ఇటీవల కోలీవుడ్ హీరోయిన్‌ వనిత విజయ్‌కుమార్‌ మూడో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తరుచూ వివాదాలతో సహవాసం చేసే ఈ నటి పెళ్లిపై పెద్ద దుమారమే చెలరేగింది. పెద్ద వాళ్లైన పిల్లలను పక్కన పెట్టుకొని పెళ్లి చేసుకోవటంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వినిపించాయి. అదే సమయంలో పీటర్‌ పాల్ మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకున్నాడన్న ఆరోపణలు వినిపించాయి.

అయితే ఈ ఆరోపణలపై వనిత కూడా ఘాటుగా స్పందించింది. తన వ్యక్తిగత జీవితం గురించి మీకు అనవసరం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. వనిత వ్యవహారంపై ఇండస్ట్రీ నుంచి కూడా విమర్శలు వినిపించాయి. లక్ష్మీ రామకృష్ణన్‌, కస్తూరి లాంటి వారు కూడా విమర్శలు చేయటంతో వనిత పోలీసులను ఆశ్రయించింది. తన పై విమర్శలు చేస్తూ వేదిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వనిత కంప్లయింట్‌ ఇచ్చింది.

వనిత ఇచ్చిన కంప్లయింట్‌ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు సూర్య దేవి అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం సూర్య దేవిని అరెస్ట్ చేయగా ఆమె గురువారం బెయిల్ పై విడుదలైంది. సూర్యదేవిని నటి కస్తూరి విడిపించినట్టుగా తెలుస్తోంది. అయితే వనిత కూడా సూర్య దేవికి బెయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేఖించటం లేదని తెలిపింది. ఆమె పిల్లల పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపింది వనిత.