నటీనటులు: కళ్యాణ్ దేవ్, మాళవికా నాయర్, తనికెళ్ళభరణి, మురళీ శర్మ, నాజర్ తదితరులు 
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్ 
ఛాయాగ్రహణం: కెకె.సెంథిల్ కుమార్
నిర్మాణం: సాయి కొర్రపాటి
నిర్మాత: రజని కొర్రపాటి
కథ-చిత్రానువాదం-మాటలు-దర్శకత్వం: రాకేష్ శశి

మెగా ఫ్యామిలీ నుండి ఎందరో హీరోలు ఇండస్ట్రీలో అడుగుపెట్టి తమ సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రాకేశ్ శశి దర్శకత్వంలో కళ్యాణ్ దేవ్ నటించిన 'విజేత' సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో కళ్యాణ్ దేవ్ కు ఎలాంటి విజయం దక్కిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!
 
కథ: 
రామ్(కళ్యాణ్ దేవ్)ను చిన్నప్పటినుండి ఎంతో ప్రేమగా చూసుకుంటాడు అతడి తండ్రి శ్రీనివాస్(మురళీశర్మ). రామ్ తనకు నచ్చిన పని చేయాలని మొదటి నుండి అతడి ప్రోత్సహిస్తూ ఉంటాడు. కానీ రామ్ మాత్రం తన స్నేహితులతో కలిసి ఆవారాగా తిరుగుతుంటాడు. తన ఎదురింట్లో కొత్తగా దిగిన జైత్ర(మాళవికా నాయర్)అనే అమ్మాయిని ప్రేమించడం మొదలుపెడతాడు. ఆమె మాత్రం రామ్ ను పెద్దగా పట్టించుకోదు. రామ్ ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్లినా.. అతడికి జాబ్ మాత్రం రాదు. కొడుకు సెటిల్ అయితే చూడాలని అనుకునే శ్రీనివాస్ కు రామ్ చేసే అల్లరి వ్యవహారాలు తెలిసి బాధ పడతాడు. దీంతో రామ్ 'లోకల్ బాయ్స్' అనే పేరుతో ఈవెంట్స్ చేయడం మొదలుపెడతాడు. అది కూడా మొదట్లో సక్సెస్ కాదు. దాని కారణంగా రామ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సివస్తుంది. కొడుకు తనను పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించాడనే బాధలో శ్రీనివాస్ కు గుండెపోటు వస్తుంది. ఆ తరువాత ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి..? తండ్రి ప్రేమను రామ్ అర్ధం చేసుకోగలిగాడా..? చివరికి రామ్ ఎలా సెటిల్ అవుతాడు..? అతడి ప్రేమ గెలుస్తుందా? అనేదే సినిమా. 

విశ్లేషణ: 
తెలుగులో కలర్ ఫిలిమ్స్ రావడం మొదలైన దగ్గర నుండి 'విజేత' లాంటి కథలతో కొన్ని వందల సినిమాలు వచ్చాయి. సాధారణంగా హీరో అతడి తండ్రి ఓ ఎమోషనల్ స్టోరీ.. చివరికి తన తండ్రి కోసం హీరో పెద్ద ప్రయోజకుడు అవ్వడం. రెగ్యులర్ గా ఇలాంటి కథలు వింటూనే ఉన్నాం. అయితే ఇక్కడ దర్శకుడు కొత్తగా అనుకొని ప్రేక్షకులు మరింత కొత్తగా ఫీల్ అవుతారనుకున్న పాయింట్ ఒకటి ఉంది. ఏంటంటే.. హీరో కారణంగా అతడి తండ్రి ఎలా 'విజేత' అయ్యాడనేది. అయితే ఈ పాయింట్ వినూత్నంగా ఉంటుందని అనుకున్నప్పటికీ తెరపై మాత్రం ఊహించే విధంగానే ఉంది. సినిమా సెకండ్ హాఫ్ మొదలైన తరువాత స్టోరీ మొత్తం ప్రేక్షకులకు ముందే అర్ధమైపోతుంది. దర్శకుడు రాకేశ్ శశి ఇంకా పాత కాలంలోనే ఉండిపోయాడనిపిస్తుంది.

కొత్త దర్శకులు తమ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి సరికొత్త కథలతో ముందుకు దూసుకుపోతుంటే.. ఆల్రెడీ ఒక సినిమా చేసిన అనుభవం  ఉన్న రాకేశ్ శశి మాత్రం తన ప్రతిభను నిరూపించలేకపోయాడు. హీరో ఆవారాగా స్నేహితులతో తిరగడం, హీరోయిన్ ను చూడడం, రెండు, మూడు కామెడీ సీన్స్, ఓ రెండు పాటలు ఇలా ఫస్ట్ హాఫ్ ముగిసిపోతుంది. అప్పటివరకు లేని ఓ ఎమోషనల్ ప్లాట్ ను సెకండ్ హాఫ్ మొత్తం నడిపించే ప్రయత్నం చేశాడు. సడెన్ గా హీరోలో మార్పు. ఆ మార్పును తెరపై కాస్త బలంగా చూపించడం కోసం మరికొన్ని క్యారెక్టర్లను యాడ్ చేశారు. డైరెక్టర్ సీన్ ను ఎలివేట్ చేయడానికి పెట్టుకున్న క్యారెక్టర్లు హీరోని డామినేట్ చేసే విధంగా ఉన్నాయి. హీరో మంచితనంతో అతడి చెల్లికి పెద్ద పెళ్లి సంబంధం రావడం పరమ రొటీన్. ఇక క్లైమాక్స్ లో అతి కాస్త ఎక్కువైందనిపిస్తుంది. మధ్యతరగతి కుటుంబాలు అంటే జబ్బులు, హాస్పిటల్స్ అని చూపించడం.. వాటి మధ్య ఓ ఎమోషనల్ డ్రామా నడిపించడం కామన్ అయిపోయింది.

నిజానికి అదే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఓ లవ్ స్టోరీ, ఎమోషన్స్ తెరపై చక్కగా చూపించే అవకాశం ఉంది. కానీ డైరెక్టర్ రెగ్యులర్ ఫార్మాట్ తో సినిమా నడిపించడంతో ఆడియన్స్ కు ఈ విజేత పెద్దగా కనెక్ట్ కాలేకపోయింది. కళ్యాణ్ దేవ్ కు ఇది మొదటి సినిమా కాబట్టి కెమెరా ముందు కాస్త తడబడినట్లుగా అనిపిస్తుంది. అతడు ఎంత కాన్ఫిడెంట్ గా ఉందామని ప్రయత్నించినా.. ముఖంలో బెరుకు కొట్టొచ్చినట్లు కనిపించింది. ప్రేమ, ఎమోషన్, సెంటిమెంట్ ఇలా ఏ ఒక్క ఎమోషన్ ను కూడా సరిగ్గా పండించలేకపోయాడు. అతడి డైలాగ్ డెలివెరీ కూడా పెద్దగా ఆకట్టుకోదు. డాన్స్ లు మాత్రం బాగానే మ్యానేజ్ చేశాడు. మాళవికా నాయర్ తెరపై ఉన్నట్లు కూడా పెద్దగా కనిపించదు. ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదనే చెప్పాలి. మురళీశర్మ మధ్యతరగతి తండ్రి పాత్రలో ఇమిడిపోయారు. తండ్రి, కొడుకుల కాంబినేషన్ సీన్స్ తెరపై ఆకట్టుకునే విధంగా లేవు. వారి మధ్య బాండింగ్ ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. తనికెళ్లభరణి, జయప్రకాశ్, రాజీవ్ కనకాల తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

టెక్నికల్ గా మాత్రం సినిమాను క్వాలిటీతో నిర్మించారు. కెమెరా వర్క్ కు వంక పెట్టలేం. మ్యూజిక్ కూడా ఈ మధ్యకాలంలో వస్తోన్నపాటలతో పోలిస్తే కొత్తగా ఉందనే భావన కలుగుతుంది. సినిమా రెండు గంటల నిడివే అయినప్పటికీ చాలా వరకు ల్యాగ్ చేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. రెగ్యులర్ సినిమాలు ఇష్టపడే ఆడియన్స్ కు ఈ సినిమా ఫస్ట్ హాఫ్ బాగానే ఎంటర్టైన్ చేస్తుంది కానీ సెకండ్ హాఫ్ ను భరించాలంటే మాత్రం కాస్త సహనం ఉండాల్సిందే.  

రేటింగ్: 2/5