- Home
- Andhra Pradesh
- చేపలు పట్టడానికి వెళ్లి... అర్థరాత్రి బోటునుంచి జారి పడి..12 గంటలపాటు సముద్రంలోనే ఈతకొడుతూ...
చేపలు పట్టడానికి వెళ్లి... అర్థరాత్రి బోటునుంచి జారి పడి..12 గంటలపాటు సముద్రంలోనే ఈతకొడుతూ...
ప్రమాదవశాత్తు బోటునుంచి జారిపడిన ఓ మత్స్యకారుడు 12 గంటలపాటు సముద్రంలో ఈతకొడుతూ ఉండిపోయాడు. ఈ ఘటన ఏపీలోని కాకినాడలో వెలుగు చూసింది.

కాకినాడ : ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో సముద్రం మీద వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడు బోటు నుంచి నీటిలోకి జారి పడిపోయాడు. అయితే, అది రాత్రివేళ కావడంతో.. ఆ మత్స్యకారుడు అత్యంత సాహసంగా దాదాపు 12 గంటల పాటు సముద్రంలోనే ఈత కొడుతూ ఉండిపోయాడు.
12 గంటల తర్వాత మరో మత్స్యకారుల బృందం అటువైపుగా వచ్చి అతడిని చూసి.. కాపాడి, సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే.. గేదెల అప్పారావు అనే మత్స్యకారుడు కాకినాడకు చెందిన వ్యక్తి. సోమవారం మరో ఐదుగురు మత్స్యకారులతో కలిసి చేపల వేటకు వెళ్లాడు.
మచిలీపట్నంకు చెందిన బోటు మీద కాకినాడ ప్రాంతం నుండి చేపల వేటకు వెళ్లి.. వేట చేసుకుని మంగళవారం ఉదయం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది హార్బర్ కు వచ్చారు.
అక్కడ తాము వేట చేసిన చేపలను అమ్ముకున్నారు. ఆ తర్వాత మంగళవారం మధ్యాహ్నం తిరిగి సముద్రంలోకి యధావిధిగా వేటకు వెళ్లారు. రాత్రిపూట సముద్రంలో వలవేశారు.. ఆ తర్వాత భోజనం చేసి పడుకున్నారు. అయితే అర్ధరాత్రి లేచి చూసేసరికి అప్పారావు కనిపించలేదని తోటి మత్స్యకారులు అంటున్నారు.
నిద్రలో బోటులో నుంచి జారి సముద్రంలో పడిపోయి ఉంటాడని వారు అనుమానించారు. దీంతో గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. పడిపోయిన 12 గంటల తర్వాత అప్పారావు.. సముద్రంలో ఈదుతూ దొరికాడు.
తాను ఎలా పడిపోయింది అప్పారావు చెబుతూ.. అర్ధరాత్రి పూట మూత్ర విసర్జన చేయడం కోసం తాను బోటు మీదికి వచ్చానన్నాడు. ఆ సమయంలో కెరటాలు పెద్దగా రావడంతో జారీ నీటిలో పడిపోయానని తెలిపారు. ఇది రాత్రి 11గం.ల ప్రాంతంలో జరిగి ఉండొచ్చని అన్నాడు.
అయితే, తాను మునిగిపోకుండా సముద్రంలో అలాగే ఈదుతూ ఉండిపోయానని.. పట్టుకోవడానికి ఏమీ లేకపోవడంతో.. సముద్రం మీద గాలివీస్తున్న కారణంగా బోటు నుంచి దూరంగా వెళ్లిపోయానన్నాడు. బుధవారం ఉదయం 11 గంటల వరకు సముద్రంలోనే.. అలాగే ఈదుతూ, తేలుతూ…ఉండిపోయానని తెలిపాడు. ఉదయం 11 గంటల సమయంలో సముద్రంలో తనకొక చిన్న బోటు కనిపించిందని తెలిపాడు.
ఆ ఓటు అంతర్వేది నుంచి వేటకు వెళ్లిన విశాఖ జిల్లా నక్కపల్లి మండలం రాజీపేట మత్స్యకారులది. వారు అప్పారావును గుర్తించారు. ఆయనను రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చారు. ఆ తర్వాత అంబులెన్స్ లో రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతనికి చికిత్స అందించారు. సముద్రంలో ఆపదలో ఉన్న అప్పారావును కాపాడిన రాజీపేట మత్స్యకారులకు అప్పారావు కుటుంబ సభ్యులు, స్థానికులు అభినందనలు తెలిపారు.