Asianet News TeluguAsianet News Telugu

లేయర్‌తో జాగ్రత్త: శామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 2రోజులకే డ్యామేజ్!

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ దిగ్గజం శామ్సంగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మార్కెట్లోకి తీసుకొచ్చిన ఫోల్డబుల్(మడత) స్మార్ట్‌‌ఫోన్‌పై అప్పుడే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 

Samsung folding phones are breaking after just two days
Author
Seoul, First Published Apr 20, 2019, 5:24 PM IST

న్యూయార్క్/సియోల్: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ దిగ్గజం శామ్సంగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మార్కెట్లోకి తీసుకొచ్చిన ఫోల్డబుల్(మడత) స్మార్ట్‌‌ఫోన్‌పై అప్పుడే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తాము కొన్న రెండు రోజులకే డిస్‌ప్లే డ్యామేజీ అయ్యిందంటూ మొరపెట్టుకుంటున్నారు కస్టమర్లు.

ఒకవైపు మాత్రమే పని చేస్తోందంటూ ఒకరు..  శామ్సంగ్ నుంచి వచ్చిన తొలి చెత్త ఫోన్ ఇదేనంటూ మరొకరు దుమ్మెత్తిపోస్తున్నారు. కాగా, ఏప్రిల్ 26 నుంచి ఈ ఫోల్డబుల్ ఫోన్లను భారీ ఎత్తున మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఇలాంటి విషయాలు వెలుగులోకి రావడంతో ఆ సంస్థకు తలనొప్పిగా మారింది. 

అయితే, పుస్తకంలా ఓపెన్ చేసే విధంగా ఉండే ఈ ఫోన్ కొన్నిసార్లు ఓపెన్ చేయగానే.. సరిగా పనిచేయడం లేదంటూ వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఫోన్‌పై ప్రొటెక్టివ్ లేయర్‌ను కొందరు వినియోగదారులు తెలియక తీసేయడంతో ఆ ఫోన్ స్క్రీన్ సరిగా పనిచేయడం లేదు. తన తప్పును తెలుసుకున్న ఓ వినియోగదారుడు ఫోన్ పై ఉన్న లేయర్‌ను తొలగించొద్దంటూ ఇతర వినియోగదారులకు సూచించాడు. అయితే, లేయర్ విషయంలో వినియోగదారులకు శామ్సంగ్ ముందే అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వారంటున్నారు.

శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్ ధర కూడా 2000డాలర్లు(రూ.1.4లక్షలు) భారీగా ఉండటం గమనార్హం. అయినా చాలా మంది మార్కెట్లోకి వచ్చిన తొలి ఫోల్డబుల్ ఫోన్ అందుకోవాలనే ఉత్సాహంతో భారీగా ఆర్డర్లు చేశారు. అనుకున్న దానికంటే ఎక్కువ బుకింగ్స్ రావడంతో శామ్సంగ్ బుకింగ్స్ నిలిపేసింది కూడా.

ప్రపంచ వ్యాప్తంగా 1 మిలియన్ ఫోన్లను అమ్మాలని నిర్ణయించుకున్నప్పటికీ.. డిమాండ్‌ను చూస్తే 300 మిలియన్ల ఫోన్లు ఏడాదిలోనే అమ్మేయ గల అవకాశం ఉన్నట్లు సంస్థ అంచనాలకు వచ్చింది. 

ఈ సమయంలోనే శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్లు అందుకున్న కస్టమర్లు సోషల్ మీడియా వేదికగా తమ ఫోన్ల పనితీరుపై విమర్శలు చేస్తుండటం గమనార్హం. ఫోల్డబుల్ స్క్రీన్ తొందరగా డ్యామేజీ అవుతుందంటూ వాపోతున్నారు. కాగా, ఎన్నో అత్యాధునిక ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్‌కు.. ఫోల్డబుల్ స్క్రేనే సమస్యగా మారింది. అయితే, ఫోల్డబుల్ స్క్రీన్ సమస్య ఎదుర్కోలేని వారు మాత్రం ఈ ఫోన్ అద్భుతంగా ఉందంటూ ప్రశంసిస్తున్నారు.

చదవండి: అండర్ Rs. 15,000: బెస్ట్ కెమెరా ఫోన్స్ ఇవే..

Follow Us:
Download App:
  • android
  • ios