విజయ్ దేవరకొండతో సినిమా చేయాలని ఉందని అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పుడా సినిమా ఖరారైనట్టు తెలుస్తుంది. తాజాగా ఆ పిక్ అదే విషయాన్ని స్పష్టం చేస్తుంది.
అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్(Janhvi Kapoor) బాలీవుడ్‌ని షేక్ చేస్తుంది. తన సినిమాలతో ఆకట్టుకుంటూ, మరోవైపు గ్లామర్ ఫోటోలతో ఇంటర్నెట్‌ని ఊపేస్తుంది. అయితే ఈ భామ చాలా రోజులుగా టాలీవుడ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకుంటుంది. తల్లి శ్రీదేవి మాదిరిగా తను కూడా సౌత్‌లో రాణించాలనేది తండ్రి బోనీ కపూర్ కోరిక. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే ఆమె విజయ్ దేవరకొండ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుందని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వీరి కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న నేపథ్యంలో ఆల్మోస్ట్ కన్ఫమ్ అనే వార్తలు వినిపిస్తున్నాయి.
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయిపోతున్నాడు. `లైగర్`(Liger) సినిమాతో ఆయన తెలుగుతోపాటు బాలీవుడ్‌పై కన్నేశాడు. ఇప్పటికే సౌత్‌లో విజయ్‌కి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. `డియర్ కామ్రేడ్` చిత్రాన్ని సౌత్ మొత్తం విడుదల చేసి ఆకట్టుకున్నారు. `లైగర్` చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్‌లో విడుదల చేస్తున్నారు. పూరీ జగన్నాథ్ మార్క్ మాస్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా ఆగస్ట్ లో రాబోతుంది.
మరోవైపు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో `జనగణమన` చిత్రం చేయబోతున్నారు. అయితే ఇందులో హీరోయిన్‌గా జాన్వీకపూర్ ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. ఇటీవల హిందీ నిర్మాత అపూర్వ మెహతా బర్త్ డే పార్టీలో తారలు పాల్గొన్నారు. అందులో భాగంగా పూరీ జగన్నాథ్, చార్మీతోపాటు విజయ్ దేవరకొండ కూడా పాల్గొన్నారు. `లైగర్` హీరోయిన్ అనన్యా పాండే హాజరైంది. వీరితోపాటు పలువురు బాలీవుడ్ తారలు మెరిశారు. అందులో జాన్వీ కపూర్ కూడా ఉంది.
ఈ పార్టీలోనే `లైగర్` టీమ్ ఓ ఫోటో దిగగా, ఆమె స్థానంలో జాన్వీ కపూర్‌తో మరో ఫోటో దిగారు విజయ్, చార్మీ. ప్రస్తుతం ఈ పిక్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తుంది. దీంతో నెక్ట్స్ పూరీ, విజయ్ సినిమాలో హీరోయిన్ కన్ఫమ్ అని తేల్చేస్తున్నారు నెటిజన్లు. ఇదిలా ఉంటే ఇందులో మనీష్ మల్హోత్రా కూడా ఉన్నారు. విజయ్ డైరెక్ట్ హిందీలోనూ కరణ్ జోహార్ ప్రొడక్షన్‌లో ఓ సినిమా చేయబోతున్నారని, అందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుందని తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. మొత్తంగా విజయ్ అంటే క్రష్ అని చెప్పిన జాన్వీ ఎట్టకేలకు ఆయనతో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసిందని కామెంట్లు చేస్తున్నారు ఇంటర్నెట్ అభిమానులు. అయితే `లైగర్`లో ఆమెనే నటించాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు.
