ఐటీలో హైదరాబాద్ తో Andhra Pradesh పోటీ... లక్షల ఉద్యోగాల భర్తీకి రంగం సిద్దం
ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ, డేటా సెంటర్లు, జీసీసీల ద్వారా నాలుగేళ్లలో 10 లక్షల ఉద్యోగాల లక్ష్యంగా నారా లోకేశ్ కార్యాచరణ ప్రారంభం చేశారు.

నాలుగేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి దిశగా మరొక పెద్ద అడుగు వేసింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ద్వారా వచ్చే నాలుగేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యాన్ని రాష్ట్ర విద్యా, ఐటీ మంత్రి నారా లోకేశ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఉండవల్లిలో జరిగిన సమీక్షా సమావేశంలో అధికారులతో చర్చిస్తూ వెల్లడించారు.
95 కంపెనీలు..లక్ష కోట్ల పెట్టుబడులు
ఈ సమీక్షలో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో ముఖ్యంగా ఇప్పటివరకు 95 ప్రముఖ కంపెనీలు రూ. లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించాయని లోకేశ్ పేర్కొన్నారు. వీటిలో టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలు విశాఖపట్నంలో భూమి కేటాయింపులు పూర్తిచేసుకున్నాయని అధికారులు నివేదించగా, వీటి కార్యకలాపాలు వెంటనే ప్రారంభం కావాల్సిన అవసరముందని మంత్రి స్పష్టం చేశారు.
35,000 ఉద్యోగాలు
ఇటీవలి బెంగళూరు పర్యటన సందర్భంగా ఏఎన్‌ఎస్‌ఆర్, సత్వ సంస్థలు జీసీసీ కేంద్రాల కోసం ఒప్పందాలు చేసుకున్నాయని, వీటి ద్వారా దాదాపు 35,000 ఉద్యోగాలు వచ్చినే అవకాశముందని లోకేశ్ వివరించారు. ఎంఓయూ కుదుర్చుకున్న ప్రతి సంస్థతో నిరంతరం సంప్రదింపులు జరిపి వారి యూనిట్లు నెలకొల్పేందుకు అవసరమైన అనుమతులు, మౌలిక సదుపాయాలు వెంటనే అందించాల్సిందిగా అధికారులను కోరారు.
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్
రాష్ట్రంలో నెలకొల్పే చిన్న సంస్థల కోసం 26 జిల్లాల్లో కో-వర్కింగ్ స్పేస్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. యువతకు అవకాశం కల్పించే విధంగా ఈ ఏర్పాట్లు ఉండాలన్నారు.
ఇన్నోవేషన్ రంగాన్ని ఉత్సాహపరిచే మరో పెద్ద ప్రాజెక్టులో భాగంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను రాష్ట్రంలో త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుపతి, అనంతపురం నగరాల్లో ప్రాంతీయ స్పోక్స్ కేంద్రాల ఏర్పాటుకు ఏర్పాట్లు సాగుతున్నాయని పేర్కొన్నారు.
టీసీఎస్, ఎల్ అండ్ టీ, ఐబీఎం
అమరావతిలో స్థాపించనున్న క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి టీసీఎస్, ఎల్ అండ్ టీ, ఐబీఎంలతో భాగస్వామ్య సంస్థ ముందుకొచ్చినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌కు అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటుపై అధికారులు దృష్టిసారించాలని సూచించారు.
ఇక కర్నూలు జిల్లాలో డ్రోన్ సిటీ నిర్మాణానికి కూడా కార్యాచరణ రూపొందించబడింది. ఓర్వకల్లులో 400 ఎకరాల్లో డ్రోన్ సిటీని నిర్మించి ఒకే ఏడాదిలో పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వ్యవసాయం, పోలీస్ విభాగం, వాతావరణ విభాగాల్లో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించేలా నెలకు ఒక జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఇటీవల బుడమేరు వరదల సమయంలో డ్రోన్ల సాయంతో ఏ విధంగా సాయం,పని జరిగిందన్నదే ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు.
మనమిత్ర వాట్సాప్ సేవలు
పౌరసేవల్లో ఎంతో ప్రజాదరణ పొందిన మనమిత్ర వాట్సాప్ సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలని లోకేశ్ అన్నారు. ప్రస్తుతం అందుతున్న 535 సేవలను ఇంకా మెరుగుపరచాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు వాడే ధృవపత్రాలు రెవెన్యూ కార్యాలయాలకు వెళ్లకుండా మనమిత్ర ద్వారా పొందేలా బ్లాక్‌చైన్ టెక్నాలజీని వినియోగించాలని చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలల్లో టెక్నాలజీ ప్రాధాన్యతను పెంచేందుకు 45,000 స్కూల్‌లకు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇవ్వాలని, విద్యార్థులు గూగుల్ లాంటి ప్లాట్‌ఫాంలను ఉపయోగించే అవకాశాలు కల్పించాలన్నారు. అలాగే విశాఖ, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి ఎయిర్‌పోర్టుల్లో మొబైల్ నెట్‌వర్క్ సిగ్నల్స్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.