జనసేనలోకి ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్...
ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీలో కూడా పనిచేశారాయన. అయితే ఎక్కడా పోటీకి దిగలేదు. మరి ఈ సారి పోటీ చేస్తారా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది.

అమరావతి : రాజకీయాల్లో, సినిమాల్లో ఎప్పుడు ఎవరికి ఎవరితో సత్సంబంధాలు ఉంటాయో.. ఎవరు ఎప్పుడు మిత్రులవుతారో.. ఎవరు ఎప్పుడు శత్రువులవుతారో చెప్పడం కష్టం. ఇక, తెలుగు సినీ రంగానికి రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. నటీనటులు తమకు నచ్చిన పార్టీలో చేరి సపోర్ట్ అందిస్తూ.. రాజకీయాల్లో రాణించిన ఘటనలు చాలానే ఉన్నాయి.
అలాంటిదే ప్రస్తుతం జనసేన పార్టీ విషయంలో చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ నిర్మాత బోగవల్లి వెంకట సత్యనారాయణ ప్రసాద్ అలియాస్ బివి ఎస్ఎన్ ప్రసాద్.. సోమవారం నాడు జనసేన ఆఫీసులో ప్రత్యక్షమయ్యారు.
దీంతో ఇప్పుడు ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది సినిమా తీసిన తర్వాత.. ఆ సినిమా రిలీజ్ టైంలో బివిఎస్ఎన్ ప్రసాద్ కు పవన్ కళ్యాణ్ కు మధ్య విభేదాలు వచ్చాయి. నిన్న మొన్నటి వరకు ఇద్దరు ఎడమొఖం పెడ ముఖంగానే ఉన్నారు.
సోమవారం నాడు ఆయన సడెన్ గా జనసేన ఆఫీసులో ప్రత్యక్షమవడంతో అది చర్చనీయాంశంగా మారింది. పార్టీ ఆఫీసుకు రావడమే కాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కూడా కప్పుకున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ కు జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పవన్ కళ్యాణ్.
బివిఎస్ఎన్ ప్రసాద్ ఇప్పటివరకు ఎప్పుడు రాజకీయాలపై ఆసక్తి ప్రదర్శించలేదు. అలాంటిది ఉన్నట్టుండి జనసేన తీర్థం పుచ్చుకోవడంతో అటు ఏపీ పాలిటిక్స్ లోను ఇటు టాలీవుడ్ లోనూ ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
బివిఎస్ఎన్ ప్రసాద్ పార్టీలో చేరడంతో ఇటు జనసేనలోను అటు మెగా అభిమానులలోను సంతోషం వ్యక్తం అవుతుంది. బివిఎస్ఎన్ ప్రసాద్ లాంటి బిగ్ షాట్ జనసేనలో చేరడం పార్టీకి ఆర్థికంగా కలిసి వస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ధర్మ పరిరక్షణ నిమిత్తం పవన్ కళ్యాణ్ చేస్తున్న యాగ క్రతువులు బివిఎస్ఎన్ ప్రసాద్ పాలుపంచుకున్నారు. దీనికోసం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు ప్రసాద్.
తాను పార్టీలో చేరతానని పవన్ కళ్యాణ్ కు చెప్పగానే ఆయన నిర్ణయాన్ని స్వాగతించి జనసేన కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు పవన్ కల్యాణ్. పార్టీ కోసం తన వంతు కృషి చేస్తానని పవన్ కళ్యాణ్ తో ఈ సందర్భంగా బివిఎస్ఎన్ ప్రసాద్ తెలిపారు.
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన బివిఎస్ఎన్ ప్రసాద్ గతంలో ప్రజారాజ్యం పార్టీకి కూడా సేవలు అందించారు, మెగాస్టార్ ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీని విలీనం చేసేవరకు కూడా అందులోనే ఉన్నారు. కానీ ప్రజారాజ్యం నుంచి పోటీ చేయలేదు. మరి ఇప్పుడైనా కార్యకర్తగానే ఉంటారా? పోటీ చేస్తారా? అనేది చూడాలి.