ఏమిటీ... ఎన్టీఆర్ సైకిల్ పై పాలమ్మారా..! గల్లీలో కిరాణా షాప్ నడిపారా..!!
Nandamuri Taraka Ramarao : సీనియర్ ఎన్టీఆర్ సినీ, రాజకీయ ప్రస్థానం గురించి అందరికీ తెలుసు. వ్యక్తిగత జీవితం, పిల్లల గురించీ తెలుసు. కానీ చదువకునే రోజుల్లో ఆయన వ్యాపారాలు చేశారని ఎంతమందికి తెలుసు?

ఎన్టీఆర్ గురించి ఆసక్తికర విషయాలు
Nandamuri Taraka Ramarao : చాలామంది చరిత్రలో కలిసిపోతారు... కానీ అతికొద్దిమంది మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు. ఇలా చిరకాలం గుర్తిండేపేరు ఎన్టీఆర్. విలక్షణమైన పౌరాణిక, సామాజిక పాత్రలతో నటసార్వభౌముడిగానే కాదు ముఖ్యమంత్రిగా ప్రజారంజక పాలన అందించి ప్రజాపాలకుడిగానూ తెలుగు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు నందమూరి తారకరామారావు. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ తనదైన మార్క్ చూపించి ప్రజలు దేవుడిలా కొలిచే స్థాయికి చేరుకున్నారు.
అయితే ఆయన జీవితం ఓ తెరిచిన పుస్తకం... కానీ అందులో కొన్ని పేజీలు చాలామందికి తెలియవు. ఆయన బాల్యం, విద్యాభ్యాసం, సినీ, రాజకీయ జీవితం... ఇలా అన్నివిషయాలు తెలిసుంటాయి.. సినిమాల్లోకి వచ్చేముందు ఉద్యోగం చేసేవారని కూడా తెలుసు. కానీ అంతకుముందు చిరు వ్యాపారాలు చేసేవారని చాలామందికి తెలియదు. ఇంతకూ ఎన్టీఆర్ ఏ వ్యాపారాలు చేశారో ఇక్కడ తెలుసుకుందాం.
ఎన్టీఆర్ పాలమ్మారా..?
ఇటీవల దివంగత ఎన్టీఆర్ గురించి ఆయన కూతురు నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి ఎంతో కష్టపడేవారని... ఆరంభంలో ఆయన పాలుకూడా అమ్మారని అన్నారు. భువనేశ్వరి మాటలువిని చాలామంది ఆశ్చర్యపోయారు.. ఎన్టీఆర్ అనగానే చొక్కా మడతపడకుండా ఉండే రూపం, ఆ రాజసమే గుర్తుకువస్తుంది... అలాంటి వ్యక్తి సైకిల్ పై తిరుగుతూ పాలు అమ్మారా? ఏమిటీ.. ఇది నిజమే? అనే అనుమానే ఆ ఆశ్చర్యానికి కారణం.
ఎన్టీఆర్ ఉన్నత కుటుంబంలోనే జన్మించారు... కానీ ఆయన యుక్తవయసుకు వచ్చేసరికి వివిధ కారణాలతో ఆస్తులు హరించుకుపోయాయి. దీంతో కాలేజీ చదువుకునే రోజుల్లో ఆయనకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి... దీంతో డబ్బు సంపాదించుకునేందుకు అనేక పనులు చేశారు. అందులో పాలవ్యాపారం ఒకటి. ఉదయమే పాడిరైతుల నుండి పాలు సేకరించి వాటిని సైకిల్ పెట్టుకుని వెళ్లి అమ్మేవారు ఎన్టీఆర్. ఇలా కొంతకాలం పాలవ్యాపారం చేస్తూనే చదువు కొనసాగించారు.
కిరాణా దుకాణం కూడా నడిపిన ఎన్టీఆర్
నందమూరి తారకరామారావు చేసిన మరో వ్యాపారం కిరాణా కొట్టు. కాలేజీ రోజుల్లో కుటుంబానికి భారం కాకుండా ఉండేందుకు కిరాణ దుకాణం పెట్టుకున్నారు... దీనిద్వారా వచ్చే ఆదాయాన్ని తన చదువుకు ఉపయోగించారు. ఇలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఆత్మాభిమానంతో వ్యాపారాలు చేశారే తప్ప అప్పులు చేయలేదు. కిరాణా దుకాణం తర్వాత ఓ ప్రింటింగ్ ప్రెస్ ను కూడా నడిపారు ఎన్టీఆర్.
ఎన్టీఆర్ ఉద్యోగం
ఎంతో కష్టపడి చదువుకున్న ఎన్టీఆర్ సరిగ్గా భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడాదే అంటే 1947 లో పట్టుభద్రులయ్యారు. ఆ తర్వాత ఆనాటి మద్రాస్ రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్ష రాసి మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ గా ప్రభుత్వ ఉద్యోగం పొందారు. అయితే అప్పటికే సినిమాలపై మక్కువతో ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి మద్రాస్ రైలెక్కారు... ఈ నిర్ణయం ఎన్టీఆర్ జీవితాన్ని మార్చేసింది. నటసార్వభౌముడిగా, ప్రజారంజక పాలకుడిగా మనముందు ఉంచింది.
ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితం
నందమూరి తారక రామారావు 1923, మే 28న ఉమ్మడి కృష్ణా జిల్లా పామర్రు మండలం నిమ్మకూరు గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు లక్ష్మయ్య, వెంకటరామమ్మ. చదువుకునే వయసులోనే మేనమామ కూతురు బసవరామ తారకంతో వివాహం అయ్యింది. వీరికి మొత్తం 11 మంది సంతానం. ఎన్టీఆర్ పిల్లల్లో బాలకృష్ణతో పాటు దివంగత హరికృష్ణ ఆయన సినీవారసత్వాన్ని కొనసాగించగా... కూతురు పురంధరేశ్వరి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.