ఆరోజు నన్ను కాదని బాహుబలికి.. తెలుగు సినిమాని తమిళంలో ఎంకరేజ్ చేయడం లేదు అనే ప్రశ్నకు విక్రమ్ ఆన్సర్
ఐ' చిత్రానికి మేము జాతీయ అవార్డు కోసం ప్రయత్నిస్తున్నప్పుడు తమిళ జ్యూరీ మెంబర్ ఒకరు నాకు చెప్పారు. మేము బాహుబలి తమిళ వర్షన్ ని జాతీయ అవార్డులకు పంపాలని ప్రయత్నిస్తున్నాం. అందుకే మీ చిత్రానికి సపోర్ట్ చేయలేకున్నాం అని చెప్పారు.

చియాన్ విక్రమ్ వివాదాలకు దూరంగా ఉంటూ విలక్షణ నటనతో ఆడియన్స్ ని ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నారు. శివపుత్రుడు, అపరిచితుడు, ఐ లాంటి చిత్రాలు విక్రమ్ నటనకు, సాహసాలకు అద్దం పడతాయి. పాత్ర కోసం ఎంతటి సాహసమైనా చేస్తూ అందులో పరకాయ ప్రవేశం చేస్తాడు విక్రమ్.
మరోసారి ఆడియన్స్ ని తన నటనతో అబ్బురపరిచేందుకు విక్రమ్ రెడీ అవుతున్నారు. విక్రమ్ ప్రస్తుతం నటిస్తున్న తంగలాన్ చిత్ర టీజర్ బుధవారం విడుదలైంది. పా రంజిత్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. టీజర్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.. విక్రమ్ నటన, బాడీ లాంగ్వేజ్ వణుకు పుట్టించేలా ఉన్నాయి.
విచిత్రమైన అఘోర తరహా గెటప్ లో విక్రమ్ జీవించాడు అనే చెప్పాలి.మాళవిక మోహనన్ కీలక పాత్రలో నటిస్తోంది. జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. టీజర్ లాంచ్ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించింది. మీడియా సమావేశంలో విక్రమ్ కూడా పాల్గొన్నారు.
మీడియా సమావేశంలో విక్రమ్ కి రిపోర్టర్స్ నుంచి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. తమిళ సినిమాని తెలుగు ఆడియన్స్ ఎంకరేజ్ చేసినంతగా.. తెలుగు సినిమాని తమిళ ఆడియన్స్ ఎంకరేజ్ చేయడం లేదు దీనికి కారణం ఏంటి అని ప్రశ్నించారు. విక్రమ్ బదులిస్తూ.. అందులో వాస్తవం లేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలు తమిళనాడులో టాప్ గ్రాసర్స్ గా నిలిచాయి కదా. తెలుగు సినిమాకి మేము ఎంత ప్రాముఖ్యత ఇస్తాం అనేదానికి ఒక ఉదాహరణ చెబుతాను.
'ఐ' చిత్రానికి మేము జాతీయ అవార్డు కోసం ప్రయత్నిస్తున్నప్పుడు తమిళ జ్యూరీ మెంబర్ ఒకరు నాకు చెప్పారు. మేము బాహుబలి తమిళ వర్షన్ ని జాతీయ అవార్డులకు పంపాలని ప్రయత్నిస్తున్నాం. అందుకే మీ చిత్రానికి సపోర్ట్ చేయలేకున్నాం అని చెప్పారు. ఇక్కడ చూడండి తెలుగు సినిమాకి మేము ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో అని విక్రమ్ అన్నారు.
ఇతర భాషా చిత్రాలన్నీ తమిళంలో బాగా ఆడాయి. కాంతారా, కెజిఎఫ్ చిత్రాలే అందుకు ఉదాహరణ. నిర్మాత జ్ఞానవేల్ రాజా కూడా ఈ విషయాన్ని ఖండించారు. మేకర్స్ మైండ్ సెట్ మారాలని.. ఇప్పుడు సినిమాకి భాషా బేధం లేదని అన్నారు.
విక్రమ్ మాట్లాడుతూ.. నేను నటించిన శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ వంటి మూవీస్ లాగే తంగలాన్ ఒక డిఫరెంట్ మూవీ. మీకు టీజర్ తో తెలిసి ఉంటుంది. ఇదొక ఎమోషనల్ మూవీ, రా కంటెంట్ తో ఉంటుంది. ఈ స్క్రిప్ట్ చేసిన తర్వాత రంజిత్ ఒక ట్రాన్స్ లోకి వెళ్లిపోయాడు. సినిమా గ్రామర్ పాటించని సినిమా ఇది. పాటలు, ఫైట్స్, ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ ఇలా పా.రంజిత్ డిజైన్ చేయలేదు. తంగలాన్ లో ఒక లైఫ్ ఉంటుంది. తంగలాన్ ఒక డిఫరెంట్ మూవీ. కొన్నిసార్లు ఒక సీన్ ఒకే షాట్ లో చేశాము. లైవ్ సౌండింగ్ లో చేసేవాళ్లం. ఈ సినిమా నాకొక బ్యూటిఫుల్ ఎక్సీపిరియన్స్. ఎందుకంటే ఇప్పటిదాకా నేను లైవ్ సౌండింగ్ లో సినిమా చేయలేదు. నా ప్రతి సినిమాలో కొంత గొంతు మార్చి మాట్లాడుతుంటా. ఈ సినిమాలోనూ అలాగే డైలాగ్స్ చెప్పాను. రోజంతా రెస్ట్ లేకుండా పనిచేసేవాళ్లం.