జగన్ టార్గెట్: ఇక ఎపిలోనే పవన్ కల్యాణ్ మకాం, అంతా రెడీ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ఎన్నికలకు ఏడాది కంటే తక్కువ సమయం ఉండటంతో తన దృష్టి మొత్తం అటువైపుగా మళ్లిస్తున్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ఎన్నికలకు ఏడాది కంటే తక్కువ సమయం ఉండటంతో తన దృష్టి మొత్తం అటువైపుగా మళ్లిస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ తన మకాంను మంగళగిరికి షిఫ్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక్కడి నుంచే పార్టీకి సంబంధించి కార్యకలాపాలు కొనసాగించాలని ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎపి సిఎం వైఎస్ జగన్ పార్టీని ఓడించే లక్ష్యంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది
ప్రస్తుతం పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల నిమిత్తం ఏపీకి వెళ్లి వస్తున్నారు. మరోవైపు సినిమా షూటింగ్‌లతో కూడా బిజీగా గడుపుతున్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. పార్టీ కార్యక్రమాలపై ఎక్కువగా సమయం కేటాయించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు.
ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో ఉన్న జనసేన కేంద్ర కార్యాలయాన్ని ఇప్పటికే మంగళగిరికి మార్చేశారు. హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో కొంత సామాగ్రిని కూడా అవరసం మేరకు మంగళగిరికి తరలించారు. పవన్ కూడా ప్రస్తుతం మంగళగిరిలోని బస చేయనున్నారని తెలుస్తోంది.
ఇక నుంచి మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలోనే పవన్ ఉంటారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఏదైనా పనులు, సినిమా షూటింగ్ షెడ్యూల్‌లో మాత్రమే పవన్ హైదరాబాద్ వెళ్లునున్నారని సమాచారం. ఎవరైనా పవన్‌తో చర్చలు సినిమాలకు సంబంధించి చర్చలు జరపాలంటే మంగళగిరి వస్తున్నారని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
పవన్ కల్యాణ్ ఏపీకి మకాం షిఫ్ట్ ద్వారా హైదరాబాద్‌లో ఉంటున్నారని ఏపీ సీఎం జగన్ చేసే విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చినట్టుగా అవుతుందని జనసేన శ్రేణులు భావిస్తున్నాయి. ఇక, ఇప్పటికే రెండు విడతల వారాహి యాత్రను పూర్తి చేసుకున్న పవన్ కల్యాణ్.. మూడో విడతకు సంబంధించిన షెడ్యూల్‌పై పార్టీ ముఖ్య నాయకులతో చర్చలు జరుపుతున్నారు.