ఆపిల్‌కు హువాయ్ చెక్: తగ్గిన స్మార్ట్‌ఫోన్ల సేల్స్


అంతర్జాతీయంగా స్మార్ట్ ఫోన్ల విక్రయాల్లో టెక్ దిగ్గజం ఆపిల్‌ను చైనా మేజర్ హువాయ్ దాటేసింది. గత మూడు నెలల్లో స్మార్ట్ ఫోన్ల విక్రయాల్లో రెండో స్థానానికి చేరుకున్నదని ఐడీసీ తెలిపింది.  
 

Huawei Jumps Ahead of Apple in Tough Smartphone Market: IDC

శాన్‌ఫ్రాన్సిస్కో: ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు తగ్గిపోతున్నాయి. తత్ఫలితంగా అన్ని కంపెనీలకు సవాళ్లు ఎదురవుతున్నాయి. దిగ్గజ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలు శామ్‌సంగ్‌, ఆపిల్‌ తదితర సంస్థల ఫోన్ల విక్రయాలు క్షీణిస్తున్నాయి. 

కానీ ఇదేకాలంలో చైనాకు చెందిన హువాయ్ మాత్రం అమ్మకాలు పెంచుకోవడమే కాక మార్కెట్‌ వాటా విషయంలో మరింత పట్టు సాధిస్తుండటం విశేషం. స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌ పరంగా ఇప్పటిదాకా కాలిఫోర్నియాకు చెందిన ఆపిల్‌ రెండో స్థానంలో ఉండేది. 

ఆపిల్ స్థానాన్ని చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ హువాయ్ సొంతం చేసుకుందని చైనాకు చెందిన ఇంటర్నేషనల్‌ డేటా కార్పొరేషన్‌ (ఐడీసీ) తెలిపింది. ఈ ఏడాది మొదటి త్రైమాసికానికి ప్రముఖ మొబైల్‌ కంపెనీల అమ్మకాల గణాంకాలను హువాయ్ వెల్లడించింది.  
 
ఈ ఏడాది తొలి మూడు నెలల్లో 31.08 కోట్ల స్మార్ట్‌ఫోన్లు అమ్ముడు పోయాయి. గత ఏడాది ఇదే కాలం (33.27 కోట్లు)తో పోల్చితే అమ్మకాలు 6.6 శాతం మేర తగ్గాయి. 

వరుసగా ఆరు త్రైమాసికాల్లో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు తగ్గాయి. దీన్ని బట్టి ఈ ఏడాదిలోనూ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు తగ్గవచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మొదటి త్రైమాసికంలో సామ్‌సంగ్‌ అమ్మకాలు 8.1 శాతం తగ్గి 7.19 కోట్లకు చేరుకున్నాయి. మార్కెట్‌ వాటా 23.1 శాతం. ఇదే కాలంలో హువాయ్ అమ్మకాలు 50.3 శాతం వృద్ధి చెంది 5.91 కోట్లకు చేరాయి. దీంతో ఈ కంపెనీ రెండో స్థానంలో నిలిచింది. మార్కెట్‌ వాటా 19 శాతంగా నమోదైంది.

ఆపిల్‌ ఐఫోన్ల అమ్మకాలు మాత్రం తొలి త్రైమాసికంలో 30.2 శాతం తగ్గి 3.64 కోట్ల యూనిట్లకు చేరాయి. దీంతో ఈ కంపెనీ మూడోస్థానానికి జారిపోయింది. మార్కెట్‌ వాటా 11.7 శాతంగా నమోదైంది. వరుసగా తర్వాతి స్థానాల్లో షామీ, వివో, ఒప్పో కంపెనీలు నిలిచాయి.

కొత్త ఫోన్లకు అప్‌గ్రేడ్‌ కావడానికి కస్టమర్లు ఎదురుచూస్తుండటంతోనే స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలపై ప్రభావం పడుతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
5జీ టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో చాలా మంది వినియోగదారులు 5జీ ఫోన్ల కోసం కూడా వేచి చూస్తున్నట్టు సమాచారం.

ఇదిలా ఉంటే దీర్ఘకాలికంగా చూస్తే భారత్‌ చాలా ముఖ్యమైన మార్కెట్‌ అని, స్వల్పకాలంలో మాత్రం చాలా సవాలుతో కూడుకున్నదని ఆపిల్‌ సీఈఓ టిక్‌ కుక్‌ పేర్కొన్నారు. ఈ మార్కెట్‌ నుంచి తాము చాలా నేర్చుకుంటున్నామని అన్నారు. భారత మార్కెట్‌లో తమ స్థానాన్ని కాపాడుకునేందుకు కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నామని, వీటి ఫలితాలు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

భారత్‌లో రిటైల్‌ స్టోర్ల ఏర్పాటు యోచనలో ఉన్నామని, ఇందుకు సంబంధించిన అనుమతుల కోసం ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ తెలిపారు. భారత్‌లోనే ఫోన్ల తయారీని ప్రారంభించామన్నారు.

 ఫలితంగా కస్టమర్లకు మరింత అందుబాటు ధరల్లోనే ఫోన్లను అందించే అవకాశం ఉంటుందని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ చెప్పారు. భారత్‌లో యాపిల్‌కు గట్టిపోటీ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌ ధరను గత నెలలో 22 శాతం వరకు తగ్గించింది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios