నందమూరి ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. తాతకు తగ్గ మనవడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా నటించే తారక్ కి లక్షల్లో అభిమానులు ఉన్నారు. నటుడిగా ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చిన యంగ్ టైగర్ పై మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. జూనియర్ ఎన్టీఆర్ ని నటుడిగా తీర్చిదిద్దింది గుడివాడ ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నాని అంటూ ఓ బహిరంగ సభలో వ్యాఖ్యానించారు.

తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ సీపీలోకి వచ్చిన తరువాత వరుసగా రెండు సార్లు గెలిచి ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో పౌరసరఫరాల శాఖ మంత్రి అయ్యారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన ఒక నెల, రెండు నెలల పాటు ఎప్పుడూ అభినందన సభలు జోరుగా జరుగుతుంటాయి. అదే విధంగా ఇప్పుడు కూడా ఓ ఆత్మీయ అభినందన సభ జరిగింది. ఇందులో మాట్లాడిన వారు కొడాలి నానిని పొగడ్తల్లో ముంచెత్తారు.

ఈ క్రమంలో మంత్రి పేర్ని నాని.. జూనియర్ ఎన్టీఆర్ కి నటనలో ఓనమాలు నేర్పిందే కొడాలి నాని అంటూ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. కొడాలి నాని హరికృష్ణ శిష్యుడు అని, జూనియర్ ఎన్టీఆర్ ని నటుడిగా తీర్చిదిద్దడంలో ఈయన పాత్ర ఎంతో ఉందని పేర్ని నాని చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ నటుడిగా ప్రారంభ దశలో ఉన్నప్పుడు కొడాలి నాని ఆయనతో సన్నిహితంగా ఉండేవారు.

కానీ దగ్గరుండి జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ని నిర్మించింది కొడాలి నాని అని పేర్ని నాని చెప్పడం ఇప్పుడు చర్చలకు దారితీస్తోంది. వైఎస్ఆర్ సీపీ సభలో ఆ పార్టీకి చెందిన మంత్రి.. ఎన్టీఆర్ ప్రస్తావనను తీసుకురావడం టీడీపీ శ్రేణులకు నచ్చడం లేదు. పార్టీ సభలో అధినేత జగన్ ని పొగుడుకోవడం మానేసి హరికృష్ణ, ఎన్టీఆర్ లను లాగడం ఏంటని మండిపడుతున్నారు. తారక్.. కొడాలి నానిని అన్నగా భావిస్తాడు.

తారక్ హీరోగా 'సాంబ' అనే సినిమాను కూడా తీశాడు నాని. అంత మాత్రానా.. ఎన్టీఆర్ కి నటించడం నేర్పింది, నటుడిగా తీర్చిదిద్దింది కొడాలి నాని అని చెప్పడం ఎంతవరకు సమంజసమని టీడీపీ సభ్యులు ప్రశ్నిస్తున్నాయి. ఇలాంటి అభినందన సభల్లో మంత్రివర్యులను పొగడడం కోసం కంట్రోల్ తప్పి మాట్లాడుతుంటారు. పేర్ని నాని విషయంలో కూడా అదే జరిగి ఉంటుందని సర్ది చెప్పుకుంటున్నారు అభిమానులు.