దర్శకుడుగా శ్రీను వైట్ల...ఏ స్దాయికి వెళ్లారో అందరికీ తెలిసిందే. చాలా కాలం పాటు సక్సెస్ కు చిరునామాగా వెలిగారు. కామెడీ సినిమాలంటే శ్రీను వైట్లే చేయాలనే నిర్ణయానికి స్టార్స్ వచ్చే స్దాయికి వచ్చారు. అయితే కాలం తిరగబడింది. తను మొదలెట్టిన ఫార్ములానే రొటీన్ గా మారి వరస ఫ్లాఫ్ ల వర్షం కురిపించేసింది. దానినుంచి కోలుకుందామని చేసిన ఏ సినిమా ఆడలేదు. రవితేజ తో చేసిన అమర్ అక్బర్ ఆంటోని డిజాస్టర్ తర్వాత ఆయన గ్యాప్ తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఓ మరో హిలేరియస్ ఎంటర్టైనర్ రెడీ చేసుకుని రంగంలోకి దూకబోతున్నట్లు సమాచారం. అయితే శ్రీను వైట్లకు డేట్స్ ఇచ్చే హీరో ఎవరు. ఇంకెవరు మంచు విష్ణు. ఈ విషయాన్ని అఫీషియల్ గా ఖరారు చేసారు విష్ణు.

దర్శకుడు శ్రీను వైట్ల కెరీర్‌లో  ‘ఢీ’ సినిమా ఒక కుదుపు. అప్పటిదాకా సాదా సీదాగా నడిచిన కెరీర్ ఒక్కసారిగా జెట్ స్పీడుని ఢీతో అందుకుంది. ఆ సినిమా  శ్రీను వైట్లని పూర్తి బిజీ చేసేసింది. అలాగే 2007లో వచ్చిన ఈ సినిమా మంచు విష్ణు కెరీర్‌లోనూ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అయితే, 13 ఏళ్ల తరవాత ఇప్పుడు ఈ హిట్ కాంబో రిపీట్ కాబోతోంది. ఈ విషయాన్ని మంచు విష్ణు స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

‘‘కొన్ని వేల మంది సినీ ప్రేమికులకు ‘ఢీ’ ఒక ఫేవరేట్ ఫిలిం. ఈ సినిమాకు పనిచేసిన కాస్ట్, క్రూ అందరి జీవితాలు మారిపోయాయి. ఆ సమయంలో సినిమాల్లో కొత్త ఒరవడికి ఈ చిత్రం కారణమైంది. ‘ఢీ’ కంటే గొప్పగా ఏం తీయగలం?’’ అని మంచు విష్ణు పేర్కొన్నారు. అంతేకాదు, తన పుట్టినరోజు అయిన నవంబర్ 23న ఈ చిత్రానికి సంబంధించి ప్రకటన చేయనున్నారు. అయితే, ఇది ‘ఢీ’కి సీక్వెల్ అవునా కాదా అనేది తెలియాల్సి ఉంది.