వారి స్నేహాన్ని చూడలేకపోయిన ఇండస్ట్రీ, సావిత్రి-జమున మధ్య చిచ్చు పెట్టింది ఎవరు?
సావిత్రి-జమున సొంత అక్కాచెల్లెళ్లు మాదిరి మెలిగేవారు. అయితే జమున పరిశ్రమకు వచ్చేందుకు ఊతం ఇచ్చిన సావిత్రితో కూడా జమున ఏడాది కాలం మాట్లాడలేదట.
సావిత్రి-జమున సొంత అక్కాచెల్లెళ్లు మాదిరి మెలిగేవారు. అయితే జమున పరిశ్రమకు వచ్చేందుకు ఊతం ఇచ్చిన సావిత్రితో కూడా జమున ఏడాది కాలం మాట్లాడలేదట.
సావిత్రి-జమున స్టార్ హీరోయిన్స్ గా సిల్వర్ స్క్రీన్ ని ఏలారు. సావిత్రి పరిశ్రమకు వచ్చిన కొంత కాలానికి జమున ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అనతికాలంలో ఫేమ్ తెచ్చుకున్న జమున... సావిత్రికి పోటీ ఇచ్చింది అనడంలో సందేహం లేదు.
అప్పట్లో సావిత్రి నెంబర్ వన్ అయితే.. నెంబర్ టు పొజీషన్ జమునదే. వీరిద్దరి మధ్య గొప్ప స్నేహం, అనుబంధం ఉండేవట. అయితే కొందరు చాడీలు చెప్పి మనస్పర్థలు తలెత్తేలా చేశారట. ఈ విషయాన్ని జమున ఓ ఇంటర్వ్యూలో స్వయంగా తెలియజేశారు.
జమునతో సావిత్రికి అలా పరిచయం
సావిత్రి స్టేజ్ ఆర్టిస్ట్. హీరోయిన్ కాకముందు నాటకాలు ఆడేవారు. అప్పట్లో నాటకాలకు కొన్ని ప్రసిద్ధ ప్రాంతాలు ఉండేవి. వ్యాపారం కోసం జమున ఫ్యామిలీ గుంటూరు జిల్లా దుగ్గిరాల వచ్చారట. నాటకాలు ఆడేందుకు అక్కడకొచ్చిన సావిత్రి పలుమార్లు జమున ఇంట్లో స్టే చేశారట. అప్పుడు జమునతో స్నేహం ఏర్పడింది.
అనంతరం సావిత్రి మద్రాస్ వెళ్లారు. పాతాళ భైరవి సినిమాలో తళుక్కున మెరిసింది. సావిత్రి సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన మొదటి చిత్రం అదే. సావిత్రికి స్టార్డం తెచ్చిన మూవీ దేవదాసు. అక్కినేని నాగేశ్వరావు, సావిత్రి జంటగా నటించిన ఈ ట్రాజిక్ లవ్ డ్రామా భారీ విజయం
అందుకుంది. ఒక్కో చిత్రానికి తన ఇమేజ్ పెంచుకుంటూ సావిత్రి స్టార్ అయ్యారు.
జమునతో కొనసాగిన స్నేహం
స్టార్ హీరోయిన్ అయినప్పటికీ సావిత్రి జమునను మర్చిపోలేదు. ఆమెతో స్నేహం కొనసాగించిందట. తరచుగా కలుస్తూ, మాట్లాడుతూ ఉండేదట. అప్పుడే సావిత్రికి జమునను కూడా పరిశ్రమకు తీసుకు రావాలనే ఆలోచన వచ్చిందట. ఈ విషయాన్ని జమున పేరెంట్స్ చెప్పి సావిత్రి ఒప్పించిందట.
జమున కూడా నటి కావడానికి కావాల్సిన అన్ని కళలు నేర్చుకుంది. అలాగే జమునకు కూడా నటన పట్ల మక్కువ ఉంది. శాస్త్రీయ నృత్యంలో ప్రావీణ్యం ఉంది. దాంతో సావిత్రి ప్రతిపాదనకు ఆమె సంతోషించింది. సావిత్రి మద్దతుతో జమున పరిశ్రమలో అడుగుపెట్టింది. తన అందం, అభినయంతో జమున అనతికాలంలో గుర్తింపు తెచ్చుకున్నారు.
జమున-సావిత్రిలది బ్లాక్ బస్టర్ కాంబినేషన్
సావిత్రి-జమున అనేక చిత్రాల్లో కలిసి నటించారు. స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సావిత్రి జమునను అక్కా అని పిలిచేవారట. మిస్సమ్మ, గుండమ్మ కథ వంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ లో వీరు కలిసి నటించారు. మిస్సమ్మలో జమున అమాయకపు పల్లెటూరి జమిందారు కూతురు పాత్రలో మెప్పించింది. ఇక క్రిస్టియన్ అమ్మాయి మేరీగా సావిత్రి నటన ఎవర్ గ్రీన్. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్ వంటి లెజెండ్స్ ఆ చిత్రంలో నటించారు.
గుండమ్మకథలో సైతం జమున, సావిత్రి అద్భుతమైన పాత్రలు చేశారు. సావిత్రి పేద అమ్మాయిగా కనిపిస్తుంది. ఈ చిత్రంలో కూడా ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్ నటించారు. సూర్యకాంతం నటన ఆకట్టుకుంటుంది. మిస్సమ్మ, గుండమ్మకథ తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోలేని చిత్రాలు అనడంలో సందేహం లేదు. ప్రేక్షకుల్లో సావిత్రి, జమున కలిసి నటిస్తున్న సినిమా అంటే... ఓ హైప్ ఉండేది.
సావిత్రితో జమునకు మనస్పర్థలు
సావిత్రి, జమున సొంత అక్క చెల్లెళ్ళ కంటే మిన్నగా ఉండేవారట. పరిశ్రమకు తనను తీసుకొచ్చిందన్న కృతజ్ఞతాభావం జమున లో ఉండేదట. వీరి అనుబంధం చూసి కొందరు కుళ్ళు కున్నారు. అన్యోన్యత చూడలేని వారు, ఇద్దరి మధ్య గొడవలు పెట్టారట. ఒకరి మీద మరొకరికి చాడీలు, చెప్పుడు మాటలు చెప్పారట. దాంతో సావిత్రి-జమున మధ్య దూరం పెరిగిందట. ఏకంగా ఏడాది పాటు మాట్లాడుకో లేదట. అనంతరం ఇద్దరికీ అసలు విషయం తెలిసిందట. సావిత్రి, జమున మరలా దగ్గరయ్యారట. యధావిధిగా మాట్లాడుకున్నారట.
జమున పెళ్లిలో సావిత్రి అన్నీ తానై వ్యవహరించిందట. జమునను పెళ్లి కూతురిని చేసి, పీటల వద్దకు తీసుకొచ్చిందట. సావిత్రి మరణించే వరకు జమునతో అనుబంధం కొనసాగిందట. సావిత్రి చివరి రోజుల్లో పడ్డ కష్టాలు, ఆమె జీవితం ముగిసిన విధానం కలచి వేసిందని జమున గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
నిష్క్రమించిన లెజెండ్స్
ఒకప్పుడు వైభవం చూసిన సావిత్రి దుర్భర స్థితికి చేరుకున్నారు. కాలం గడిచేకొద్దీ ఆమె ఆస్తులు, అంతస్తులు కరిగిపోయాయి. మరోవైపు భర్తకు దూరమై మనో వేదన అనుభవించింది. జెమినీ గణేశన్ చేసిన మోసం నుండి బయటపడేందుకు మద్యానికి బానిసయ్యింది.
ఆమె కెరీర్ కూడా నెమ్మదించింది. తల్లి పాత్రలకు పడిపోయింది. చివరికి అనారోగ్యం పాలైంది. 19 నెలలు కోమాలో ఉన్న సావిత్రి 1981 డిసెంబర్ 26న కన్నుమూశారు. చివరి రోజుల్లో ఆమెను చూసేవారు, ఆదరించేవారు కరువయ్యారు.
ఇక జమున 1991లో చివరిసారిగా ఓ కన్నడ చిత్రంలో నటించారు. ఆమె మద్రాస్ నుండి హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు. 86 ఏళ్ల వయసులో జమున 2023 జనవరి 27న కన్నుమూశారు.