టాలీవుడ్ కుర్ర హీరో శర్వానంద్ నటించిన 'రణరంగం' సినిమా ఆగస్ట్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై శర్వా చాలా ఆశలే పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో '96' సినిమా తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు.

ప్రేమ కుమార్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో సమంతహీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తరువాత శర్వా ఎవరితో సినిమా చేస్తారనే విషయంలో ముగ్గురు దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి.

'భలే మంచి రోజు', 'దేవదాసు' వంటి సినిమాలను రూపొందించిన దర్శకుడు శ్రీరాం ఆదిత్య ఇటీవల శర్వాకి ఓ కథ వినిపించినట్లు తెలుస్తోంది. ఫైనల్ డ్రాఫ్ట్ విన్న తరువాత శర్వా ఈ సినిమాపై ఓ నిర్ణయానికి రానున్నాడు. అలానే కిషోరుడు అనే కొత్త దర్శకుడు శర్వాతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. 

ఈ ఇద్దరితో పాటు మేర్లపాక గాంధీ కూడా శర్వానంద్ కి కథ చెప్పే పనిలో ఉన్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో 'ఎక్స్ ప్రెస్ రాజా' సినిమా వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. మరి ఈ ముగ్గురు దర్శకుల్లో శర్వానంద్ ఎవరికి ఓకే చెప్తాడనే విషయంలో త్వరలోనే స్పష్టత రానుంది.