సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ)పై ఫిర్యాదుల పర్వం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి మొదలుకుని తెలంగాణ రాజధాని హైదరాబాద్ వరకూ చాలా మంది వర్మ జీఎస్టీపై ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదుల సంగతి అటుంచితే పలు చానెల్స్ డిబెట్లలో వర్మతో పాల్గొన్న మహిళా నేతలు, విద్యార్థులు వర్మకు వ్యతిరేకంగా తీవ్రంగా మాట్లాడారు. అయితే అంతేరీతిలో వర్మ వాళ్లందరికీ షాకిచ్చేలా సమాధానమిచ్చారు కూడా.

 

సాధారణంగా టీవీ చర్చల్లో అంశంపై డిబేట్ తర్వాత ఎవరి పని వాళ్లు చూసుకుంటారు. కానీ వర్మ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మహిళా సంఘాల నేత, సామాజిక కార్యకర్త దేవీ పోలీసులు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ నగరంలోని సెంట్రల్ క్రైం స్టేషన్(సీసీఎస్) పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. రాంగోపాల్ వర్మపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దేవీ ఫిర్యాదుతో ఆర్జీవీపై మూడు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

 

అదే విధంగా మహిళలను కించపరిచే విధంగా ఉన్న  ‘గాడ్ సెక్స్ ట్రూత్’ (జీఎస్టీ) లఘుచిత్రాన్ని నిలిపివేయాలంటూ మహిళా సంఘాలు పోలీసులను కోరాయి. వర్మ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టింగ్‌లతో ఇబ్బందిపెడుతున్నారని మహిళా సంఘాల నేతలు తెలిపారు. కాగా ఆర్జీవీ దర్శకత్వంలో తెరకెక్కిన గాడ్, సెక్స్ ట్రూత్ అనే లఘుచిత్రం సినిమా రేపు (జనవరి-26) ఆన్‌లైన్‌లో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.