స్టార్ కమెడియన్ గా వందల సినిమాలలో నటించిన సునీల్, అందాల రాముడు మూవీతో హీరోగా మారాడు. అందాల రాముడు, మర్యాద రామన్న, పూలరంగడు చిత్రాలు మంచి విజయాలు అందుకోవడంతో హీరోగా కూడా సునీల్ సక్సెస్ అయ్యాడు అనుకున్నారు అందరు. ఐతే మొదట్లో కామెడీ హీరోగా చేసిన సునీల్ చిన్నగా మాస్ హీరో ఇమేజ్ కోసం ట్రై చేశాడు. సిక్స్ ప్యాక్ బాడీతో, కమర్షియల్ సబ్జక్ట్స్ వైపు అడుగులు వేశాడు. 

అప్పటి నుండి సునీల్ కి కష్టాలు మొదలయ్యాయి. సునీల్ హీరోగా చేసిన సినిమాలు వరుసగా పరాజయం పాలయ్యాయి. దీనితో సునీల్ కెరీర్ ఒక్కసారిగా డైలమాలో పడింది. మళ్ళీ కమెడియన్ గా చేయాలా, హీరోగానే కొనసాగాలా అనే సందిగ్ధం మొదలైంది. హీరోగా సునీల్ కి అవకాశాలు కనుమరుగు కావడంతో చేసేదేమి లేక కమెడియన్ గా మరలా రీ ఎంట్రీ ఇచ్చారు. అయినప్పటికీ మునుపటి హాస్యం ఆయన తెరపై పండించలేకపోయారు. 

దర్శకులు సైతం సునీల్ కి పూర్తి స్థాయి కమెడియన్ రోల్స్ ఆఫర్ చేయడం లేదు. దీనితో విలన్ గా సునీల్ ట్రై చేయడం జరిగింది. రవితేజ హీరోగా వచ్చిన డిస్కో రాజా మూవీలో సునీల్ విలన్ రోల్ చేయడం జరిగింది. విలన్ గా సునీల్ యాక్టింగ్ భిన్నంగా అనిపించింది. తాజాగా విడుదలైన కలర్ ఫోటో మూవీలో కూడా సునీల్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశారు. చిన్న సినిమాగా విడుదలై ప్రముఖుల ప్రసంశలు అందుకున్న ఈమూవీ పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది. 

పోలీస్ ఆఫీసర్ రామరాజు పాత్రలో సునీల్ అద్భుతంగా నటించారు.ఇకపై విలన్ గా సునీల్ సక్సెస్ కావచ్చనే మాట వినిపిస్తుంది. సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న సునీల్ కి కలర్ ఫోటో విజయం హెల్ప్ కావొచ్చు. సుహాస్, చాందిని చౌదరి  జంటగా నటించిన ఈ చిత్రానికి సందీప్ రాజ్ దర్శకత్వం వహించారు.