‘అవును.. వందమంది రాజారెడ్డీలు కలిస్తే.. ఒక్క జగన్.. అయితే ఏంటి...’
వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.

పల్నాడు జిల్లా : వైసిపి నేత అంబటి రాంబాబు వైయస్ జగన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. 100 మంది రాజారెడ్డిలతో సమానం అంటూ.. వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అక్కడి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళితే..
‘అవును.. వందమంది రాజారెడ్డిలు కలిస్తే ఒక్క జగన్మోహన్ రెడ్డి. అయితే ఏంటీ? రాజారెడ్డి ఏమైనా విలనా? రాష్ట్రానికి రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిలాంటి నాయకులను అందించారు.. అంటూ చెప్పుకొచ్చారు. టిడిపి నేత కన్నా లక్ష్మీనారాయణ చేసిన విమర్శలపై ఆదివారం నాడు అంబటి రాంబాబు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో విలేకరులతో మాట్లాడారు.
ఆయన చేసిన విమర్శలపై స్పందిస్తున్న నేపథ్యంలో రాంబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. కన్నా లక్ష్మీనారాయణకు జగన్ గురించి ముందే తెలుసన్నారు. అందుకే గతంలో ఆయన ప్రాపకం కోసం 500 కార్లతో ర్యాలీగా బయలుదేరారని గుర్తు చేశారు.
చివరి సమయంలో గుండె నొప్పి వచ్చిందంటూ నాటకాలు ఎందుకు ఆడారో చెప్పాలని డిమాండ్ చేశారు. బిజెపికి చెందిన ఎన్నికల డబ్బును కన్నా మింగేశాడు. అలాంటి వ్యక్తికి నన్ను, ముఖ్యమంత్రిని.. విమర్శించే నైతిక అర్హత లేదు. కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తారో… చివరికి వచ్చేసరికి గతంలో లాగా పారిపోతారో తెలియదు.
ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోవడానికి నేనేం చంద్రబాబును కాదు. నేను పుట్టింది రేపల్లెలో.. వైయస్ రాజశేఖర్ రెడ్డి శిష్యుడిని. చచ్చిపోయేది సత్తెనపల్లిలో’ అని ఘాటుగా విమర్శించారు అంబటి.
అంతకుముందు శనివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ వారాహి వాహనంపై పూనకం వచ్చినట్లుగా ఊగిపోతున్నాడని విమర్శించారు. వైసిపి నేతలను ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని చెప్పులతో కొడతానని, బట్టలూడదీసి కొడతానని అంటున్నారని.. అతను కొడతా అనగానే కొట్టించుకోవడానికి మేము తేరగా ఉన్నామా? అంటూ అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.
పవన్ కళ్యాణ్ కు అవగాహన లేదని, పరిపక్వత లేదని ఎద్దేవా చేశారు. రాజకీయాలు అంటే సినిమా షూటింగులు అనుకునే పరిస్థితిలోనే పవన్ కళ్యాణ్ ఉన్నారని సెటైర్లు వేశారు.