విజయసాయి, అవంతి రెచ్చిపోయినా: నోరు విప్పని గంటా, కారణమదే...
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడం ఖాయమైందనే ప్రచారం జరుగుతోంది
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడం ఖాయమైందనే ప్రచారం జరుగుతోంది. తన సన్నిహితుల ద్వారా రాయబారాలు నడిపి ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను ఒప్పించినందువల్లనే ఆయన నోరు మెదపడం లేదని అంటున్నారు.
గంటా శ్రీనివాసరావుకు ఉత్తరాంధ్రలో మంచి పట్టు ఉంది. వైసీపీలో చేరితే ఆయన తిరిగి తన ప్రాబల్యాన్ని చాటుకునే అవకాశం ఉంది. వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీకి చాలా కాలం నుంచి దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే, ఎప్పటికప్పుడు ఆయన బిజెపిలోనో, వైసీపిలోనో చేరుతారంటూ ప్రచారం సాగుతూనే ఉంది
వైసీపిలోకి ఆయన ప్రవేశాన్ని అడ్డుకోవడానికే ఎంపీ విజయసాయి రెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్రమైన ఆరోపణలు చేశారని అంటున్నారు. సైకిళ్ల కొనుగోలు వ్యవహారంలో గంటా శ్రీనివాస రావు అవినీతికి పాల్పడ్డారంటూ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఆరోపణలు చేశారు. ఎప్పుడో ఓసారి గంటా శ్రీనివాస రావు అరెస్టు కావచ్చునని అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు
వారు తనపై రెచ్చిపోయి ప్రకటనలు చేసినా గంటా శ్రీనివాస రావు పల్లెత్తు మాట కూడా అనలేదు. వైసీపీలో చేరడానికి జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినందు వల్లనే ఆయన మాట్లాడలేదని అంటున్నారు. పార్టీ మారే విషయంపై వివరణ కోరడానికి కొంత మీడియా ప్రతినిధులు ప్రయత్నించినా ఆయన స్పందించలేదు. తన వ్యూహంలో భాగంగానే ఆయన మీడియాకు కూడా దూరంగా ఉంటున్నారని అంటున్నారు
టీడీపీ ఎమ్మెల్యేలను తనకు అనుకూలంగా మలుచుకోవడం ద్వారా జగన్ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని బలహీనపరచాలని వైఎస్ జగన్ చూస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే వల్లభనేని వంశీని, కరణం బలరాంను తన వైపు తిప్పుకున్నారు. గంటా శ్రీనివాస రావు కూడా వస్తే టీడీపీ ఉత్తరాంధ్రలో మరింతగా బలహీనపడే అవకాశం ఉంది. అందుకే గంటా శ్రీనివాస రావును తన వైపు తిప్పుకోవడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది
పైగా, జగన్ విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధానిని నెలకొల్పుకోవాలని చూస్తున్నారు. విశాఖ నార్త్ నియోజకవర్గానికి గంటా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గంటా పార్టీలోకి వస్తే తాను అనుకున్న పని మరింత సులభమవుతుందని బహుశా జగన్ భావిస్తూ ఉండవచ్చు