- Home
- Andhra Pradesh
- తగ్గేదేలే ‘బ్రో’.. అంబటి వర్సెస్ జనసేన.. కౌంటర్ అటాక్స్‌తో పొలిటికల్ హీట్, ఓవర్ టూ ఢిల్లీ..!
తగ్గేదేలే ‘బ్రో’.. అంబటి వర్సెస్ జనసేన.. కౌంటర్ అటాక్స్‌తో పొలిటికల్ హీట్, ఓవర్ టూ ఢిల్లీ..!
ఏపీలో ‘‘బ్రో’’ చిత్రంపై రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని శ్యాంబాబు పాత్ర తనను అవమానించేందుకు చేర్చారని ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపిస్తుండగా.. అలాంటిదేమి లేదని బ్రో చిత్ర బృందం చెబుతోంది.

ఏపీలో ‘‘బ్రో’’ చిత్రంపై రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని శ్యాంబాబు పాత్ర తనను అవమానించేందుకు చేర్చారని ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపిస్తుండగా.. అలాంటిదేమి లేదని బ్రో చిత్ర బృందం చెబుతోంది. ఈ క్రమంలోనే చెలరేగిన వివాదం రోజురోజుకు ముదురుతోంది. అటు అంబటి రాంబాబు, వైసీపీ శ్రేణులు.. ఇటు జనసేన నాయకులు తగ్గేదేలే అంటూ విమర్శలకు దిగుతున్నారు.
సాయిధరమ్ తేజ్ హీరోగా పవన్ కల్యాణ్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘‘బ్రో’’. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 28న థియేటర్లలోకి వచ్చింది. అయితే ఈ చిత్రంలో శ్యాంబాబు పాత్రను థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ పోషించారు. అయితే ఈ పాత్ర ద్వారా తనను అవమానించే ప్రయత్నం చేశారని మంత్రి అంబటి రాంబాబు చెబుతున్నారు. సంక్రాంతి వేడుకల సందర్భంగా తాను వేసిన డ్యాన్స్‌ను ఉద్దేశించి కించపరిచేలా ఈ సీన్ చొప్పించారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్‌పై విమర్శలకు దిగారు. రాజకీయంగా ఎదుర్కొలేకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ శునకానందం పొందుతున్నారని కూడా విమర్శించారు.
అయితే ఈ వివాదంపై స్పందించిన బ్రో చిత్ర బృందం.. తాము ఎవరిని ఉద్దేశించి ఆ పాత్రను సృష్టించలేదని, స్క్రిప్ట్ మేరకే శ్యాంబాబు క్యారెక్టర్‌ను తీర్చిదిద్దామని, ఎవరినో కించపరచాలని ఆ సన్నివేశాలను చిత్రీకరించలేదని తెలిపింది. శ్యాంబాబు పాత్ర పోషించిన పృథ్వీ.. అంబటి రాంబాబు ఆస్కార్ నటుడేం కాదని అన్నారు. తాము ఎవరిని ఉద్దేశించి ఈ పాత్ర చేయలేదని అన్నారు.
‘‘ఒక పనికిమాలిన వెధవ, బాధ్యతలేని వెధవ, బారుల్లో పడి తాగుతుంటాడు, అమ్మాయిలతో డాన్స్ చేస్తాడు, ఇదీ మీ క్యారెక్టర్ అని దర్శకుడు చెప్పాడు.. నేను చేశాను’’ అని కూడా పృథ్వీ చెప్పారు. మరోవైపు చిత్ర బృందం కూడా పలుమార్లు.. ఇది ఎవరిని ఉద్దేశించి చేసినది కాదని చెప్పుకుంది.
అయితే మరోవైపు ఇది అంబటి రాంబాబుపై వేసిన సెటైరేనని చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు చేయసాగారు. మరోవైపు అంబటి రాంబాబు కూడా.. పవన్‌పై విమర్శల దాటిని పెంచారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన రాంబాబు.. ఈ చిత్రంతో బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చు ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. చంద్రబాబు ముఠా బ్రో చిత్ర నిర్మాత విశ్వప్రసాద్‌తో పవన్‌కు ప్యాకేజ్ ఇప్పించిందని కూడా ఆరోపణలు చేశారు. బ్రో చిత్ర ఒక డిజాస్టర్ అని కూడా చెప్పుకొచ్చారు.
అదే సమయంలో తాను కూడా పవన్‌పై సినిమా తీస్తానని.. మూడు పెళ్లిళ్ల అంశాన్ని ప్రస్తావిస్తూ వ్యంగ్యస్త్రాలు సంధించారు. ‘నిత్య పెళ్లికొడుకు’, ‘తాలి-ఎగతాళి’, ‘బహుభార్య ప్రవీణుడు’, ‘మూడు ముళ్లు-ఆరు పెళ్లిల్లు’, మ్రోవంటి టైటిల్స్ పరిశీలిస్తున్నామని కూడా చెప్పారు. తెలుగు చలనచిత్రసీమలో ఉన్న నిర్మాతలు, నటులు, దర్శకులు, త్రివిక్రమ్‌లాంటి రచయితలకు చెప్తున్నా. ఇలా మళ్లీ మళ్లీ చేస్తే మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ఈ క్రమంలోనే మొత్తంగా ఈ రచ్చకు రాజకీయ రంగు పులుముకుంది.
అయితే అంబటి రాంబాబు చేసిన కామెంట్స్‌పై అటు మూవీ టీమ్ కూడా ఘాటుగానే బదులిచ్చింది. సినిమాలకు రాజకీయాలతో ముడిపెట్టొద్దని కూడా హీరో సాయితేజ్ అన్నారు. మరోవైపు రాంబాబు చేసిన ఆరోపణలను చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఖండించారు. పలు మీడియా చానల్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో.. ఈ రాజకీయ విమర్శలను తాము ఊహించలేదని ఆయన అన్నారు. మంచైనా, చెడైనా సినిమాకు పబ్లిసిటీ అవసరమని.. అయితే ఇలాంటి పబ్లిసిటీ తమకు అక్కర్లేదని అన్నారు.
అసలు శ్యాంబాబు డాన్స్‌కు సంక్రాంతి సంబరాల్లో రాంబాబు వేసిన డాన్స్‌కు సింకే లేదని అన్నారు. శ్యాంబాబు రాజకీయ నాయకుడు కాదని, మ్యూజిక్ ఒక్కటి కాదని.. అన్నీ తేడాగానే ఉన్నాయని చెప్పారు. కాకపోతే ఒక్క టీ-షర్ట్ మ్యాచ్ అవుతుందని.. దాన్ని పట్టుకుని వివాదం చేయడం కరెక్ట్ కాదన్నారు. అలాగే ఒకవేళ మంత్రి రాంబాబు తనను కించపరచడానికే ఈ పాత్ర చేశారని ఆయన అనుకుంటే తామేం చేయలేమని అన్నారు.
తాము పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై సినిమాను నిర్మించామని విశ్వప్రసాద్ చెప్పారు. నెట్ ఫ్లిక్స్, జీ తెలుగు తమకు ఆదాయ మార్గాలు అన్నారు. పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్, ఈ సినిమాకు అయిన ఖర్చును చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఈ సినిమాకు ఎంత ఖర్చు అయిందనేది.. జీటీవీకి, తమకు క్లియర్ ఐడియా ఉందని చెప్పారు. పవన్‌కు తాము ఎంత ఇచ్చామనే దానిపై ఆయన ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేసినప్పుడు ఆయన ఫైల్ చేసుకుంటారు.. మేము చేసుకున్నప్పుడు మేము చేసుకుంటామని తెలిపారు.
మరోవైపు జనసేన నాయకులు కూడా అంబటి రాంబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన పవన్ కల్యాణ్‌పై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడుతున్నారు. పవన్ కల్యాణ్‌పై సినిమా తీస్తానని.. అందుకు మ్రోతోపాటు మరికొన్ని పేర్లను పరిశీలిస్తున్నట్టుగా కూడా అంబటి చెప్పారు. అయితే ఇందుకు కౌంటర్‌గా జనసైనికులు పలు రకాలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుపతిలో జనసేన నేతలు, కార్యకర్తలు.. SSS (సందులో సంబరాల శ్యాంబాబు) పేరుతో రాంబాబుపై సినిమా నిర్మించనున్నట్టుగా తెలిపారు.
మంత్రి అంబటి రాంబాబు తీయబోయే సినిమాకు కౌంటర్‌గా వెబ్ సిరీస్ తీయాలనుకుంటున్నామని జనసేన నేత పోతిన మహేష్ చెప్పారు. బుధవారంనాడు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాము తీయబోయే వెబ్ సీరిస్‌కు కొన్ని పేర్లను పరిశీలిస్తున్నట్టుగా చెప్పారు. తల్లి చెల్లి ఖైదీ నెంబర్ 6093, , గొడ్డలి, డాటర్ ఆఫ్ వివేకా, కోడికత్తి సమేత శీను, డ్రైవర్ డోర్ డెలివరీ, అరగంట అద్దె ఇల్లు, ఓ ఖైదీ వదిలిన బాణం వంటి పేర్లను పరిశీలిస్తున్నామన్నారు. ఇదిలా ఉంటే.. బ్రో చిత్రం లావాదేవీలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసేందుకు మంత్రి అంబటి రాంబాబు సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే ఆయన ఈరోజు రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు.