వివాహేతర సంబంధం : భార్యను చున్నీతో ఉరిబిగించి.. హత్య చేసిన భర్త...
వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్యను చున్నీ గొంతుకు బిగించి హత్యచేశాడో భర్త. ఈ దారుణ ఘటన అనకాపల్లిలో వెలుగు చూసింది.
అనకాపల్లి : ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో దారుణ ఘటన వెలుగు చూసింది. భార్యపై వివాహేతర సంబంధం అనుమానంతో ఓ భర్త ఆమెను హత్య చేశాడు. భార్య మెడకు చున్నీ బిగించి హతమార్చాడు. ఆ తర్వాత నేరుగా వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు.
మంగళవారం నాడు అనకాపల్లి మండలంలోని తోటాడలో ఈ ఘటన వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే… కొత్తలంక నూకప్పారావు గ్రామంలోని దళితవాడకు చెందిన వ్యక్తి. స్థానికంగా సీలింగ్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు.
గోలుగొండ మండలం గుండపాలకు చెందిన దీనమ్మ(26)తో పదేళ్ల క్రితం నూకప్పారావుకు వివాహం అయ్యింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ ముగ్గురు పిల్లలు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు.
ఈ క్రమంలోనే నూకప్పారావుకు, దీనమ్మకు మధ్య విభేదాలు తలెత్తాయి. దీనమ్మ.. వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం నూకప్పారావుకు తెలిసింది. అది జీర్ణించుకోలేకపోయాడు. తరచుగా ఇదే విషయంతో భార్యతో గొడవపడేవాడు.
భార్య భర్తలిద్దరు.. కొద్దికాలం విడిగా కూడా ఉన్నారు. అయినా కూడా ఆమె ప్రవర్తనలో మార్పు లేదు. దీంతో నూకప్పారావు అసహనానికి గురైయ్యాడు. ఈనెల 23వ తేదీన పెద్దల దగ్గర పంచాయతీ కూడా జరిగింది.
ఆ తర్వాతి రోజు ఉదయం 9:30 గంటల ప్రాంతంలో పిల్లలు స్కూలుకు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మరోసారి గొడవ మొదలైంది. దీంతో కోపం పట్టలేకపోయిన భర్త.. భార్య మెడకు చున్నీ బిగించి హత్య చేశాడు.
దీంతో తప్పించుకోవడానికి పెనుగులాడిన దీనమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. నూకప్పారావు ఆ తరువాత నేరుగా అనకాపల్లి దిశ పోలీస్ స్టేషన్కు వెళ్లి… పోలీసుల ముందు లొంగిపోయాడు.
ఈ ఘటనకు సంబంధించి విఆర్వో సత్యనారాయణ ఫిర్యాదు చేశాడని ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎలమంచిలి రూరల్ సీఐ గఫూర్ తెలిపారు. ఘటన జరిగిన స్థలాన్ని క్లూస్ టీం పరిశీలించింది. మృతదేహాన్ని అనకాపల్లి 100 పడకల ఆసుపత్రికి తరలించారు.