ఉత్తరాది ముద్దుగుమ్మ కియారా అద్వానీ 'భరత్ అనే నేను' చిత్రంతో తెలుగు తెరకి పరిచయమై నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత ఆమె నటించిన 'వినయ విధేయ రామ' ఫ్లాప్ కావడంతో మళ్లీ బాలీవుడ్ కి వెళ్లిపోయింది. వెబ్ సిరీస్, సినిమాలంటూ బిజీగా గడుపుతోంది. 

ఇటీవల ఆమె నటించిన 'కబీర్ సింగ్' సినిమా ఘన విజయం కావడంతో కియారా ఫాలోయింగ్ పెరిగిపోయింది. సందీప్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎన్ని వివాదాలు ఎదుర్కొందో అంతకంటే ఎక్కువ వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ క్రమంలో కియారా ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలపై స్పందించింది.

'కబీర్ సింగ్'పై వస్తోన్న వివాదాల గురించి, అలానే బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో ఎఫైర్ వార్తల గురించి మాట్లాడింది. సిద్ధార్థ్ తో డేటింగ్ లో ఉన్నానని వస్తోన్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని తేల్చి చెప్పింది. ప్రస్తుతం తను సింగిల్ గానే ఉంటున్నానని, కానీ కచ్చితంగా ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని చెప్పింది.

అనంతరం 'కబీర్ సింగ్'లో హీరో, హీరోయిన్లు ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడం గురించి మాట్లాడుతూ.. అలా కొట్టుకోవడం, నోటికొచ్చినట్లు తిట్టుకోవడం తనకు కూడా నచ్చదని..  కాకపోతే సినిమా వేరు, నిజ జీవితం వేరని చెప్పింది. తన జీవితంలో మాత్రం ఎలాంటి పరిస్థితులు ఎదురైనా.. తనపై తన భర్త చెయ్యి పడనివ్వనని.. చెప్పుకొచ్చింది.