హాలీవుడ్‌ కామెడీ సినిమాల హీరో, దిగ్గజ నటుడు విల్‌ స్మిత్‌ నిరీక్షణ ఫలించింది. ఆయన ఫస్ట్ టైమ్‌ ఆస్కార్‌ అవార్డుని గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్టేజ్‌పై భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. 

ప్రముఖ హాలీవుడ్‌ దిగ్గజ నటుడు విల్‌ స్మిత్‌ కల నెరవేరింది. మూడున్నర దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. పలు సార్లు నిరాశ అనంతరం ఎట్టకేలకు ప్రపంచ అత్యున్నత పురస్కారం ఆస్కార్‌ ఆయన్ని వరించింది. ఉత్తమ నటుడిగా నిలబెట్టింది. అమెరికా బయోగ్రాఫికల్‌ స్పోర్ట్స్ డ్రామా `కింగ్‌ రిచర్డ్` చిత్రానికిగానూ విల్‌ స్మిత్‌ ఉత్తమనటుడిగా ఆస్కార్‌ అవార్డుని అందుకున్నారు. 

ఫస్ట్ టైమ్‌ ఆస్కార్‌ అందుకున్న సందర్భంగా విల్‌ స్మిత్‌ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను అకాడమీకి క్షమాపణలు చెబుతున్నాను. అలాగే నా తోటి నామినీలకు క్షమాపణలు చెబుతున్నా. కళ జీవితాన్ని అనుకరిస్తుంది. ఇందులో నేను నేను క్రేజీ తండ్రిలా కనిపిస్తాను. రిచర్డ్ విలియమ్స్ మాదిరిగా. కానీ ప్రేమ మిమ్మల్ని పిచ్చి పనులు చేసేలా చేస్తుంది` అంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. 

విల్‌ స్మిత్‌ గతంలో 2002లో `అలీ` చిత్రానికిగానూ ఉత్తమ నటుడిగా ఆస్కార్‌కి నామినేట్‌ అయ్యారు. కానీ అది దక్కలేదు. 2007లో మరోసారి `ది పర్య్సూట్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌` చిత్రానికి ఆస్కార్కి బెస్ట్ యాక్టర్‌గా నామినేట్‌ అయ్యాడు. కానీ నిరాశే ఎదురైంది. ఎట్టకేలకు 2022లో ఆయన కష్టం ఫలించింది. ఉత్తమ నటుడిగా నిలిచారు. అమెరికా టెన్నీస్‌ మాజీ క్రీడాకారుడు, టెన్నీస్‌ కోచ్‌ రిచర్డ్ విలియమ్స్ జీవితం ఆధారంగా `కింగ్‌రిచర్డ్` చిత్రాన్ని దర్శకుడు రీనాల్డో మార్కస్‌ గ్రీన్‌ తెరకెక్కించారు. రిచర్డ్ ప్రముఖ దిగ్గజ టెన్నీస్‌ క్రీడాకారులు వెనస్‌ విలియమ్స్, సెరెనా విలియమ్స్ ల తండ్రి కావడం విశేషం. 

ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ అందుకున్న ఐదవ నటుడిగా విల్ స్మిత్‌ నిలిచారు. హాలీవుడ్‌లో కామెడీ సినిమాలకు పెట్టింది పేరు విల్‌ స్మిత్‌. ఆయన కామెడీ చిత్రాలతోనే ఎంతో సందేశాన్ని అందిస్తారు. మన హృదయాలను దోచుకుంటారు. ఆయన `బ్యాడ్‌ బాయ్స్`, `మెన్‌ ఇన్‌ బ్లాక్‌` సిరీస్‌, `ఎనిమీ ఆఫ్‌ స్టేట్‌`, ``అలీ`, `ఐ, రోబోట్‌`, `షార్క్ టేల్`, `హిట్చ్`, `ఐ యామ్‌ లెజెండ్‌`, `హంకాక్‌`,`సెవెన్‌ పౌండ్స్`, `ది పర్స్యూట్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌`, `కంకూషన్‌`, `అల్లాదిన్‌` వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ చిత్రాల్లో నటించారు. హాలీవుడ్‌ దిగ్గన నటుల్లో ఒకరిగా నిలిచారు. 

ఇదిలా ఉంటే అంతకు ముందు ఈ 94వ అకాడమీ అవార్డ్స్ వేడుకలో విల్‌ స్మిత్‌ చేసిన పని అందరిని షాక్‌కి గురి చేసింది. ప్రెజెంటర్స్ లో ఒకరైన క్రిస్ రాక్ (Chris Rock)అవార్డ్ ప్రకటిస్తూ విల్ స్మిత్ వైఫ్ జడా పికెట్ స్మిత్ పై కొన్ని ఫన్నీ కామెంట్స్ చేశాడు. దీంతో కోపానికి గురైన విల్ స్మిత్ వేదికపై అందరూ చూస్తుండగానే క్రిష్ రాక్ ని చెంపచెళ్లుమనిపించాడు. నీ దరిద్రపు నోటి నుండి నా భార్య పేరు రానీయకు అంటూ... క్రిస్ రాక్ ముఖంపై పంచ్ విసిరాడు. ఈ హఠాత్పరిణామానికి ఆస్కార్ వేడుకకు హాజరైన ప్రపంచ ప్రఖ్యాత నటులు, దర్శక నిర్మాతలు షాక్ తిన్నారు. ఆ తర్వాత స్వారీ చెప్పడం విశేషం.