ఎంపీ కుటుంబం కిడ్నాప్ కేసు : ఎంవీవీ సత్యనారాయణ వ్యాపారాలు తెలంగాణకు మార్పు !!
రాజకీయాలు, వ్యాపారానికి కలిపి ముడిపెడుతున్నారని.. విశాఖలో వ్యాపారం చేయడం కష్టంగా మారిపోతుందని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.
విశాఖపట్నం : విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడు, ఆడిటర్ జీవీలను కిడ్నాప్ చేసిన ఉదాంతం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ తీసుకున్న తాజా నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. తన వ్యాపారాలను వైజాగ్ నుంచి హైదరాబాద్ కు మార్చాలని అనుకుంటున్నట్టుగా.. హైదరాబాదులోనే వ్యాపారాలపై ఎక్కువ దృష్టి పెట్టేందుకు నిర్ణయించుకున్నారని సమాచారం.
ఈ విషయాన్ని తన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. విశాఖ ఋషికొండలోని ఎంపీ ఇంట్లో.. రౌడీషీటర్ హేమంత్ మరో ఐదుగురుతో కలిసి ఆయన కుమారుడు శరత్, భార్య జ్యోతిలను బంధించి.. వారిచేత వైసిపి నేత ప్రముఖ ఆడిటర్ జీవీకి ఫోన్ చేయించి పిలిపించి ముగ్గురిని కిడ్నాప్ చేయడం.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఈ నేపథ్యంలోనే విశాఖపట్నంను వదిలి తెలంగాణకు వెళ్ళిపోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆంధ్ర ప్రదేశ్ పరిపాలన రాజధానిగా విశాఖపట్నం ని ప్రకటించడం.. వైసీపీ ఎంపీ విశాఖలో వదిలి వెళ్ళిపోతాను అనడంతో ఇప్పుడు ఇది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎంపీ, జీవిలు చేపట్టిన ప్రాజెక్టుల విషయంలో వివాదాలు చెలరేగడం ఇది కొత్తేమీ కాదని తెలుస్తోంది. నిరుడు మధురవాడలోని సాయి ప్రియ గార్డెన్స్ దగ్గర వీరిద్దరూ చేపట్టిన భారీ ప్రాజెక్టు విషయంలో కూడా ఇలాంటి వివాదమే చోటు చేసుకుంది.
వీరి మీద కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగంలోని నాన్ కేడర్ ఎస్పీ ఒకరు.. తన స్థలంలో రోడ్డు వేశారని, గెడ్డను మళ్ళించారని ఆరోపించారు. ఆ సమయంలోనే వైజాగ్లో వ్యాపారం చేయనీయడం లేదని హైదరాబాద్ కు వెళ్ళిపోతానని ఎంపీ అన్నారు. విజయ్ సాయి రెడ్డి వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా ఉన్న సమయంలో కూడా పలు విషయాల్లో పరస్పర ఆరోపణలు జరిగాయి. ఆ సమయంలో కూడా విశాఖలో తన వ్యాపారాలు చేసుకొనివ్వడం లేదని ఎంవీవీ అన్న విషయాలు వెలుగు చూస్తున్నాయి.
ఇప్పుడు ఏకంగా తన కుటుంబ సభ్యులనే కిడ్నాప్ చేయడంతో… ఇదే విషయాన్ని మరోసారి చెబుతున్నారు. అంతేకాదు వ్యాపారానికి అవసరమైన అనుమతులు పొందడంలో కూడా ఎక్కువ సమయం పడుతుందని ఆయన తన సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఏపీలో రాజకీయాలు, వ్యాపారం ఒకేసారి కొనసాగించడం కష్టమైపోతుంది.
వ్యాపారాన్ని, రాజకీయాన్ని కలిపేస్తున్నారు. అందుకే నా వ్యాపారాన్ని హైదరాబాదులో చేద్దామని నిర్ణయానికి వచ్చాను. ప్రజాసేవ కోసం విశాఖలోనే రాజకీయాలు చేస్తాను. రాజకీయాల్లో ఉన్నందువల్ల ఎవరో ఒకరు.. ఏదో సమయంలో.. ఏదో ఒకటి అంటూనే ఉంటారని.. ప్రముఖ వార్తాపత్రిక ఈనాడుతో ఆయన అన్నట్టుగా కథనం. విశాఖ అభివృద్ధిలో ఎంవీబీ బిల్డర్స్ ముఖ్యపాత్ర పోషించింది.
అయినా అధికార పార్టీలో ఉండడం వల్ల అసత్య ప్రచారాలు ఎక్కువగా సాగుతున్నాయని.. తమ కస్టమర్లకు మంచి ఫ్లాట్లు, మంచి సర్వీసు ఇచ్చామని ఆయన చెప్పుకొచ్చారు. ‘డబ్బుల కోసం ఎవరో కిడ్నాప్ చేస్తే మాత్రం నేను భయపడి ఊరు వదిలి పారిపోతానా?.. నా వ్యాపారాన్ని రాజకీయాలకు ముడిపెట్టి రాజకీయం చేస్తున్నారు. అందుకే.. ఈ తలనొప్పులు లేకుండా ప్రశాంతంగా ఉంటుందనే వెళ్లాలనుకుంటున్నాను’ అని ఆయన చెప్పుకొచ్చారు.
‘నా ఆడిటర్ జీవిని.. కుటుంబ సభ్యులను కిడ్నాపర్లు చిత్రహింసలు పెట్టారు. వారి బాధ చూడలేకపోతున్నాను. ఒకవేళ నేను గనక ఆ రోజు వారి స్థానంలో ఉంటే.. కిడ్నాపర్లను చంపడమో.. నేను చచ్చిపోవడమో చేసేవాడిని. దీని కోసమే ముఖ్యమంత్రిని కలవడం లేదు. కిడ్నాపర్లకు శిక్ష పడాలి. అంతవరకు న్యాయపోరాటం చేస్తా. దానికోసం ఏం చేయాలో అంతా చేస్తా’ అని ఆయన తెలిపారు.