కేడీల రాజ్యంలో రైతులకు బేడీలు...అదే అన్నదాతల నేరమా?: నారా లోకేష్
రాజధాని కోసం భూములివ్వడమే అమరావతి ప్రాంత అన్నదాతలు చేసిన పాపమా? అంటూ లోకేష్ ఆవేదన వ్యక్తం చేశాడు.
మంగళగిరి: రైతులకు సంకెళ్లేస్తే జగన్‌రెడ్డిని ఇనుప గొలుసులతో తీసుకెళ్లాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. కేడీల రాజ్యంలో రైతులకు బేడీలు వేశారని... ఏం నేరం చేశారని రైతులకు సంకెళ్లు వేశారు?అని ప్రశ్నించారు. రాజధాని కోసం భూములివ్వడమే అమరావతి ప్రాంత అన్నదాతలు చేసిన పాపమా? అంటూ లోకేష్ ఆవేదన వ్యక్తం చేశాడు.
మంగళగిరి నియోజకవర్గం కృష్ణాయపాలెంలో అరెస్టయిన రైతుల కుటుంబాలను ఇవాళ నారా లోకేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అమరావతిలో రాజధాని కావాలని రైతులు కోరలేదు, ఐదు కోట్ల ఆంధ్రుల అందరికీ అందుబాటులో వుండే విధంగా నాటి ప్రభుత్వం ఇక్కడ రాజధానిని ఎంపిక చేసిందన్నారు. ప్రజా రాజధాని కోసం 29 వేల మంది రైతులు తమ భూములు త్యాగం చేశారన్నారు. నాడు ప్రతిపక్షనేతగా వున్న జగన్‌రెడ్డి రాజధానికి నీటివసతి వుండాలని, రాష్ట్రానికి మధ్యలో వుండాలని, 30 వేల ఎకరాలు కావాలని డిమాండ్ చేసి...నేడు ముఖ్యమంత్రిగా వుంటూ మూడు ముక్కలాటకు తెరతీశారని ఆరోపించారు.
ముఖ్యమంత్రే రాజధానికి భూములిచ్చిన రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులంటుంటే! మంత్రులు రైతుల్ని బూతుల్ని తిడుతున్నారని పేర్కొన్నారు. కరకట్ట కమల్‌హాసన్ ఇక్కడే రాజధాని వుంటుంది, నన్ను నమ్మండంటూ ఎన్నికలకు ముందు చెప్పిన మాటలేమయ్యాయని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందుకు మాట ఇచ్చి నేడు జగన్‌రెడ్డి మాట ఎందుకు తప్పారని నిలదీశారు.
రాజధాని ప్రాంత పరిధిలోకి ఇతర ప్రాంతాల వారొస్తే తెలియజేయండని నోటీసులిచ్చిన పోలీసులే ఇతర ప్రాంతాల వారి సమాచారం అడిగారనే నేరంపై దళిత, బీసీ రైతుల్ని అరెస్ట్ చేశారన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఆటో ఆర్టిస్టులను ఆపి, సమాచారం అడిగినందుకు బేడీలు వేస్తే... రాష్ట్రాన్ని దోచిన జగన్‌రెడ్డిని ఇనుపగొలుసులతో బంధించాలన్నారు. రైతులకు సంకెళ్లు వేసిన కేసులో నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం కాదని... ఈ ఆదేశాలిచ్చింది డిజిపియా, డిఫాక్టో హోం మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, ఉన్నతాధికారులా తేల్చాలన్నారు.
రైతులకు జరిగిన ఈ ఘోర అవమానంపై ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాసి రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందనే ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం ఓ ఉదాహరణగా నిలుస్తోందన్నారు. కృష్ణాయపాలెం రైతులపై పెట్టిన దొంగ కేసులన్నీ ఎత్తేసి వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుల్ని విడుదల చేసేవరకూ జేఏసీ, తెలుగుదేశం ఉద్యమం ఆపబోదన్నారు. రైతుల్ని విడిచిపెట్టకపోతే ముఖ్యమంత్రి మంగళగిరిలో తిరగలేరని లోకేష్ హెచ్చరించారు.
వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, ఈ అక్రమ కేసులన్నీ ఎత్తేస్తామన్నారు. రాజధాని రైతులపై కేసులకు కారకుడైన జగన్‌రెడ్డికి తాడేపల్లి ప్యాలెస్ జైలుగా మారనుందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండకూడదు... ప్రజాస్వరం వినిపించకూడదని అనుకుంటున్న జగన్‌రెడ్డికి ప్రజాఉద్యమం రుచిచూపిస్తామన్నారు. తప్పులు చేసి అక్రమాలు చేసిన జగన్‌రెడ్డి బెయిల్ పై హాయిగా తిరుగుతుంటే, ఏ తప్పూ చేయని మీరెందుకు భయపడాలని బాధితులకు లోకేష్ దైర్యం చెప్పారు.