నటి జరీన్ ఖాన్‌ను సల్మాన్‌ తన 'వీర్‌' సినిమా ద్వారా వెండితెరకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆ తరువాత మరోసారి సల్మాన్ నటించిన 'రెడీ' సినిమా అవకాశం దక్కించుకుంది. 'హౌస్ ఫుల్ 4' వంటి సినిమాల్లో నటించింది.

ఇది ఇలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలలో జరీనా పొట్ట భాగంలో కుట్లు కనిపించడంతో సోషల్ మీడియాలో ఆమెని ట్రోల్ చేస్తున్నారు. 'పొట్టపై ఆ కుట్లు ఏంటి..? బరువు తగ్గడానికి సర్జరీ చేయించుకున్నా..? అసలు అంతలా లావెక్కడం ఎందుకు' అంటూ బాడీ షేమింగ్ చేస్తున్నారు. నెటిజన్లు  ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేస్తుండడంతో జరీనా స్పందించింది. 

'నా పొట్టకు ఏమైందో తెలుసుకోవాలని ఎంతోమంది ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. యాభై కిలోలకు పైగా బరువు తగ్గిన వ్యక్తి పొట్ట సహజంగానే ఇలా ఉంటుంది. ఈ ఫోటోను ఫోటోషాప్ చేయలేదు. అలానే సర్జరీ కూడా చేయించుకోలేదు. నా అసలైన రూపాన్ని, నేచురల్ గా ఉండడాన్ని మాత్రమే నేను ఇష్టపడతాను. లోపాలు ఉన్నా కవర్ చేయాల్సిన అవసరం నాకు లేదు. దయచేసి బాడీ షేమింగ్ చేయడం మానుకోండి' అంటూ రాసుకొచ్చింది.

ఈ క్రమంలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆమెకి మద్దతు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో 'చాణక్య' అనే సినిమాలో నటిస్తోంది.