మహిళలకు ఉచిత బస్ ప్రయాణమే కాదు ఇంకెన్నో..: రక్షాబంధన్ వేడుకల్లో చంద్రబాబు హామీలు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రక్షా బంధన్ సందర్భంగా టిడిపి అధికారంలోకి వస్తే మహిళలకు ఏం చేయనున్నారో మరోసారి వివరించారు.

TDP
అమరావతి : తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన రక్షా బంధన్ వేడుకల్లో ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితతో పాటు టిడిపి మహిళా నాయకురాళ్లు, బ్రహ్మ కుమారీస్ చంద్రబాబుకు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా మహిళా అభ్యున్నతికి గతంలో టిడిపి ప్రభుత్వం ఏం చేసిందో గుర్తుచేసుకున్న చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పారు. మహిళలకు రక్షణ అందించడమే కాదు వారి అభ్యున్నతికి పాటుపడే పార్టీ టిడిపి అని అన్నారు.
TDP
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో అనేకమంది మహిళలను రాజకీయ అవకాశాలు దక్కాయని చంద్రబాబు అన్నారు. ఇక ఎన్ఠీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మహిళా సంక్షేమం మొదలయ్యిందని అన్నారు. 1986లోనే ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో హక్కు కల్పిస్తూ చట్టం చేశారన్నారు. ఆర్టిసిలో మహిళలకు కండక్టర్లుగా అవకాశం ఇచ్చింది తానేనని చంద్రబాబు అన్నారు.
TDP
రిజర్వేషన్లు వున్నప్పటికీ రాజకీయాల్లో మహిళలకు సరైన ప్రాధాన్యత దక్కడంలేదని... చట్టసభల్లోకి వారు మరింతమంది రావాలన్నారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వచ్చేవరకూ టీడీపీ కృషి చేస్తోందని చంద్రబాబు అన్నారు. మహిళ మగవారితో సమానంగా పోటీ పడే పరిస్థితి రావాలన్నారు.
TDP
భవిష్యత్తు కోసం ముందుగా ప్రణాళికలు వేసే పార్టీ టీడీపీ... అందుకే అధికారంలోకి రాగానే మహిళల కోసం ఏం చేస్తామో ముందుగానే ప్రకటించామని అన్నారు. మహిళా శక్తి పధకం కింద మహిళలను అన్ని రకాలుగా ఆదుకుంటామన్నారు. దీపం పథకం కింద ఉచితంగా నాలుగు గ్యాస్ సిలిండర్ ఇస్తామని చంద్రబాబు కీలక ప్రకటన చేసారు.
TDP
మహిళల కోసం ప్రత్యేకంగా పద్మావతీ యూనివర్సిటీ పెట్టిన పార్టీ తెలుగుదేశం అని చంద్రబాబు అన్నారు. ఆడబిడ్డలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో 33 శాతం రిజర్వేషన్లు పెట్టింది కూడా టిడిపి ప్రభుత్వమేనని అన్నారు. ఈ నిర్ణయంతో మహిళలు ఎంతో లబ్ది పొందారన్నారు. మహిళలకు ఉద్యోగావకాశాలు లభించడంతో వరకట్నం అనే సమస్య చాలావరకు తగ్గిందన్నారు. ఇలాంటి ప్రభుత్వ పాలసీలతో ఆడబిడ్డల జీవితాలు మార్చాం... అదీ తెలుగు దేశం ముందుచూపు అని చంద్రబాబు అన్నారు.
TDP
ఆడబిడ్డల ఆర్థిక స్వావలంబన కోసం డ్వాక్రా సంఘాలు పెట్టామని... భర్త, తండ్రి, పిల్లలపై మహిళలు ఆధారపడకుండా చేసి వారిలో ఆత్మస్థైర్యం నింపామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే బడికి వెళ్లే ఆడపిల్లలకు సైకిళ్లు ఇచ్చామని చంద్రబాబు గుర్తుచేసారు. అంతేకాదు ఆడబిడ్డల ఆత్మగౌరవం కోసం మరుగుదొడ్లు కట్టించిన పార్టీ టీడీపీ అని అన్నారు.
chandrababu naidu
టిడిపి అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. గతంలో ఎన్టీఆర్ ఆత్మగౌరవం ఇస్తే...నేను ఆత్మస్థైర్యం ఇచ్చాను.. దీనితోనే మహిళలు అద్బుతాలు సృష్టించే అవకాశం ఉందన్నారు. తెలుగు ఆడబిడ్డలను శక్తివంతమైన మహిళలుగా మార్చడమే తన లక్ష్యమని అన్నారు. మీ ఆశీర్వాదాలు తనకు అందించాలని మహిళలను చంద్రబాబు కోరారు.