా ఇవే ఆదేశాలిచ్చింది. కానీ వాటిని ఉల్లంఘించి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి నా శరీరంపై గాయాలే లేవంటూ తప్పుడు మెడికల్ సర్టిఫికెట్ తయారు చేయించారు. దీనిపై హైకోర్టు సీఐడీ, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు కోర్టు ధిక్కారం కింద నోటీసులు జారీ చేసిందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.