తిరుమలలో అంబానీ అద్భుత సదుపాయం.. భక్తులకు నిత్యం 2 లక్షల అన్నప్రసాదాలు
Mukesh Ambani TTD: ముఖేష్ అంబానీ తిరుమలలో అధునాతన వంటశాలను నిర్మించేందుకు ముందుకొచ్చారు. నిత్యం రెండు లక్షల అన్నప్రసాదాలను భక్తులకు అందించే లక్ష్యంతో ఈ సేవా కార్యక్రమం చేపడుతున్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ముఖేష్ అంబానీ
Mukesh Ambani TTD: ఆదివారం ఉదయం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామిని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ దర్శించుకున్నారు. ఈ క్రమంలోనే మరోసారి తన సేవా మనసును చాటుకున్నారు. భక్తుల సంక్షేమం కోసం ఆయన కుటుంబం, రిలయన్స్ ఫౌండేషన్ కలసి శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ తరఫున ఒక ఆధునిక, అత్యుత్తమ సాంకేతికతతో కూడిన వంటశాల నిర్మాణాన్ని ప్రకటించారు.
ఈ కొత్త వంటశాల పూర్తిగా ఆటోమేటెడ్ వ్యవస్థలతో ఉండనుంది. రోజుకు రెండు లక్షలకుపైగా భక్తులకు పవిత్ర అన్నప్రసాదం అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. పరిశుభ్రత, పోషక విలువలు, భక్తి సమన్వయంతో ఈ ఆహార సేవను మరింత సమర్థవంతంగా నిర్వహించాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్టు ప్రారంభమవుతోంది.
అంబానీ ఈ ప్రాజెక్టును తిరుమల తిరుపతి దేవస్థానం (TTD), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాగస్వామ్యంతో చేపట్టడం విశేషం. “భక్తుల కోసం ప్రతి అన్నమూ ఒక దైవ సేవ” అనే భావనతో, ‘ఏ భక్తుడూ ఆకలితో ఉండకూడదు’ అనే తిరుమల దివ్య సంకల్పానికి మేము భాగస్వామ్యం కావడం గర్వంగా భావిస్తున్నామని ఆయన తెలిపారు.
విశ్వాసం, సేవ, కరుణకు చిహ్నంగా అంబానీ అడుగులు
తిరుమలలోని ఈ ప్రాజెక్టు ద్వారా భక్తులకు అందించే సేవలు మరింత మెరుగవుతాయి. తిరుమల నుంచి వెళ్లిన అంబానీ కేరళ రాష్ట్రంలోని గురువాయూర్ శ్రీ కృష్ణ దేవాలయాన్ని కూడా సందర్శించి, ఆ ఆలయానికి ₹15 కోట్ల విరాళం అందజేశారు.
ముఖేష్ అంబానీ కుటుంబం తరచుగా భారతదేశంలోని ప్రముఖ దేవాలయాలకు సేవలు అందిస్తూ వస్తోంది. ఈసారి తిరుమలలో ప్రారంభిస్తున్న ఆధునిక వంటశాల, టీటీడీ దేవాలయాలన్నింటికీ అన్నసేవ సంప్రదాయాన్ని విస్తరించే దిశగా ఒక కీలకమైన అడుగుగా భావిస్తున్నారు.
టీటీడీ అధికారులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, స్థానిక భక్తులు ఈ సేవా ప్రాజెక్టును హర్షంతో స్వాగతించారు. అంబానీ చేస్తున్న ఈ దాతృత్వ సేవలు.. తిరుమల భక్తి సంప్రదాయానికి కొత్త శక్తి, కొత్త స్పూర్తిని అందజేస్తుందని భక్తులు అభిప్రాయపడ్డారు.