పాంగోంగ్ సరస్సు ఉత్తర ఒడ్డున ఉన్న ఫింగర్ 2,  ఫింగర్ 3 లలో చైనా దళాలు భారత భూభాగాల్లోకి మరింతగా ప్రవేశించి, అక్కడ స్థానాలను ఆక్రమించాయని ఈ మధ్యకాలంలో పుకార్లు  షికార్లు చేస్తున్నాయి. లడఖ్ మాజీ బిజెపి ఎంపి వ్యాఖ్యలను ఉటంకిస్తూ, ది హిందూ వార్తాపత్రికలో ఒక నివేదిక ప్రచురితమయింది. 

'సరిహద్దు వద్ద పరిస్థితి చాలా సంక్లిష్టంగా మారింది. చైనా దళాలు మన ప్రాంతాలలోకి మరింతగా ప్రవేశించడమే కాక, పాంగోంగ్ సమీపంలోని ఫింగర్ 2, 3 ప్రాంతాలలో, వారు ప్రముఖ స్థానాలను ఆక్రమించారు , అంతేకాకుండా  హాట్ స్ప్రింగ్స్ ప్రాంతాలను కూడా వారు పూర్తిగా ఖాళీ చేయలేదని" ప్రచురించింది. 

కానీ భారత ప్రభుత్వం, ఆర్మీ ఈ వార్తలను ఖండించాయి. ఫార్వర్డ్ పోస్టుల్లో భారత భద్రతాబలగాలు అహర్నిశలు కాపలా కాస్తున్నారని ఆర్మీ పేర్కొంది. 

అంతేకాకుండా మరో ప్రకటనలో, సైన్యం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఉటంకిస్తూ... : "మా ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి విపరీతమైన వాతావరణం, శత్రు శక్తులతో ధైర్యంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్న మా దళాలకు ఉత్తమ ఆయుధాలు, పరికరాలు, దుస్తులు లభ్యమయ్యేలా చూడటం మా జాతీయ బాధ్యత." అని అన్నారు.