‘మధ్య తరగతి వాళ్లమైతే కలలు కనలేమా ఏంటీ’... విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
విజయ్ దేవరకొండ ఎక్కడికెళ్లినా తన సినిమాను ప్రమోట్ చేసుకోవడంలో ముందుంటారు. ఇక తాజాగా ‘కీడా కోలా’ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ లో రౌడీ హీరో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కెరీర్ లో మళ్లీ హిట్ల పంథా మొదలు పెట్టారు. చివరిగా ‘ఖుషీ’తో మంచి సక్సెస్ అందుకున్నారు. నెక్ట్స్ ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సందర్భంగా తన సినిమాను పలు విధాలుగా ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఫ్యామిలీ స్టార్ టీజర్ సెన్సేషన్ గా మారిన విషయం తెలిసిందే. ‘ఐరనే వంచాలా ఏంటీ’ అనే డైలాగ్ ఎంతలా ట్రోల్ అవుతుందో తెలిసిందే.
విమర్శలను కూడా తన సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ ను తీసుకొచ్చే విజయ్ పోస్టులు పెడుతున్నారు. పలు ఈవెంట్లలోనూ Family Star ను ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా ‘పెళ్లి చూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వస్తున్న ‘కీడా కోలా’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్ స్పీచ్ ఆసక్తికరంగా మారింది. తను సినిమా గురించి మాట్లాడే క్రమంలో.. మిడిల్ క్లాస్ డ్రీమ్స్ పైనా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడారు.
తాము నమ్మిన జీవనశైలి ద్వారానే ఈరోజు లైఫ్ లో బెటర్ పోజిషన్ లో ఉన్నామని తెలిపారు. జేబులో రూపాయి లేని రోజుల్లోనే ఈ ప్రపంచం మొత్తం తమదనే భావించి సినిమాల కోసం కష్టపడ్డామన్నారు. మిడిల్ క్లాస్ వారూ గొప్పగా కలలు కనాలని సూచించారు. ప్రతి ఫ్యామిలీకి ఒక పిల్లోడు వస్తాడు.. వాడు ఆ ఫ్యామిలీ ఫ్యూచర్ జనరేషన్ నే మారుస్తాడంటూ చెప్పుకొచ్చారు. ఆ అలాంటి సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ అని చెప్పుకొచ్చారు. ఇక ఈ టీజర్ లోని ‘ఐరనే వంచాలా’ డైలాగ్ ను గుర్తుచేసేలా కొన్ని లైన్స్ చెప్పారు... మధ్య తరగతి వాళ్లమైతే కలలు కనలేమా ఏంటీ? ఈరోజు డబ్బులు లేకుంటే రేపు సంపాదించలేమా ఏంటీ? ఎవడు అడ్డొచ్చినా గెలవలేమా ఏంటీ? అంటూ చెప్పిన డైలాగ్స్ వైరల్ గా మారాయి.
ఇక ‘కీడా కోలా’ చిత్రం నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చాలా రోజుల తర్వాత తరుణ్ భాస్కర్ నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. అలాగే ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా కూడా చకాచకా షూటింగ్ జరుపుకుంటోంది. రిలీజ్ కు సంబంధించిన పనులను పూర్తి చేసుకుంటోంది. పరుశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కథానాయిక. దిల్ రాజ్ నిర్మిస్తున్నారు.