దేశ వ్యాప్తంగా ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం సంచలనం సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఊహించని విధంగా భారీ వసూళ్లు రాబడుతోంది.
నార్త్ లో 'ది కశ్మీర్ ఫైల్స్' ప్రభంజనం కొనసాగుతోంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం ట్రేడ్ వర్గాలని సైతం ఆశ్చర్యంలో ముంచెత్తుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ చిత్రం చుట్టూ రాజకీయ అంశాలు కూడా ముడిపడి ఉండడంతో మీడియాలో ఈ మూవీ హాట్ టాపిక్ గా మారింది.
మహారాష్ట్రలోని పుణ్యక్షేత్రమైన నాసిక్ నగరంలో కశ్మీర్ ఫైల్స్ చిత్ర థియేటర్ వద్ద ఊహించని సంఘటన చోటు చేసుకుంది. సినిమా చూసేందుకు సమూహంగా వచ్చిన కొంతమంది మహిళలు మేడలో కాషాయ కండువాలు ధరించి వచ్చారు. వీరంతా విభిన్నంగా థియేటర్ వద్దకు రావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
కాషాయ కండువాలు తొలగించి లోపలికి వెళ్లాలని పోలీసులు మహిళలని కోరారు. దీనితో మహిళలు ససేమిరా అనడంతో అక్కడ చిన్నపాటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ చిత్రం 1990లో జరిగిన కశ్మీర్ పండిట్స్ వివాదం చుట్టూ అల్లుకున్న కథ. దీనితో ఈ సినిమాపై బిజెపి, కాంగ్రెస్ మధ్య ఢిల్లీ స్థాయిలో రాజకీయ రగడ జరుగుతోంది.
మార్చి 11న ఈ చిత్రం విడుదలయింది. వివాదం నెలకొన్న చిత్రం.. సున్నితమైన అంశాలు ఈ చిత్రంతో ముడిపడి ఉండడంతో థియేటర్స్ వద్ద పోలీసులు భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. దీనితో నాసిక్ లో ఈ మహిళలు కాషాయ కండువాలని ధరించి రావడంతో శాంతి భద్రతల విషయంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే ఆ మహిళలు.. తమ వద్ద ధరించాడనికి బ్యాడ్జీలు లేవని అందుకే సినిమా చూసేందుకు కండువాలు ధరించి వచ్చినట్లు పేర్కొన్నారు.
అంతకు మించి తమకు మరో ఉద్దేశం ఏమిలేదని పోలీసులకు తెలపడంతో వివాదం ముగిసింది. పోలీస్ అధికారి మాట్లాడుతూ ఈ వివాదం శాంతియుతంగా ముగిసింది. వారంతా కండువాలు ధరించి సమూహంగా రావడంతో ప్రశ్నించాం అంతే.. అంతకు మించి ఏమి జరగలేదు అని తెలిపారు.
అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. వివేక్ అగ్నిహోత్రి ఈ చిత్రానికి దర్శకుడు.
