స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ అంటే తెలియని సినీ అభిమాని ఉండరు. మాస్ చిత్రాలతో ఆయన తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్నాడు. మాస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన వినాయక్ స్టార్ హీరోలకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించారు. ప్రస్తుతం వివి వినాయక్ దర్శకుడిగా సరైన ఫామ్ లో లేరు. వినాయక్ చివరగా తెరకెక్కించిన ఇంటెలిజెంట్ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. 

దర్శకుడిగా వినాయక్ తదుపరి చిత్రం గురించి అనేక ఊహాగానాలు వస్తున్నా ఏదీ ఖరారు కావడం లేదు. కానీ వినాయక్ తొలిసారి దిల్ రాజు నిర్మాణంలో హీరోగా ఓ చిత్రం చేస్తున్నారు. ఇదిలా ఉండగా వినాయక్ తాజాగా రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారారు. 

ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాపు కార్పొరేషన్ చైర్మన్ గావైసీపీకి చెందిన యువ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాని నియమించారు. ఈ కార్యక్రమానికి వినాయక్ హాజరు కావడం విశేషం. ఈ కార్యక్రమంలో రాజా తండ్రి జక్కంపూడి రామ్మోహనరావు అంటే తనకు అభిమానం అని వినాయక్ అన్నారు. తండ్రి తరహాలోనే రాజా కూడా ప్రజా అభిమానాన్ని పొందాలని కోరారు. 

ఈ సందర్భంగా రాజాకు కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చిన జగన్ కు వినాయక్ కృతజ్ఞతలు తెలిపారు. జగన్ ప్రసంగాలు, మాటలు తనలో స్ఫూర్తిని నింపాయని వినాయక్ అన్నారు. ఒక రాజకీయ పార్టీ కార్యక్రమానికి హాజరు కావడంతో వినాయక్ వైసిపిలో చేరబోతున్నట్లు మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.