అల్లు కుటుంబానికి సినీరంగంతో ఎంతటి అనుబంధం ఉందో తెలియంది కాదు. నిర్మాత అల్లు అరవింద్ కు బంధువైన విరాన్ ముత్తంశెట్టి కూడా నటన పట్ల తనకున్న అభిరుచిని చాటుకునేందుకు హీరోగా పరిచయం కాబోతున్నారు.

పి.సి.ఎం. స్టూడియో, మైత్రి అసోసియేషన్ పతాకాలపై చిట్టిశర్మ దర్శకత్వంలో సి.హెచ్.వి.యస్.ఎన్. బాబ్జి ప్రొడక్షన్ నెం.1గా నిర్మించే చిత్రం ద్వారా విరాన్ ముత్తంశెట్టి అరంగేట్రం చేయబోతున్నారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం దేవుడు అవతారం ఎత్తుతాడనేది గీతా సారాంశం. కానీ ధర్మం నశించి.. ఆ దేవుడి ఉనికే ప్రశ్నగా మారిన ఇప్పటి లోకానికి ఆ దేవుడిని పరిచయం చేసిన ఓ యువకుడి కథే ఈ చిత్రమని నిర్మాత సి.హెచ్.వి.యస్.ఎన్. బాబ్జి తెలిపారు.

సరికొత్త కథనంతో తెలుగు, తమిళ, మలయాళ భాషలలో ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు.. డివోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ మొదటివారం నుంచి ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. సహ నిర్మాత ఇ.ధర్మప్రసాద్ మాట్లాడుతూ, తిరుపతి, పశ్చిమ గోదావరి, రంపచోడవరం, కేరళ, తమిళనాడు పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుతాం.

కేరళలోని అనంత పద్మనాభస్వామి దేవాలయం వెనుక ఉన్న చరిత్ర నేపథ్యంలో.. గ్రాఫిక్స్ ప్రధానంగా సాగే ఈ చిత్రంలోని ఇతర నటీనటుల వివరాలను త్వరలో వెల్లడిస్తాం. ఉగాది నుంచి మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతాయని ఆయన తెలిపారు. 

ఈ చిత్రానికి సంగీతం-జీబు, కెమెరా-సూర్యప్రకాష్, ఎడిటింగ్-ఆవుల వెంకటేష్, ఆర్ట్-జి.బాబ్జి, సహ నిర్మాత-ఇ.ధర్మప్రసాద్, నిర్మాత-సి.హెచ్.వి.యస్.ఎన్.బాబ్జి, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం-చిట్టిశర్మ.